Search
Wednesday 14 November 2018
  • :
  • :

ఇద్దరు అంతర్ జిల్లా దొంగల అరెస్టు

రూ.8,500 నగదు స్వాధీనం
కరీంనగర్ ఏసిపి జె.రామారావు

Thief arrested in karimnagar

మానకొండూర్: తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని మిట్ట మధ్యాహ్నం చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్‌జిల్లా దొంగలను పట్టుకున్నట్లు కరీంనగర్ ఏసిపి జె.రామారావు వెల్లడించారు. మానకొండూర్ పోలీసు స్టేషన్‌లో బుధవారం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి దొంగల అరెస్టును మీడియాకు చూపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీసు కమీషనరేట్ పరిధిలోని రామారావుపల్లికి చెందిన కరుడుగట్టిన దొంగ రాంటెంకి సారయ్య ముఠా సభ్యుడు సుల్తానాబాద్ మండలం నారాయణరావుపల్లి గ్రామానికి చెందిన ఊర అనీల్, మరో సభ్యుడు రామగుండం మండలం రామారావుపల్లికి చెందిన భూతం రాములు అనే ఇద్దరు యువకులు మానకొండూర్ మండలంలో పలు చోరీలకు పాల్పడ్డారని ఏసిపి తెలిపారు. ఊర అనీల్, భూతం రాములు అనే ఇద్దరు దొంగలు మళ్లీ చోరీల కోసం రెక్కీ నిర్వహించేందుకు రెండు ద్విచక్ర వాహనాలపై వస్తున్న క్రమంలో మానకొండూర్‌లో స్థానిక పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించడంతో పట్టుకున్నట్లు ఏసిపి తెలియజేశారు.

పట్టుబడ్డ దొంగలు మానకొండూర్ మండలంలోని పచ్చునూర్‌లో గతంలో రెండు ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారు. రంగపేట, పోచంపల్లి గ్రామాలలో కూడా ఇళ్లల్లో దొంగతనాలు చేశారు. నాలుగు గ్రామాలలో సుమారు రెండు లక్షల రూపాయల విలువ గల బంగారు ఆభరణాలు, నగదు దోపిడీలు చేశారని ఏసిపి వివరించారు. జిల్లాలోని చొప్పదండి, రామడుగు తదితర ప్రాంతాలలోనూ వీరు దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడించారు. పట్టుబడిన ఇద్దరు దొంగల నుంచి రూ.8500 నగదుతో పాటు వారి వద్ద ఉన్న రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరి ముఠా నాయకుడు రాంటెంకి సారయ్య 18 చోరీ కేసుల్లో నిందితుడని అన్నారు. ఇద్దరు దొంగలు చోరీ చేసిన సొత్తు ఇంకా రికవరీ కావాల్సి ఉందని అన్నారు.

సారయ్యను గతంలో అరెస్టు చేసి జైలుకు పంపామని, జైలు నుంచి బయటికి వచ్చాక మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నాడని తెలిపారు. రాంటెంకి సారయ్య పరారీలో ఉన్నాడని, అతన్ని త్వరలో పట్టుకుని చోరీ సొత్తును రికవరీ చేస్తామన్నారు. మంగళవారం పట్టుబడిన దొంగలు ఇద్దరు సారయ్య శిష్యులేనని తెలిపారు. దొంగలను పట్టుకునేందుకు కృషి చేసిన సిఐ వెంకటరమణ, ఎస్‌ఐ ఇంద్రసేనారెడ్డి, పోలీసు సిబ్బందిని ఏసిపి అభినందించారు. వారికి రివార్డులను అందించేందుకు పోలీసు కమీషనర్‌కు సిఫారసు చేస్తామన్నారు. పట్టుకున్న దొంగలను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుచనున్నట్లు ఏసిపి తెలిపారు. ఈ విలేఖరుల సమావేశంలో తిమ్మాపూర్ రూరల్ సిఐ పి.వెంకటరమణ, స్థానిక ఎస్‌ఐ ఎ.ఇంద్రసేనారెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Comments

comments