Search
Wednesday 26 September 2018
  • :
  • :

లారీ, జీపు ఢీ ఇరువురు మృతి

 Two peoples killed in Larry and Jeep accident
ఖమ్మం అర్బన్: లారీ, తుఫాన్ వాహనం ఢీకొన్న ఘటనలో ఇరువురు మృతి చెందగా పలువురికి గాయాలైన సంఘటన శనివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. ఎస్‌ఐ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం… ఖమ్మం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న జెటిపిటి పాపరావు తన కుటుంబ సభ్యులతో కలిసి చర్ల గ్రామంలో జరిగే శుభాకార్యానికి వెళ్లేందుకు శనివారం తెల్లవారు జామున తుఫాన్ వాహనంలో బయలుదేరారు. మండల పరిధిలోని వి. వెంకటాయపాలెం స్టేజి వద్ద వైరా వైపు నుంచి వస్తున్న లారీ అతి వేగంగా తుఫాన్ వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో తుఫాన్ వాహన డ్రైవర్ బత్తుల వీరారెడ్డి (25) అక్కడికక్కడే మృతి చెందాడు. పాపరావుతో పాటు అతని భార్య, కుమార్తె, కుమారుడు, కోడలికి గాయాలు కావడంతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పాపరావు కోడలు తురకా సుభద్ర (22) మృతి చెందింది. పాపరావుతో పాటు మిగిలిన వారిని మెరుగైన చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని రూరల్ ఏసిపి నరేష్‌ రెడ్డి, రూరల్ సిఐ తిరుపతి రెడ్డి సందర్శించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఎస్‌ఐ కృష్ణను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో ఉన్న మృతదేహాలను పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పాపరావుతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరి కొద్ది గంటల్లో చర్లలో శుభకార్యక్రమంలో పాల్గొని ఎంతో సంతోషంగా గడపాల్సిన ఆ ఇంట రోడ్డు ప్రమాదంలో సుభద్ర మృతిచెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీంతో తురకా వీరభద్రయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments