Home సిద్దిపేట ముంపు గ్రామాల్లో మెగా జాబ్ మేళా

ముంపు గ్రామాల్లో మెగా జాబ్ మేళా

medak

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లాలో రిజర్వాయర్ల నిర్మాణంతో ముంపునకు గురవుతున్న గ్రామాల్లో మెగా జాబ్‌మేళా నిర్వహణకు జిల్లా కలెక్టర్ నడుం బిగించారు. మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు మెగా జాబ్‌మేళా నిర్వహణతో ఆయా గ్రామాల్లోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి సిద్ధ్దం అవుతున్నారు. సిద్దిపేట జిల్లాలో గౌరవెల్లి, అనంతగిరి, కొండపోచమ్మ, మల్లన్నసాగర్, రంగనాయక సాగర్ రిజర్వాయర్ల నిర్మాణం వల్ల పలు గ్రామాలు మంపునకు గురవుతున్నాయి. గ్రామాల్లోని యువత నిరాశచెందకుండా వుండేందుకు ప్రత్యేకంగా మెగా జాబ్‌మేళాను నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా జిల్లా యంత్రాంగం సమాయత్తం అవుతోంది. ఆయా ముంపు ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పించడమే కాకుండా ముందుగానే 45 రోజుల నుంచి 4 నెలలపాటు శిక్షణను ఇచ్చి వారికి ఉద్యోగ అవకాశాలు లభించేలా కలెక్టర్ ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు.

     ఇందు కోసం టాటా స్ట్రైవ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రం ద్వారా బేసిక్ ఇంగ్లీషు కమ్యూనికేషన్, వర్క్ ప్లేస్ రెడినెస్ స్కిల్స్, కంప్యూటర్ పరిజ్ఞానం, వ్యక్తిత అభివృద్దితో పాటు ఉద్యోగపరమైన నైపుణ్యాన్ని సాధించడానికి అవసరమైన శిక్షణు ఇప్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. బ్యాకింగ్, ఆటో మోబైల్ సెక్టార్;, బిపిఓ కాల్ సెంటర్, హోటల్ మేనేజ్‌మెంట్, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇతరత్రా వాటిల్లో ఉద్యోగ అవకాశాలు లభించేలా యువతకు శిక్షణను ఇవ్వడంతో పాటు ఉపాథి కల్పించే దిశగా ఆలోచనలు సాగిస్తున్నారు. నిరుద్యోగ అభ్యర్థులకు కావాల్సిన అర్హతలు, ఇతరత్రా వసతి సౌకర్యాలతో పాటు భోజన సదుపాయాల కల్పించనున్నారు. ఇందుకు సంబందించి గురువారం కలెక్టర్ వెంకటరామిరెడ్డి హైదరాబాద్‌కు చెందిన టాటా కన్సల్టెన్సీతో చర్చించారు.

      మెగా జాబ్‌మేళా నిర్వహణతోపాటు నిరుద్యోగ యువతకు శిక్షణకు సంబందించిన ప్రతిపాదనలు నివేదిక రూపంలో సమర్పించాలని టాటా కన్సల్టెన్సీ ప్రతినిధులను కోరారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ త్వరలోనే మెగా జాబ్‌మేళాను నిర్వహించనున్నామని, దీనిపై సుదీర్ఘంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నట్టు వెల్లడించారు. ఇందు కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్టు వెల్లడించారు.