Saturday, April 20, 2024

ఉమ్మడి పౌరసత్వం ఎవరి కోసం?

- Advertisement -
- Advertisement -

యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్టికల్ 44 ప్రకారం ఒకే దేశం, ఒకే చట్టం. ఉమ్మడి పౌరస్మృతి అంటే ఇంతేనా? వినడానికి ఇంత సింపుల్‌గా ఉన్నా అమలు అంత ఈజీ కాదా? యూనిఫావ్‌ు సివిల్ కోడ్‌పై ఎందుకు వ్యతిరేకత వస్తోంది. మత సంస్థలు ఎందుకు ఒప్పుకోవడం లేదు. ఉమ్మడి పౌరస్మృతి వల్ల కలిగే ప్రయోజనాలేంటి? తలెత్తబోయే సమస్యలేంటి? కేంద్రంలోని బిజెపి సర్కార్ యూనిఫావ్‌ు సివిల్ కోడ్‌ని ఎందుకింత సీరియస్‌గా తీసుకుంది? ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినట్లుగా ఖచ్చితంగా అమలు చేసే తీరుతుందా? ఇంతటి వ్యతిరేకత మధ్య అది సాధ్యమయ్యే పనేనా? యూనిఫావ్‌ు సివిల్ కోడ్ అంటే ఏమిటి? ముందు దీని గురించి తెలిస్తేనే ఇది ఎందుకంత సున్నితమైన అంశంగా మారిందో అర్థమవుతుంది. కొన్ని వర్గాల వారు ఎందుకు దీనిని వ్యతిరేకిస్తున్నారో బిజెపి సర్కార్ ఎందుకు దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందో తెలుస్తుంది. ఉమ్మడి పౌరస్మృతి అంటే మతపరమైన అచారాలు, సంప్రదాయాలకు అతీతంగా భారత భూభాగం పరిధిలో ఉన్న పౌరులందరికీ ఒకే చట్టాన్ని వర్తింపజేయడం.

ఈ దేశంలో పెళ్లిళ్లు, విడాకులు, వారసత్వంగా వచ్చే ఆస్తులు, పిల్లలను దత్తత తీసుకోవడం, జీవన భృతి లాంటి విషయాలకు సంబంధించి చట్టాలు అందరికీ ఒకేలా లేవు. పౌరులు ఆచరించే మతం, విశ్వాసాల ఆధారంగా వేర్వేరుగా ఉంది. అయితే మతంతో సంబంధం లేకుండా, లింగ భేదాల్లేకుండా భారత పౌరులందరికీ ఒకే చట్టం వర్తింపజేయడమే యూనిఫాం సివిల్ కోడ్. ఈ డిమాండ్ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచే ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ – 44 కూడా ఇదే చెబుతోంది. దేశ పౌరులకు యూనిఫావ్‌ు సివిల్ కోడ్ తీసుకొచ్చేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశిక సూత్రాల రూపంలో రాజ్యాంగం సూచిస్తోంది. ఇప్పటి వరకు దేశంలో ప్రజా చట్టాలకు భిన్నంగా మతపరమైన చట్టాలున్నాయి. హిందూ వివాహ, వారసత్వ చట్టాలు, షరియా లాంటి ముస్లిం పర్సనల్ చట్టాలు అమలవుతున్నాయి. అయితే ఉమ్మడి పౌరస్మృతిలో ఎవరికి వాళ్లుగా అమలు చేసుకునే చట్టాలు చెల్లవు. దాంతో చాలా కాలంగా దేశంలో మెజారిటీ అయిన హిందువులు, మైనారిటీ అయిన ముస్లింలు యూనిఫావ్‌ు సివిల్ కోడ్‌ని వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇప్పుడు మళ్లీ ఉమ్మడి పౌరస్మృతి అంశంపై చర్చ మొదలవడంతో ముస్లింల షరియా చట్టాలకు కౌంటర్‌గానే యూనిఫావ్‌ు సివిల్ కోడ్ తెస్తున్నారనే అభిప్రాయాలున్నాయి. షరియా చట్టాలు అనాగరికంగా ఉన్నాయనేదే వాళ్ల వాదన. ఇందుకు ఇస్లాం మతంలో భార్యలకు విడాకులిచ్చే ట్రిపుల్ తలాక్‌ని ఉదాహరణగా చూపిస్తున్నారు. 2019లో ట్రిపుల్ తలాక్‌ని నేరంగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. యూనిఫావ్‌ు సివిల్ కోడ్ వచ్చే దాకా దేశంలో లింగ సమానత్వం సాధ్యం కాదనే వాదనలున్నాయి. కానీ ఉమ్మడి పౌరస్మృతి వల్ల కలిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, కొత్త సమస్యలు పుట్టుకొస్తాయని చెబుతున్నారు విశ్లేషకులు. భారత రాజ్యాంగంలోని 25వ అధికరణంలోని కొన్ని అంశాలతో ఉమ్మడి పౌరస్మృతి విభేదిస్తుందనే వాదనలు కూడా ఉన్నాయి. పౌరులు తమకు నచ్చిన మతాన్ని స్వీకరించేందుకు, అనుసరించేందుకు, వ్యాప్తి చేసేందుకు ఆర్టికల్ 25 వీలు కల్పిస్తుంది. కానీ.. యూనిఫావ్‌ు సివిల్ కోడ్ వల్ల మత స్వేచ్ఛ విషయంలో ఎలాంటి మార్పులుండవు. అయితే భిన్న మతాలు, నమ్మకాలున్న భారత్ లాంటి పెద్ద దేశాల్లో సివిల్ కోడ్స్ ద్వారా అందరినీ ఏకం చేయడమనేది ఎంతో కష్టమైన విషయం. హిందువులైనా, ముస్లింలైనా వాళ్లలో వాళ్లకు అనేక భిన్నమైన నమ్మకాలు, విశ్వాసాలు ఉంటాయి.

