Home జగిత్యాల ప్రాదేశిక ఎన్నికల్లో కారు జోరు

ప్రాదేశిక ఎన్నికల్లో కారు జోరు

Unanimous in First Phase Election

 

జగిత్యాల : ప్రాదేశిక ఎన్నికల్లో గులాబీ గుబాళిస్తోంది. జిల్లాలో మూడు విడతల్లో జరుగుతున్న ఎంపిటిసి, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇప్పటికే మొదటి, రెండవ విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా మొదటి విడతలో ఒక జెడ్పీటీసీ, మూడు ఎంపిటిసి స్థానాల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా రెండవ విడతలో సైతం ఒక జెడ్పీటీసీ, మూడు ఎంపిటిసి స్థానాల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ప్రాదేశిక ఎన్నికల్లో ఎక్కడా లేని విధంగా జగిత్యాల జిల్లాలో రెండు జెడ్పీటీసీలు, ఆరు ఎంపిటిసి స్థానాలను టిఆర్‌ఎస్ కైవసం చేసుకొని ఆ పార్టీ నేతలు తమకు తిరుగు లేదని నిరూపించుకున్నారు. ధర్మపురి నియోజకవర్గంలోని వెల్గటూర్ జెడ్పీటీసీగా గుండు సుధారాణి ఏకగ్రీవంగా ఎన్నిక కాగా ధర్మపురి మండలంలోని కమలాపూర్‌లో గడ్డం మహిపాల్‌రెడ్డి, ఆరెపెల్లిలో కుంబాల రజిత, వెల్గటూర్ మండలంలోని పాతగూడుర్‌లో లక్కాకుల రాణిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అలాగే కోరుట్ల జెడ్పీటీసీ స్థానంతో పాటు అయిలాపూర్ – 2, ధర్మారం, వెంకటాపూర్ ఎంపిటిసి స్థానాల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థులకు పోటీగా ఎవరూ నిలవకపోవడంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ, సర్పంచ్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ తన సత్తా చాటుకొని జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థులు విజయకేతనం ఎగరవేయడంతో పాటు మెజార్టీ సర్పంచ్‌లు టిఆర్‌ఎస్‌కు చెందిన వారే ఎన్నికయ్యారు. ప్రాదేశిక ఎన్నికల్లో సైతం టిఆర్‌ఎస్ విజయఢంకా మోగించేందుకు బలమైన అభ్యర్థులను బరిలోకి దింపి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే పలు చోట్ల ఏకగ్రీవం కాగా మూడవ విడతలో కూడా పలు స్థానాల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఏ ఎన్నిక వచ్చినా తమకు టిక్కెట్లు ఇవ్వాలంటూ గోల గోల చేసే వివిధ పార్టీల నేతలు ప్రాదేశిక ఎన్నికల్లో మాత్రం టిక్కెట్ ఇస్తామన్నా తాము పోటీలో ఉండమంటూ తప్పుకోవడాన్ని బట్టి చూస్తే టిఆర్‌ఎస్ హవా ముందు ఏ పార్టీ నిలిచే పరిస్థితి లేకనే పోటీకి దూరంగా ఉన్నామంటూ ఆయా పార్టీల నేతలు పేర్కొనడం గమనార్హం.

ప్రతి ఎన్నికల్లో సత్తా చాటిన టిడిపి, ఈ ఎన్నికల్లో మాత్రం ఒకటి, రెండు స్థానాలకే పరిమితం అయింది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి సొంత నియోజకవర్గంలోనే పార్టీ పరిస్థితి దయనీయంగా మారడం… కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు సైతం నామినేషన్లు వేసి తాము పోటీలో నిలదొక్కుకోలేమంటూ నామినేషన్లను ఉపసంహరించుకుంటున్న నేపథ్యంలో తమ గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందని, జిల్లాలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటామని ఆ పార్టీ ఎంఎల్‌ఏలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల ఎంఎల్‌ఏ డాక్టర్ సంజయ్‌కుమార్, కోరుట్ల ఎంఎల్‌ఏ కె. విద్యాసాగర్‌రావుతో పాటు చొప్పదండి, వేములవాడ ఎంఎల్‌ఏలు సుంకె రవిశంకర్, చెన్నమనేని రమేష్‌బాబులు మండలాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతుండడంతో మరింత ఉత్సాహంతో ప్రచారాన్ని టిఆర్‌ఎస్ నేతలు ముమ్మరం చేశారు.

Unanimous in First Phase Election at Jagtial