Home ఆఫ్ బీట్ వసంతంలా వచ్చే ఉగాది

వసంతంలా వచ్చే ఉగాది

మామిడి కాయలు..మల్లెపూలు…కోయిల పాటలు ఇవన్నీ చైత్ర మాసపు చిత్రాలు. చిరు చెమటలు పట్టే కాలంలో వసంతుని తోడుగా ముంగిళ్లకు విచ్చేస్తున్న ఉగాది. ప్రతివారికి షడ్రుచుల జీవితాన్నందించాలి.. వసంతకాలం ఆరంభంలో వచ్చే తొలి పండుగ ఉగాది… యుగాది అని కూడా అంటాం… తనతోపాటు పుల్లని మామిడి కాయలు, మత్తకోయిలల గానాలు, మత్తెక్కించే మల్లెలను తీసుకువస్తోంది..  ప్రపంచంలో ఉన్న తెలుగువాళ్లంతా ఉగాది పండుగ చేసుకుంటారు.  రుతువుల్లో మొదటిది వసంతం. మాసంలో మొదటిది చైత్రం. పక్షంలో మొదటిది శుక్ల పక్షం. తెలుగు నాట చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది సంబరాలు జరుపుకుంటాం.

Ugadi Special

ఉగాది నుంచి తెలుగు పండుగలు వరుసగా మొదలవుతాయి. ప్రతి పండుగకూ ఒక ప్రత్యేకమైన దైవంతో సంబంధం ఉంటుంది. ఉగాదికి మాత్రం ఏ దేవుడినీ పూజించాలనే ఆచారం లేదు. చాంద్రమానాన్ని అనుసరించే తెలుగు, కన్నడ, మ హారాష్ట్ర ప్రజలు చైత్ర శుద్ధ పాడ్యమి రోజు ఉగాది జరుపుకుంటే, సౌరమానాన్ని పాటించే తమిళ, సిక్కు, మలయాళీ, బెంగాలీలు కూడా వసంత కాలంలోనే ఉగాది జరపుకోవడం విశేషం. చైత్ర శుద్ధ పాడ్యమి నాడే బ్రహ్మసృష్టి ఆరంభించినట్లు బ్రహ్మపురాణం చెబుతోంది. శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్ల పాడ్యమినాడే పట్టాభిషిక్తుడైనట్లు చరిత్ర సారాంశం. ప్రస్తుతం జరుపుకోనున్న తెలుగు ఉగాది హేవళంబి.
దేశంలోని పలుప్రాంతాలో వివిధ పేర్లతో
బెంగాలీలు పొయ్‌లా బైశాఖ్ అనే పేరుతో ఉగాది పండుగ చేసుకుంటారు. వైశాఖ శుద్ధ పాడ్యమి రోజు వీరికి సంవత్సరం ప్రారంభమౌతుంది. ప్రభాత భేరీ పేరుతో పండుగకు స్వాగతం పలుకుతారు. వ్యాపారులు పాత ఖాతా పుస్తకాలను మూసేసి, కొత్తవి తెరుస్తారు. దుకాణానికి వచ్చే వినియోగదారులకు మిఠాయిలు పంచుతారు. కొత్తపనులు, కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. తమిళుల ఉగాది పుత్తాండు. ఒకప్పుడు తెలుగు వారిలాగే జరుపుకునేవారు. డిఎంకే ప్రభుత్వం దీన్ని ఆర్యుల పండుగగా భావించి జనవరిలో సంక్రాంతి సమయంలోనే ఉగాది జరుపుకోవాలని చట్టం చేసింది. ఏప్రిల్‌లో వచ్చే ఉగాదిని చిత్తిరై తిరునాళ్ గా జరుపుకోవాలని ప్రకటించింది. ఇక్కడ కూడా పంచాంగ శ్రవణం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఎడ్ల పందాలు ఏర్పాటుచేస్తారు. సిక్కుల కాలమానం ప్రకారం వైశాఖ శుద్ధ పాడ్యమి నాడు ఉగాదిగా జరుపుకుంటారు. ఇది వారికి పంటల పండుగ. రబీ పంటల నూర్పిడి సమయం. భాంగ్రా, గిద్దా నృత్యాలు చేస్తారు. కొత్తగా పండిన గోధుమలను పట్టించి ఆ పిండితో రొట్టెలు చేసి బెల్లం నెయ్యి కలిపి ఆరగిస్తారు. మలయాళీలు విషుగా వ్యవహరించే ఉగాది ఏప్రిల్ మధ్యలో వస్తుంది. పండుగ ముందురోజు రాత్రి ఇంట్లోని పెద్ద వయసు మహిళ పచ్చి బియ్యం, కొత్త బట్టలు, బంగారు రంగులో ఉండే దోసకాయలు, అరటిపళ్లు, తమలపాకులు, అద్దంలాంటి వస్తువులను ఉరళి అనే పాత్రలో పెట్టి పూజగదిలో ఉంచుతారు. ఇవన్నీ ఉంచిన పాత్రని విషుకని అంటారు. మర్నాడు ఉదయం ఇంట్లో సభ్యులంతా విషుకని చూస్తే శుభం కలుగుతుందని అక్కడి వారి విశ్వాసం. మరాఠీలు ఉగాదిని గుడిపడ్వాగా వ్యవహరిస్తారు. తెలుగువారి ఉగాది పచ్చడిలాంటిది చేసి దానికి అదనంగా వాము చేర్చి ఆరగిస్తారు. బ్రహ్మదేవుడు ఉగాది రోజున సృష్టి ఆరంభించినట్లు నమ్ముతూ..ఆయన పేరున బ్రహ్మ ధ్వజం నిలుపుతారు. కొంకణి, బాలి ప్రజలు కూడా ఉగాదిని ఆర్భాటంగా చేసుకుంటారు.
