Home తాజా వార్తలు విలీనం

విలీనం

three public sector banks

 

దేనా, విజయ, బ్యాంక్ ఆఫ్ బరోడాల విలీనానికి కేంద్ర కేబినెట్ ఆమోదం

న్యూఢిల్లీ: విజయా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంక్‌ల విలీనానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసేందుకు బుధవారం ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2019 ఏప్రిల్ 1 నుంచి ఈ విలీనం అమల్లోకి రానుంది. ఈమేరకు విజయా బ్యాంక్, దేనా బ్యాంక్ ఉద్యోగులు అంతా బ్యాంక్ ఆఫ్ బరోడాకు బదలీ కానున్నారని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు. గతేడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వం ప్రకటించినట్టుగా విజయా బ్యాంక్, దేనా బ్యాంక్‌లు బ్యాంక్ ఆఫ్ బరోడా(బిఒబి)లో విలీనం కానున్నాయి. గతంలో ఓ పెద్ద బ్యాంకుతో చిన్న బ్యాంకును విలీనం చేసేవారు. అయితే దేశంలో మూడు బ్యాంకులను ఇలా విలీనం చేయడం ఇదే తొలిసారి. ఈ విలీనంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బిఐ) తర్వాత ఇది రెండో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ కానుంది.

షేర్ స్వాప్ రేషియో ఖరారు
విజయా బ్యాంక్, దేనా బ్యాంక్ విలీనం కోసం బిఒబి కూడా షేర్ స్వాప్ రేషియోను ఖరారు చేసింది. దీని ప్రకారం, విలీనంలో భాగంగా విజయా బ్యాంక్ వాటాదారులు ప్రతి వెయ్యి షేర్లకు గాను 402 ఈక్విటీ షేర్లను పొందనున్నారు. అలాగే దేనా బ్యాంక్ వాటాదారులు ప్రతి వెయ్యి షేర్లకు గాను 110 ఈక్విటీ షేర్లను పొందుతారు.

ఇది రెండో విలీనం
గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దాని అనుబంధ బ్యాంకులను ప్రభుత్వం విలీనం చేసింది. రెండో దశలో ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంక్, విజయాబ్యాంక్‌లను విలీనం చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్‌బిఐఐ విలీనం సక్సెస్ కావడంతో రెండో దశ మీద అందరి దృష్టి నెలకొంది. ఇక మూడో దశలో పలు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల విలీనానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. బ్యాంకింగ్ రంగంలో విపరీతమైన పోటీ వాతావరణం నెలకొంది. అంతర్జాతీయ బ్యాంకుల నుంచి పోటీ తట్టుకునేందుకు ఈ విలీనం ఉపయోగపడనుందని ప్రభుత్వం భావిస్తోంది. బ్యాంకింగ్ రంగంలో ఎదురవుతున్న సవాళ్లను దృష్టిలో పెట్టుకుని ఈ మూడు బ్యాంకులను విలీనం చేయాలని గత ఏడాది సెప్టెంబర్‌లో భావించారు. అప్పటి నుంచి దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతోంది. అయితే ఈ మూడు బ్యాంకుల విలీనంతో మరింత మెరుగైన బ్యాంకింగ్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

బిఒబిలో రూ.10 లక్షల కోట్ల బిజినెస్
ఈ మూడు బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా వ్యాపారం రూ.10,29,811 కోట్లుగా ఉంది. ఆ తర్వాత విజయా బ్యాంక్ రూ.2,79,674 కోట్లు, దేనా బ్యాంక్ రూ.1,72,937 కోట్లు వ్యాపారం చేస్తున్నాయి. ఈ మూడు బ్యాంకులు విలీనం అయితే మొత్తం వ్యాపార విలువ రూ.14,82,422 కోట్లకు చేరుతుంది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 56,361 మంది సిబ్బంది, విజయా బ్యాంక్‌లో 15,874, దేనా బ్యాంక్‌లో 13,440 మంది ఉద్యోగులు ఉన్నారు. విలీనం పూర్తయితే 85,675 మంది ఉద్యోగులు అవుతారు. ఈ విలీనానికి వ్యతిరేకంగా గతేడాది డిసెంబర్ 26న బ్యాంక్ ఉద్యోగులు సమ్మె నిర్వహించిన విషయం తెలిసిందే.

Union Cabinet has approved the merger of three public sector banks

Telangana News