హిందువుల్లోనూ భిన్న ఆచారాలు, సంప్రదాయాలు పాటించే వాళ్లున్నారు. ముస్లింలలోనూ షరియా చట్టాలను పాటించని వాళ్లున్నారు. బోరా ముస్లింలు ఆస్తుల వారసత్వం విషయంలో హిందువుల చట్టాలను అనుసరిస్తుంటారు. ఆస్తుల వారసత్వం విషయంలో ఒక్కో రాష్ర్టంలో ఒక్కో విధంగా చట్టాలున్నాయి. ఇక క్రైస్తవులు మెజారిటీగా ఉండే నాగాలాండ్, మిజోరం లాంటి రాష్ట్రాలు తమకంటూ ప్రత్యేకమైన సివిల్ చట్టాలను రూపొందించుకున్నాయి. వాటికి ఆధారం వారి సంప్రదాయాలే గానీ మతం కాదు. గోవాలో 1867 నాటి కామన్ సివిల్ కోడ్ అమల్లో ఉంది. కానీ క్యాథలిక్స్, ఇతర మతస్థులకు భిన్నమైన నియమాలున్నాయి. భారత్‌లో పౌర స్మృతులు ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. అందువల్ల 1970ల నుంచి రాష్ట్రాలు తమకంటూ సొంత సివిల్ కోడ్‌ని రూపొందించుకుంటూ వస్తున్నాయి. హిందువుల్లో కొడుకులతో సమానంగా కూతుళ్లకు వారసత్వ ఆస్తిలో వాటా పొందేలా 2005లో చట్టాలను సవరించారు. కానీ దీని కంటే ముందే ఐదు రాష్ట్రాలు మహిళలకు వారసత్వ ఆస్తిలో వాటా హక్కును కల్పిస్తూ చట్టాలు చేశాయి. అయితే యూనిఫావ్‌ు సివిల్ కోడ్ అమలు వల్ల కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి.

