Home ఎడిటోరియల్ రైలు రాయితీలకు మంగళం?

రైలు రాయితీలకు మంగళం?

Choopu-Cartoon

రైల్వేస్‌ను కార్పొరేట్ తరహాలో నడపడానికి కేంద్రం మార్గాలు వెతుకుతోంది. ఇందుకుగాను రూ. 30,000 కోట్ల రూపాయల సామాజిక సబ్సిడీలకు మంగళం పాడాలని చూస్తోంది. ఈ అంశంలో లోతుగా అధ్యయనానికి రెండు ఆర్థిక సంస్థలతో రైల్వేస్ చర్చలు జరుపుతున్నట్లు కూడా ఆ రంగానికి చెందిన కొందరు చెబుతున్నారు.
నీతి ఆయోగ్‌కు చెందిన నిపుణుడు వివేక్ దేవ్రాయ్ సారథ్యం లోని ఒక బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ‘కార్పొరేట్ ఫక్కీలో రైల్వేస్ నిర్వహణ’ అనే ఆలోచన రైల్వేల పెద్దలకు కలిగినట్లు అర్థమవు తోంది. 2015లో ఆయన నివేదిక సమర్పించారు. జాతీయ ప్రభుత్వ ఆర్థిక విధాన సంస్థ, భారతీయ రైల్వే అధికారుల మధ్య ఇప్పటివరకు ఈ అంశంలో ఒక దఫా చర్చలు జరిగాయి. కార్పొరేట్ తరహాలో నిర్వహణ కోసం ఎలా ముందుకు సాగాలి అన్నది చర్చించారు. ఇందుకుగాను సబ్సిడీలను తగ్గించడం లేదా పూర్తిగా రద్దు చేయడం అంశంపై ఆ రెండు సంస్థలతో రైల్వే అధికార్లు చర్చిస్తున్నారు. వారి దృష్టిలో రైల్వేస్ అన్నది వాణిజ్య సంస్థ. అందుచేత సామాజిక బాధ్యతల బరువు రైల్వేస్‌కి ఉండరాదన్నది వారి వాదన.
సామాజిక సబ్సిడీల బరువును సంబంధిత మంత్రిత్వ శాఖలే భరించాలని సూచిస్తూ గత ఏడాది రైల్వేమంత్రి సురేష్ ప్రభు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి లేఖ రాశారు. ప్రయాణీకుల సేవల ఖర్చులో 57 శాతం మాత్రమే తిరిగి వస్తున్నాయి. అలాగే లోకల్ రైళ్ల నుంచి తిరిగి వచ్చే ప్రయాణీకుల సేవల ఖర్చు 40 శాతం మాత్రమే. ఇటీవల రైల్వే అధికారి ఒకరు ఈ విషయాన్ని వివరించారు. సంబంధిత శాఖలే సబ్సిడీ బరువు భరించాలని గట్టిగా కోరడానికి అధ్యయన నివేదికల సమర్పణ తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖను కలవనున్నట్లు చెప్పారు. ఉదాహరణకు ఒక రక్షణ ఉద్యోగికి సబ్సిడీ రైల్వేస్ ఇస్తున్నట్లయితే ఆ శాఖే ఆ భారాన్ని భరించాలని ఆ అధికారి వివరించారు. రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్‌తో కేంద్ర ప్రభుత్వం మిళితం చేసింది. ఆ విధంగా 92 ఏళ్ల ఆనవాయితీకి స్వస్తి పలికింది. రైల్వేల సామాజిక బాధ్యతల ను ఆర్థిక కార్యకలాపాల నుంచి వేరు చేయడానికి దేవ్రాయ్ బృందం ఆ సిఫార్సు చేసింది.
రైల్వేల క్రమబద్ధీకరణకు ఒక సంస్థ ఉండాలని సురేష్ ప్రభు చాలాకాలంగా సూచిస్తున్నారు. ‘రైల్ డెవలప్‌మెంట్ అథారిటీ (రైల్వేల అభివృద్ధి సంస్థ)’ పేరిట దానిని నెలకొల్పాలని ఆయన ప్రతిపాది స్తున్నారు. వాటా పెట్టుబడిదార్ల ప్రయోజనాల రక్షణకు, రైల్వేలకు సంబంధించిన వివిధ రేట్ల నిర్ణయానికి అటువంటి సంస్థ ఉపయోగ పడుతుందని ఆయన సూచన. అలాగే సమర్థతకు, పనితీరు మెరుగుకు ప్రమాణాలను కూడా ఆ సంస్థ నిర్ణయిస్తుంది. సమాచారాన్ని పంపిణీ చేస్తుంది కూడా. తన ఈ ప్రతిపాదనకు ఆమోదం పొందాలని సురేష్ ప్రభు పట్టుదలతో ఉన్నారు. భారతీయ రైల్వేస్ 16 ఏళ్లలో తొలిసారి 2016-17లో అధ్వాన ఆపరేటింగ్ నిష్పత్తిని చూపింది. రూ.100 ఆదాయం గడించడానికి ఎంత ఖర్చు పెట్టామన్నదే ఈ నిష్పత్తి. ఇది పడిపోవడానికి కారణాల్లో సామాజిక సబ్సిడీల బరువును రైల్వేస్ భరించడం కూడా ఒకటని అంటున్నారు. అలాగే వేతన కమిషన్ నివేదిక అమలు కూడా మరో కారణం. కార్యకలాపాల నిష్పత్తి బదులు పనితీరు సూచిక నెలకొల్పాలన్న ప్రతిపాదనపై ఒక విదేశీ కన్సల్టెంట్ ను రైల్వేస్ నియమించింది కూడా.
ఇంత జరిగినా సరకుల లోడింగ్ సామర్థం 2015-16లో 1,104 మిలియన్ టన్నుల నుంచి 2016-17లో 1,109 మిలియన్ టన్నులకు పెరిగింది. ‘సరకుల రవాణా ఆదాయాన్ని కూడా పెంచడం పై దృష్టి పెట్టాము. ఇది కూడా సబ్సిడీల బరువు దించుకుంటేనే పెరుగుతుంది. 2017-18లో వేతనాల కమిషన్ నివేదిక అమలు వల్ల పెరిగిన ఖర్చు భారం కూడా లెక్కలోకి రానుంది. ఇది సుమారు రూ. 15,000 కోట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు’ అని ఒక సీనియర్ అధికారి తెలిపారు.

