Search
Wednesday 14 November 2018
  • :
  • :

వామ్మో ట్యాంక్‌బండ్..!

 Two wheeler accidents occurred in police records as 405

ట్యాంక్‌బండ్‌పై ప్రయాణించాలంటేనే నగరవాసులు ప్రాణాలను పణంగా పెట్టాల్సివస్తుంది. హుస్సేన్‌సాగర్ అందాలను తిలకించేందుకు వచ్చేవారికి ఈ చారిత్రక సంపదైన ఆనకట్ట మృత్యువుకు కేరాఫ్‌గా మారుతోంది. తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో ఇక్కడకు రావాలంటేనే నగరవాసులు ఒత్తిళ్ళకు లోనవుతున్నారు. నియమాలను బేఖాతరు చేస్తూ మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురవుతున్న వాహనాల్లో అధిక శాతం ద్విచక్రవాహనాలే ఉన్నాయి.గత ఆదివారం అర్థరాత్రి 12.45 గంటల ప్రాంతంలో ఒక ద్విచక్రవాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఇద్దరు విద్యార్థులు మరణించగా మరొకరు తీవ్రగాయాలకు గురయ్యాడు. ఈ ప్రమాదానికి కారణం మితిమీరిన వేగమేనని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ట్యాంక్‌బండ్‌పై ప్రధానంగా వాహనాల వేగం గంటకు 40 కి.మీ.లు మాత్రమే. కానీ, ప్రతి వాహనం ఆ హద్దును అతిక్రమిస్తూ కనీసంగా 60కి తగ్గకుండా రాకపోకలు సాగిస్తున్నాయి. ట్యాంక్‌బండ్‌పై వాహనాలు ఇతర వాహనాలను దాటివేయడం(ఒవర్‌టేక్) కూడా పూర్తిగా నిషిద్ధ్దం. కానీ, కొంత మంది ఇతర వాహనాలను దాటేసుకుంటూ అడ్డదిడ్డంగా వెళ్తూన్నారు. అయితే, వాహన ప్రమాదాలు చోటు చేసుకోకుండా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ వాహనదారులు నియమాలను అతిక్రమించడం వల్లనే జరగరాని నష్టం జరుగుతోంది.
ప్రమాదాలకు కారణాలు
2018లో నగరంలో ఇప్పటి వరకు ద్విచక్రవాహన ప్రమాదాలు 405గా పోలీసు రికార్డుల్లో నమోదై ఉన్నాయి. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకుండా మితిమీరిన వేగంతో డ్రైవింగ్ చేస్తున్నారు. కార్లుతోలే వారు సీటుబెల్ట్ పెట్టుకోవడం లేదు. ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం. వెనుక కూర్చున్నవారితో లోతుగా చర్చిస్తూ వాహనాలను నడపడం. ద్విచక్రవాహనాలపై ముగ్గురు కూర్చుని ప్రయాణించడం. ఆటోల్లో, ఇన్నోవా, చావర్లెట్ వంటి వాహనాల్లో సీటింగ్ సామర్థం కన్నా అధిక మందిని తీసుకెళ్ళడం. అతివేగంగా వాహనాలను ఓవర్‌టేక్ చేయడం. తీవ్రస్థాయిలో హారన్‌లను మోగించడం. పాదచారులను గమనించకుండానే వెళ్ళడం. ఇరుప్రక్కల చూడటం. మధ్యలైన్‌ను వెలుపలకు వచ్చి మరీ రాకపోకలు సాగించడం. తదితర కారణాలతో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నట్లు అక్కడి నుంచి నిత్యం ప్రయాణించే వారి అభిప్రాయం. అధికశాతం యువతీయువకులు తమ వాహనాలను రాష్ డ్రైవింగ్ చేస్తున్నట్టు ప్రచారంలో ఉన్నది. అక్కడ స్పీడ్ బ్రేకర్లు లేవు. ఇత్యాధికారణాల వల్ల ట్యాంక్‌బండ్‌పై రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నది బహిరంగ రహాస్యమే.
జాగ్రత్తలు తీసుకుంటున్నాం..
ట్యాంక్‌బండ్‌పై వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు, ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగా స్పీడ్ గన్స్‌ను ఏర్పాటు చేశాం. స్పీడ్ బ్రేకర్లను వేయాలని, అందుకు అనుమతినివ్వాల్సిందిగా ప్రభుత్వానికి విన్నవించాం. పాదచారులు రోడ్డు దాటేందుకు ప్రత్యేకంగా పోలీసు కానిస్టేబుల్స్ అందుబాటులో ఉంటున్నారు. ప్రమాదాలకు ఆస్కారమున్న ప్రదేశంలో పాదచారులు రోడ్డుపైకి రాకుండా బారికేడ్లు నిలిపాం.
కావేటి శ్రీనివాస్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్

Comments

comments