ఉమ్మడి పౌరస్మృతి తమ మతంపై, సంస్కృతిపై దాడి అని ముస్లింలు సహా మిగతా మైనారిటీ వర్గాలు భావించే అవకాశం ఉంది. మతం లాంటి వ్యక్తిగత విషయాల్లో ప్రభుత్వ జోక్యమేంటనే నిరసనలు తలెత్తొచ్చు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ద్వారా సంక్రమించే మత స్వేచ్ఛకు అడ్డంకిగా భావించొచ్చు. ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన సున్నితమైన అంశం కావడం వల్ల కొందరు దీనిని వ్యతిరేకించొచ్చు. ఇప్పటి వరకు ఉమ్మడి పౌరస్మృతి అంశంపై కోర్టులు కూడా స్పష్టమైన ఆదేశాలివ్వలేదు. గడిచిన 40 ఏళ్లలో భిన్న తీర్పుల్లో భాగంగా దేశ సమైక్యత కోసం యూనిఫావ్‌ు సివిల్ కోడ్ తీసుకు రావాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు సూచిస్తూ వచ్చింది. అయితే తీవ్రమైన పరిణామాలకు దారితీసే ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావడం కంటే లింగ అసమానతలను తొలగించేందుకు పౌర స్మృతులను సవరణ చేస్తే సరిపోతుంది. కానీ ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఒకే దోపిడీ, ఒకే వివక్ష, ఒకే విధ్వంసం, ఒకే ఉన్మాదంతో జనాన్ని ముంచే యత్నాలకు ఇప్పుడు పాలకులకు ఉమ్మడి పౌరస్మృతి ఒక ఆయుధంలా దొరికింది. డెబ్భయి అయిదేండ్ల స్వాతంత్య్రంలో ఆర్థిక అసమానతలు అంతరించకపోగా పెరిగాయి. సామాజిక అసమానతలు అలానే ఉన్నాయి! ఉన్నవాడి బాధలకు, లేనివాడి బాధలకు ఏకరూపత లేదు.
స్త్రీ, పురుషుల సమానత్వమూ సాధించబడలేదు. చదువుకునే హక్కును అందరూ ఇంకా పొందలేకపోతున్నారు. పసిపిల్లల ఆహారమూ, ఆరోగ్యమూ అందరికీ సమానంగా సాధించబడలేదు. ఉండటానికి కూడు, గుడ్డ, నీడ సమకూర్చనేలేదు. ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్లుగా, ఎన్నికల సమయంలో ఈ పౌరస్మృతి చట్టాన్ని ప్రచారంలోకి తెచ్చారు. ఒకటి మతాల మధ్య ద్వేషాలను పెంచటం, రెండోది ఉమ్మడి పేరుతో సామాన్య బడుగు, బలహీన ప్రజల ప్రత్యేక హక్కులను కాలరాసి కార్పొరేట్లకు మేలు చేయటం, పేదల రాయితీలను రద్దు చేయటం అనేవి దీని మూలంగా జరిగే అనర్థాలు. చాలా మంది ప్రజలు ఉమ్మడి పౌరస్మృతి అనగానే మతపరమైన అంశమని, అదీ మన ప్రత్యర్థి మతాన్ని నియంత్రించేదని అనుకుంటున్నారు. కానీ ఇది అన్ని మతాలకూ, అందరు ప్రజలకూ సంబంధించినది. అందుకనే చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఆనాడు అంబేడ్కర్ హిందూ కోడ్ బిల్లును తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తే హిందూ సాంస్కృతిక మహా సౌధం కూలిపోతుందని వ్యతిరేకించిన శ్యాంప్రసాద్ ముఖర్జీ హిందూ సంఘీయుల వారసులు ఇప్పుడెలా ఉమ్మడి విధానాన్ని ముందుకు తెస్తున్నారు? హిందూ సంస్కృతిలో ఏ అంశాన్నీ వేలెత్తి చూపడానికి వీల్లేదని వాదించిన వారే నేడు ఈ నినాదాన్ని ఎత్తుకోవటం వెనుక వారి ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి.
పర్సనల్ లాలు ఒక్క ముస్లింలకే లేవు, అన్ని మతాలకూ ఉన్నాయి. అందరూ సమానంగా వ్యవహరించటానికి మన రాజ్యాంగమూ అందరికీ అన్ని హక్కులనూ కల్పిస్తున్నది కూడా. ముస్లిం షరియత్, పెండ్లిళ్లు, తలాక్‌లకు మాత్రమే సంబంధించిన విషయం కాదు. కానీ ఆ రకమైన వైరుధ్యాన్ని ముందుకు తెచ్చి, విద్వేషాలను నింపజూస్తున్నది. అందుకనే ఉమ్మడి స్మృతికి హిందూ రాష్ర్ట భావనకు సంబంధం ఉన్నదని, వేల సంవత్సరాలుగా భిన్న అభిప్రాయాలతో, సంస్కృతులతో జీవిస్తున్నాం, మరో వేయ్యేండ్లు జీవిస్తాం. యుసిసి ప్రవేశపెట్టి ఎవరు ప్రయోజనం పొందుతారని నోబుల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ ప్రశ్నించారు. వందల వేల సంవత్సరాలుగా దేశంలోని దళితులు, ఆదివాసీలు ఆర్థిక దోపిడీకి, లైంగిక దోపిడీకి గురవుతున్నందున వారి కోసం ఎన్నో ప్రత్యేక చట్టాలు వచ్చాయి. మరి ఈ ఉమ్మడి స్మృతితో అవన్నీ ఉంటాయా? లేదా! ఆదివాసీలకు 1/70 చట్టం ఉంది. రక్షించబడుతుందా? రిజర్వేషన్లూ ఉన్నాయి. వాటి సంగతేమిటి? మహిళల వివక్షపై, దాడులపై ప్రత్యేక చట్టాలున్నాయి. రేపు కోడ్ వస్తే! బీఫ్ ఆహార హక్కుగా ఉంటుందా లేదా! ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా హడావిడి చేస్తే ఎలా? యుసిసి లేకుండానే లింగ సమానత్వం సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఏవైనా వివక్షలుంటే పరిశీలించి ఆ చట్టాలను సవరించాలి. అంతే కానీ వైవిధ్యాలను, విభిన్నతలను వైరుధ్యంగా చేసే ప్రయత్నాలు సరికాదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News