సామాజిక సేవా బాధ్యతల బరువు ఈ కింది విధంగా రైల్వేలపై ఉందని అధికారులు వివరిస్తున్నారు :

  • లోకల్ రైళ్లు, ఇతర సేవలలో అనేక శ్రేణుల ప్రయాణీకులకు రాయితీలు వర్తిస్తున్నాయి. వారిలో సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, సాహస అవార్డుల విజేతలు, రాష్ట్ర-జాతీయ క్రీడల విజేతలు, టోర్నమెంట్లలో పాల్గొనడానికి వెళుతున్న క్రీడాకారులు, యుద్ధరంగం లో అసువులుబాసిన జవాన్ల వితంతువులు, క్యాన్సర్-క్షయ ఇతర తీవ్ర వ్యాధులతో బాధపడుతున్నవారు, వికలాంగులు, పత్రికా విలేకరులు, ఈశాన్య సైనిక సిబ్బందికి ప్రత్యేక రాయితీలు వంటివి ఉన్నాయి.
  • లోకల్ రైళ్ల ప్రయాణీకుల సేవల్లో కూడా చార్జీలు తక్కువగా ఉంటున్నాయి. వివిధ తరగతులకు రాయితీలు ఇస్తున్నారు. లోకల్ రైళ్ల ప్రయాణీకులకు సీజన్ టిక్కెట్లపేర అందుతున్న రాయితీలు రైల్వేస్‌కు భారంగా ఉన్నాయి.
  • సరకు రవాణా సేవల్లో కూడా రాయితీలు వర్తిస్తున్నాయి. అత్యవసర సరకుల క్యారేజీలకు రాయితీ రేట్లు వర్తింపచేస్తున్నారు. అలాగే తపాలా సిబ్బందికి, సైనిక జవాన్ల-సరకుల రవాణాకు, ఈశాన్యంలో రిజిస్టర్డ్ వార్తా పత్రికల, మ్యాగజైన్ల రవాణాకు రాయితీ లు ఇస్తున్నారు.
  • ఆర్థికంగా లాభసాటికాని రైల్వే విభాగాలను కొనసాగించడం కూడా భారంగా మారింది.

ఈ రాయితీల భారాన్ని తగ్గించుకోవాలని సురేష్ ప్రభు ఆలోచిస్తు న్నారు. కేంద్రం కూడా అదే దారిలో యోచిస్తోంది. రైల్వేల ప్రైవేటీ కరణ ద్వారా భారం తగ్గింపు లక్షాన్ని అందుకోవాలని కేంద్రం యోచిస్తోంది. గంటకు 500 కి.మీ వేగంతో నడిచే మాగ్లేవ్ రైళ్లు (నేలతో సంబంధం లేకుండా భూమికి కొంత ఎత్తున దూసుకుపోయే కొత్త రకం రైళ్లు) నడపడానికి ప్రైవేట్ సేవా సంస్థలను మన రైల్వేస్ గత ఏడాది ఆగస్టులో ఆహ్వానించింది. ఈ రకం రైళ్లు చైనా, జపాన్, జర్మనీ లలో ఉన్నాయి. అయస్కాంత శక్తితో భూమికి కొంత ఎత్తున ఈ రకం రైళ్లు దూసుకుపోతాయి. ఈ టెక్నాలజీని ‘మాగ్నటిక్ వెవిటేషన్’ అంటారు. అంతేకాకుండా అమితవేగంగా రైళ్లు నడపడానికి వేరే సాంకేతిక విజ్ఞానాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అటువంటి ‘హై స్పీడ్’ రైళ్లను నడపడానికి కూడా విదేశీ సంస్థలను కేంద్రం ఆహ్వానించింది.
ప్రాంతీయ రైలు మార్గాల మధ్య ‘అనుసంధానం’ పెంచడానికి కూడా ప్రైవేటీకరణ మంత్రాన్నే కేంద్రం పఠిస్తోంది. మొత్తానికి ఏదో విధంగా రైల్వేల ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ కేంద్రం లక్షంగా ఉంది. ఇందుకు సామాజిక బాధ్యతల భారాన్ని రైల్వేలకు లేకుండా చేయాలని సంకల్పించింది. ప్రైవేటురంగపు లాభాల దాహానికి బాధ్యతల అడ్డు లేకుండా చేయడమే ఈ ఆలోచన వెనుక అసలు లక్షంగా కనిపిస్తోంది.
* షైన్ జాకబ్