విదేశాల్లో ఉగాది…
ఇరాన్ దేశంలో మార్చిలో వచ్చే నూతన సంవత్సరం నూరుజ్. జొరాస్ట్రియన్, బాహి కమ్యూనిటీలు జరపుకునే పండుగ. అక్కడి ప్రభుత్వం పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. ప్రజలంతా కలిసి చేసుకుంటారు. నైపి లేక బలినీస్‌లో జరుపుకునే కొత్త సంవత్సరాన్ని సైలెన్స్ ఆఫ్ ది డే అని అంటారు. రాక్షసుల విగ్రహాలను కాలుస్తారు. ఒక రోజంతా మౌనవ్రతం చేస్తారు. మార్చిలో మూడురోజుల పాటు జరుపుకునే పండుగ. కొత్త ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ముస్లింలు జరుపుకునేది హిజ్రీ. ఇస్లామిక్ క్యాలెండర్‌లో మొదటి నెల మొహర్రం. హిజ్రత్ అని పిలుస్తారు. ప్రత్యేక ప్రార్థనలు, ఉపవాసాలు చేస్తారు. అలుత్ అవురుద్దా సింహళుల ఉగాది. శ్రీలంక ప్రజలు పంట కోతల కాలం ముగింపును పండుగగా జరుపుకుంటారు. కావుమ్( తెలకపిండి) కోకిస్ (తియ్యని మాంసం) పదార్థాలను అందరికీ పంచుతారు.
పంచాంగ శ్రవణం…
కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహ స్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి పంచాంగ శ్రవణం చేస్తుంటారు. ప్రతి ఊరిలో దేవాలయాల్లో, కూడళ్లలో, సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. పూర్వకాలంలో ఆ ఏడాది పంటలు ఎలా ఉండబోతున్నాయి? ఏరువాక ఎలా సాగాలి అనే విషయలను తెలుసుకోవడానికి పంచాంగ శ్రవణాన్ని మార్గంలా ఎంచుకున్నారు. తిథి వార నక్షత్ర యోగ కరణ ఫలితాలను పండితుల ద్వారా రైతులు తెలుసుకునేవారు. ఇప్పుడైతే పంచాంగాలు అందరికీ లభిస్తున్నాయి. పూర్వం తాటాకుల మీద రాయబడేవి, అవి పండితుల వద్దే ఉండేవి కనుక ప్రంచాంగ శ్రవణం అనే ఆచారం వచ్చింది.
ఉగాది పచ్చడి ఔషధమే…
తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదుల కలయిక ఉగాది పచ్చడి. వేపపువ్వు, చింతపండు గుజ్జు, కొత్తబెల్లం, కొబ్బరి, మామిడి ముక్కలు, చెరకు రసం, అరటి పళ్లు, ఉప్పు, కారంతో తయారయ్యే ఉగాది పచ్చడి శారీరక దోషాలను పోగొడుతుంది. వేసవి తాపం నుంచి బయట పడేస్తుంది. చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి చైత్ర శుద్ధ పౌర్ణమి వరకు ప్రతి రోజూ ఈ పచ్చడి తింటే రుతు సంబంధిత లోపాలు తగ్గుతాయని ఆయుర్వేదం చెబుతోంది. వేపపువ్వులో యాంటీసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుంటాయి. మామిడి ముక్కల్లో రక్త ప్రసరణ దోషాలను నివారిస్తుంది. కొన్ని చోట్ల పానకం, వడపప్పు ప్రసాదంగా చేస్తారు. వేసవి తాపం తట్టుకోవడానికి పానకం, చలువ చేసే పెసరపప్పు వేసవి సమస్యలను కొంతవరకు తగ్గిస్తాయి. చింతపండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొత్త బెల్లం వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది. పచ్చి మిరప చెవిపోటు, గొంతువాపును అరికడుతుంది. ధమనుల్లో కొవ్వు పేరుకుపోకుండా చూసేది ఉప్పు. కొత్త కుండలోనే ఈ పచ్చడి చేయడం వల్ల చల్లగా ఉంటుంది. తెలుగువాళ్లు పులిహోర, బొబ్బట్లు, పాయసంలాంటి వంటకాలు తయారుచేసి బంధుమిత్రులతో కలిసి పండుగను జరుపుకుంటారు.