Home ఎడిటోరియల్ సంపాదకీయం :పట్టభద్రుల నిరుద్యోగం – ప్రభుత్వ కృషి

సంపాదకీయం :పట్టభద్రుల నిరుద్యోగం – ప్రభుత్వ కృషి

sampadakeyam

భారతదేశంలో పట్టభద్రుల(గ్రాడ్యుయేట్స్) స్థాయి నిరుద్యోగుల్లో నూతన తెలంగాణ రాష్ట్రం పైనుండి మూడవస్థానంలో ఉన్నట్లు ఒక నివేదిక తెలుపుతున్నది. బొంబాయి స్టాక్ ఎక్సేంజి (బిఎస్‌ఇ), సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎంఐఇ) రూపొందించిన గణాంక సమాచారం ప్రకారం, 2017 మేఆగస్టు మాసాల మధ్య రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు 18.59శాతం. 26.26 శాతంతో జమ్మూకశ్మీర్, 23.55శాతంతో అసోం ఆ పై రెండు స్థానాల్లో ఉన్నాయి. ‘మనది యువత ఎక్కువగా ఉన్నదేశం. దేశ ఆర్థికాభివృద్ధికి, ఉత్పాదకతకు వారే కొండంత వనరు’ అని తరచూ చెప్పుకుంటున్నప్పటికీ, యువతలోనే నిరుద్యోగిత హెచ్చుగా ఉంది. అంటే మానవ వనరులను మాటల్లో చెప్పినంతగా ఆచరణలో వినియోగించుకోలేకపోతున్నామన్నమాట! తెలంగాణ రాష్ట్రాన్నే తీసుకుంటే, 2024 ఏళ్ల మధ్య వయస్కుల్లో నిరుద్యోగిత 39.07శాతం. ఇది రాష్ట్ర సగటుకు రెండింతలు పైగా ఉంది. 2529 వయోగ్రూపులో నిరుద్యోగిత 16.11శాతం.
మన కాలేజీలు ఉత్పత్తి చేస్తున్న పట్టభద్రుల నాణ్యతకు, పరిశ్రమ అవసరాలకు మధ్య అగాధం ఇందుకొక ప్రధాన కారణంగా చెప్పబడుతున్నది. అయితే సంఖ్యలను యథా
తథంగా తీసుకోపనిలేదని, పట్టభద్రుల సంఖ్యలో(17శాతం) తెలంగాణ దేశంలో రెండవ స్థానంలో ఉన్నందున నిరుద్యోగుల శాతం హెచ్చుగా కనిపిస్తున్నదనే సమర్ధన కూడా లేకపోలేదు. ఏదిఏమైనా, కాలేజి, యూనివర్శిటీ నుంచి విద్యార్థులు బయటకు రాగానే ఉద్యోగాల్లో చేరేందుకు తగిన నిపుణత కలిగిఉండేటట్లుగా సిలబస్‌ను ఎప్పటికప్పుడు ఆధునికీకరించటం ఎంతైనా అవసరం. అంతేగాక విద్యావంతులందరికీ ప్రభుత్వమే ఉద్యోగాలివ్వలేదు. కాబట్టి పరిశ్రమలు, సేవారంగం విస్తరిస్తున్నందున అందుకు తగిన విద్య గరపటం ముఖ్యం. ఈ వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తించింది. అందువల్లనే పరిశ్రమ సహకారంతో
డిగ్రీవిద్యకు మార్కెట్ అవసరాలకు అనుగుణమైన కొత్త సిలబస్ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
ఉద్యోగ కల్పనలో ప్రస్తుతం వివాదాంశం ప్రభుత్వం తన వాగ్దానం మేరకు ఉద్యోగ ఖాళీలు భర్తీచేయటం లేదనేది. దీనిపైనే ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. మొత్తం 4.42లక్షల ప్రభుత్వోద్యోగాల్లో 1,08,132 ఖాళీలున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వాటిని సంవత్సరంలోపు భర్తీచేసి తీరతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఘంటాపథంగా ప్రకటించారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా కోర్టులద్వారా, ఇతరత్రా ఎదురవుతున్న అవరోధాలవల్లనే భర్తీ ఆలస్యమవుతున్న విషయాన్ని గమనించాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికి 63,153 పోస్టుల భర్తీకి అనుమతి మంజూరు చేసింది. వాటిలో 27,874 పోస్టులకు రిక్రూట్‌మెంట్ పూర్తయింది. మిగతా 36వేల పోస్టుల భర్తీకై జరుగుతున్న రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ మరో ఆరు మాసాల్లో పూర్తి అవుతుందని అధికారవర్గాల భోగట్టా. రిక్రూట్‌మెంట్ పూర్తయిన పోస్టుల్లో 12,152 పోలీసు డిపార్టుమెంటులో, 9,790 డిపార్టుమెంటల్ సెలెక్ట్ కమిటీ ద్వారా, 5,932 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయబడినాయి. అయితే లక్షలాదిమంది నిరుద్యోగ పట్టభద్రులు అర్హత పరీక్షలకు హాజరయ్యే టీచర్, పోలీసు, గ్రూపు 2 రిక్రూట్‌మెంట్ ఏదోక కారణంతో పూర్తికానందున అసంతృప్తి
పెరగటం యధార్ధం. పోలీసు శాఖలో 16,489 మంది రిక్రూట్‌మెంట్‌కు అనుమతివ్వగా 12,152 మాత్రమే భర్తీ అయినాయి. గ్రూప్ 1లో 1,124మంది అభ్యర్థులు ఇటీవల ఉద్యోగాల్లో చేరారు. హైకోర్టు ఆదేశం ప్రకారం 10 పాతజిల్లాలు ప్రాతిపదికగా 9,782 టీచర్ ఉద్యోగాల భర్తీకి తాజా నోటిఫికేషన్ విడుదలైంది.
మూడేళ్లలో 27,874 పోస్టుల రిక్రూట్‌మెంట్‌నే పూర్తిచేసిన ప్రభుత్వం మరో సంవత్సరకాలంలో 1,08,132 పోస్టుల భర్తీ లక్షాన్ని చేరుకోగలదా? ఇది నిరుద్యోగుల్లో సైతం ఉన్న సందేహం. టిజెఎసి, ప్రతిపక్షాల ‘కొలువులకై కొట్లాట’ సభకు పెద్దఎత్తున నిరుద్యోగుల హాజరుకు ఇదే మూలం. ప్రభుత్వం ఉద్యోగకల్పన లక్షాన్ని చేరుకోగలిగితే ప్రతిపక్షం చేతినుంచి ఒక ప్రచార ఆయుధాన్ని లాగేసినట్లవుతుంది. బంతి ప్రభుత్వం కోర్టులో ఉంది.