Home ఎడిటోరియల్ ఏకీకృత పౌర స్మృతి ఎందుకు!

ఏకీకృత పౌర స్మృతి ఎందుకు!

Union Cabinet gives nod to Constitution of 21st Law Commission

భారత పౌరులందరికీ, వివిధ మతాలు ఆచరించే వారికున్న వ్యక్తిగత పౌరస్మృతి (సివిల్ కోడ్) స్థానంలో ఏకీకృత లేక ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెట్టాలనే బిజెపి ప్రభుత్వ అభీష్టాన్ని భారత లా కమిషన్ తోసిపుచ్చింది. అది “ వాంఛనీయం కాదు, అవసరం లేదు” అని స్పష్టం చేసింది. దేశంలో నెలకొని ఉన్న బహుళత్వాన్ని అది సమర్థించింది. కుటుంబ చట్టాలకు సంబంధించి ఒక చర్చా పత్రాన్ని సమర్పించింది. ప్రభుత్వానికి అత్యున్నత న్యాయ సలహా సంస్థ అయిన లా కమిషన్ సిఫారసులు ప్రభుత్వానికి శిరోధార్యం కాకపోయినా నైతికంగా ప్రభావవంతమైనవి. రాజ్యాంగం ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచిన ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెట్టే సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మోడీ ప్రభుత్వం రెండేళ్ల క్రితం 21వ భారత లా కమిషన్‌ను కోరింది. మత సంబంధంగా భిన్నాభిప్రాయాలు ఉండటమనేది వివక్ష ఉన్నట్లు కాదని, తద్భిన్నంగా బలమైన ప్రజాస్వామ్యానికి సూచన అని లా కమిషన్ తన 185 పేజీల నివేదికలో పేర్కొన్నది. వ్యక్తిగత చట్టాల్లో భిన్నత్వాన్ని కాపాడుకోవటమే ఉత్తమమార్గం. అయితే అదే సమయంలో, భారత రాజ్యాంగం హామీ యిచ్చిన ప్రాథమిక హక్కులకు వ్యక్తిగత చట్టాలు విరుద్ధం కాకుండా చూడాలని అది అభిప్రాయం వెలిబుచ్చింది. కమ్యూనిటీల మధ్య సమానత్వం సాధించే ప్రయత్నం కన్నా ఒక సముదాయంలోపల సమానత్వాన్ని గ్యారంటీ చేసే విషయాన్ని చట్టసభ ముందుగా పరిశీలించాలని సూచించింది.

ఉమ్మడి పౌరస్మృతి బిజెపి ప్రధాన ఎజెండాలో ఒక ముఖ్యాంశం. అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చిన ప్రదేశంలో బ్రహ్మాండమైన రామాలయ నిర్మాణం, కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన రాజ్యాంగ అధికారణ 370 రద్దు, ఏకీకృత లేక ఉమ్మడి పౌర స్మృతి దాని హిందూత్వ ఎజెండాకు మూలస్తంభాలు. విశ్వ హిందూ పరిషత్‌లో ఎజెండాలోని రామాలయం అంశాన్ని, వెనుకబడిన తరగతులకు మండల్ కమిషన్ రిజర్వేషన్ సిఫారసుల అమలు నేపథ్యంలో బిజెపి తన ఎజెండాలోకి తీసుకుంది. దానిపై ఎల్.కె.అద్వానీ రథయాత్ర అనంతర పరిణామాలు చరిత్రలో భాగం. అయోధ్యలో స్థల వివాదం కేసు, సుప్రీంకోర్టులో ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నందున ఆలయ నిర్మాణ ప్రయత్నాలు ముందుకు సాగలేదు. ఆర్టికల్ 370 రద్దు అసాధ్యం అని తెలిసి కూడా ముస్లీం వ్యతిరేకతను సృష్టించి హిందువులను కూడగట్టే ఓటు బ్యాంక్ రాజకీయాల్లో భాగంగా బిజెపి ఆ అంశాన్ని తన ఎజెండాలో కొనసాగిస్తోంది. ప్రచారం చేస్తోంది.

ఇక ఉమ్మడి పౌర స్మృతి అనేది హిందూ వ్యక్తిగత చట్టాలకు అనుగుణంగా ముస్లిం వ్యక్తిగత చట్టాలపై ఎక్కుపెట్టబడిన అస్త్రం. స్త్రీ, పురుష సమానత్వం విషయంలో అన్ని మతాల వ్యక్తిగత చట్టాల్లో అనేక వివక్షలు కనిపిస్తాయి. ఇది ఆయా మతాల్లోపల చైతన్యం తీసుకురావటం ద్వారా జరగాల్సిన సాంఘిక సంస్కరణ. హిందూ మెజారిటీ ఆధిక్యత మూల సిద్ధాంతంగా గల బిజెపి ఉమ్మడి పౌరస్మృతిని తన రాజకీయ ఎజెండాలోకి తీసుకోవటంతో ముస్లింల్లో అనుమానాలు, అపార్థాలు పెరిగాయి. తమ వ్యక్తిగత చట్టాల్లో ప్రభుత్వ జోక్యాన్ని వారు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ముస్లిం మహిళలకు జరుగుతున్న అన్యాయం పరిహరించటానికంటూ మోడీ ప్రభుత్వం తెచ్చిన ట్రిపుల్ తలాఖ్ చెల్లుబాటు రద్దుకు ఆ సమాజంలో వ్యతిరేకత ఈ నేపథ్యం నుంచి విడదీయరానిది.

సంకీర్ణ రాజకీయ శకంలో 1997 లో ఎన్‌డిఎ పేరుతో ప్రాంతీయ పార్టీలను కూడగట్టే నిమిత్తం నాటి బిజెపి నాయకుడు అతల్ బిహారీ వాజ్‌పేయీ, పైన పేర్కొన్న మూడు వివాదాంశాలను ఎన్‌డిఎ ఎజెండా నుంచి వెనక్కుపెట్టారు. ఆ తర్వాతే ఆయన ప్రధానమంత్రికాగలిగారు. అన్ని మతాల్లో సంస్కరణలు రావాల్సిన ఆవశ్యకతను వక్కాణించిన లా కమిషన్, ఉమ్మడి పౌరస్మృతిని విధించటంకన్నా, వేర్వేరు వ్యక్తిగత చట్టాలను క్రోడీకరించి సరిపోల్చిచూడటం కొన్ని సార్వజనీన సూత్రాలు రూపొందించటానికి సహాయపడుతుందని చెప్పింది. కుటుంబంలో స్త్రీ పాత్రను గుర్తిస్తూ, వివాహం విడాకులతో ముగిసే సందర్భాల్లో వివాహానంతరం దంపతులు ఆర్జించిన ఆస్తిలో ఆమెకు సమాన భాగం లభించాలని సూచించింది. వివాహానంతరం భార్యాభర్తల్లో ఎవరెంత సంపాదించినా దాన్ని ఒకే యూనిట్‌గా పరిగణించాలంది. అలాగే సమానులుగా వివాహం చేసుకునే నిమిత్తం బాలుర వయో పరిమితిని 18 సం.లుగా నిర్ణయించింది.

చైతన్యం పెంపుదల కృషి ద్వారా జరగాల్సిన సాంఘిక సంస్కరణను రాజకీయం చేయటం వల్ల సానుకూలత ఏర్పడకపోగా వ్యతిరేకత పెరుగుతుందనటానికి ఉమ్మడి పౌరస్మృతిపై బిజెపి పట్టువిడవని ప్రయత్నమే నిదర్శనం.

                                                                                                                                                                 – వాహెద్