Home వరంగల్ రూరల్ నెలలో ఇద్దరు అధికారుల సస్పెన్షన్

నెలలో ఇద్దరు అధికారుల సస్పెన్షన్

Two officers were suspended in Revenue Department

మనతెలంగాణ/ ఎల్కతుర్తి : భూములకు పట్టాలు చేయడంలో అవక తవకాలకు పాల్పడిన ఇద్దరు అధికారులు సస్పెండ్ అయ్యారు. నెల రోజల వ్యవధిలో ఎల్కతుర్తి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఇద్దరు అధికారులు సస్పెన్షన్‌కు గురయ్యారు. రైతుల వద్ద నుంచి డబ్బులు తీసుకుంటూ అక్రమ పట్టాలు చేయడంతో పాటు ఇతరుల భూములను తమ పేర్ల మీదకు మార్చుకున్నందుకు వీరిపై వేటు పడగా కింది స్థాయి అధికారుల గుండెల్లో గుబులు పుడుతోంది.. కొంత మంది అధికారులు తమ వంతు ఎప్పుడు వస్తుందో అన్నట్లు భయాందోళనలకు గురవుతున్నట్లు తెలుస్తోంది. అయితే సాదాబైనామా విషయంలో కొంత మంది అధికారులు అక్రమాలకు పాల్పడడంతో పాటు రైతుల వద్ద నుంచి ఏజెంట్ల ద్వారా అడ్డగోలుగా డబ్బులు వసూలు చేసిన అధికారులపై కూడా జిల్లా అధికారులకు ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై జిల్లా యంత్రాంగం గుట్టు చప్పుడు కాకుండా విచారణ చేస్తున్నట్లు సమాచారం.
నెల రోజుల్లో ఇద్దరు : ఎప్పుడెప్పుడు సాదాబైనామా వస్తుందా.. ఎప్పుడెప్పుడు సంపాదించుకుందామా? అని ఎదురు చూసిన అధికారులకు సాదాబైనామా రావడంతో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చిపడింది. దీంతో తమకు అనుకూలమైన ఏజెంట్లను ప్రతీ గ్రామంలో ఏర్పాటు చేసుకుని వారి ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాందించేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీన్ని నిరూపిస్తూ ఎల్కతుర్తిలో విఆర్‌ఒగా పని చేస్తున్న విఆర్‌ఒ శ్రీనివాస్ 30 మంది రైతులకు గతంలో ప్రభుత్వం ముస్లీం సోదరుల కోసం కేటాయించిన వక్ఫ్‌బోర్డు భూములను ఎవరి అనుమతులు లేకుండా పట్టా కాలంలో నమోదు చేశాడు. దీనిపై గ్రామస్తులు ఆర్‌డిఒకు ఫిర్యాదులు చేయగా ఆయనే స్వయంగా విచారణ చేసి అక్రమంగా 30 మంది రైతుల పేర్లు పట్టాకాలంలో నమోదు చేశాడని నిర్ధారించి జిల్లా కలెక్టర్‌కు నివేదికలు అందజేశారు. దీంతో కలెక్టర్ ఆమ్రపాలి ఆదేశాల మేకు ఏప్రిల్ 14న సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తోటి అధికారుల్లో గుబులు రేగింది. ఇదిలా ఉండగా కేశవాపూర్ గ్రామానికి చెందిన వీఆర్‌ఏ రమేశ్ తన భార్య రజిత సాయంతో మరో అడుగు ముందుకేసి ఏకంగా ఇతరులకు చెందిన సుమారు 12 ఎకరాల భూమిని ఇరువులు తమ పేర్ల మీదకు పట్టాలు చేసుకుని, అధికారుల కళ్లుగప్పి
వాటికి పట్టాలు తీసుకునేందుకు సీఎం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు చెక్కులను సైతం పొందేందుకు ప్రయత్నించారు. ఈ అక్రమాన్ని సైతం ఉన్నతాధికారులు బట్టబయలు చేయగా ఈ నెల 18న వీఆర్‌ఏ రమేశ్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం పాఠకులకు తెలిసిందే.

తమ వంతు ఎప్పుడొస్తుందోః
సాదాబైనామా విషయంలో కొంత మంది రెవెన్యూ అధికారులు డబ్బులకు కక్కుర్తిపడి రైతుల వద్ద నుంచి డబ్బులు తీసుకుంటూ పట్టాలు చేసిన విషయం బహిరంగ రహస్యమే. అయితే రైతుల వద్ద నుంచి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్తాయని, వారు విచారణ చేస్తారని ఊహించని అధికారులు రైతులను డిమాండ్ చేస్తూ అందిన కాడికి సంపాదించుకున్నారు. అయితే ఉన్నతాధికారులు రైతుల ఫిర్యాదుల మేరకు విచారణలు చేస్తుండడం నిజమని తేలితే విధుల నుంచి తప్పిండం మండలంలో సంచలనం రేకెత్తిస్తున్న అంశం. అయితే ఈ కోవలో మరి కొంత మంది అధికారులు సైతం ఉన్నట్లు, అలాంటి వారిపై జిల్లా అధికారుల వద్ద ఫిర్యాదులు ఉన్నట్లు తెలుస్తోంది. నేడో రేపో మరి కొందరి బాగోతంపై విచారణలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఒకరికి బదులు మరొకరు నౌకరిః
సాదాబైనామా విషయంలో టార్గెట్‌లు విధించిన జిల్లా యంత్రాంగం అనుకున్న సమయానికి పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో మండలంలోని రెవెన్యూ అధికారులు యుద్ధ ప్రతిపదికన సాదాబైనాబా దరఖాస్తులను ఆన్‌లైన్ నమోదు చేశారు. కానీ ఈ పనులు కొంత మంది అధికారులు కాకుండా వారికి బదులు వారి భర్తలు, లేదా భార్యలు చేయడం కొసమెరుపు. తహశీల్దార్ కార్యాలయంలో ఇలా భార్యకు బదులు భర్త, భర్తకు బదులు భార్య ఉద్యోగాలు చేయడం పరిపాటిగా మారిపోయింది. ఈ విధంగా కార్యాలయంలో సుమారు నలుగురు అధికారులు వ్యవహరిస్తున్నట్లు సమాచారం. వీరు ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే ఒకరికి బదులు మరొకరు ఉద్యోగాలు చేస్తున్న విషయం మండల వ్యాప్తంగా తెలిసిందే. అయినప్పటికీ మండల ఉన్నతాధికారులు ఈ విషయాన్ని ఏనాడూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయిన దాఖళాలు లేవు. దీంతో వీరు యధేచ్ఛగా ఒకరికి బదులు మరొకరు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి వారిపై కూడా జిల్లా యంత్రాంగం విచారణ చేసి చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.