Home తాజా వార్తలు దీర్ఘకాలిక పరిష్కారం

దీర్ఘకాలిక పరిష్కారం

central-minister

పెట్రో ధరల పెరుగుదలపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందన

న్యూఢిల్లీ: వరుగా పదో రోజు పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడంతో ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. పెట్రో ధరల్లో అస్థిరత, తరచూ సవరణలపై దీర్ఘకాలిక పరిష్కారం దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. 15 ఏళ్లుగా వస్తున్న పక్షం రోజులకోసారి పెట్రో ధరల సవరణను గతేడాది జూన్‌లో బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం తుంగలో తొక్కి.. రోజువారీ రేట్ల సవరణకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కర్నాటక ఎన్నికల నేపథ్యంలో 19 రోజులపాటు పెట్రో ధరల సవరణను నిలిపివేసి.. కౌంటింగ్ తర్వాత రోజు నుంచి మళ్లీ రేట్ల సవరణ ప్రారంభించారు. అప్పటి నుంచి మొదలు పెట్రో రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు లీటరు పెట్రోలుపై రూ.2.54, డీజిల్‌పై రూ.2.41 పెరిగింది. పది రోజులుగా పెట్రో ధరల పెరుగుదల కారణంగా ఎక్సైజ్ సుంకం తగ్గించాలని కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది. అయితే ప్రజల ఆందోళనలకు పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నా రు. సమస్యపై తాత్కాలిక చర్యలకన్నా దీర్గకాలిక పరిష్కారంపై దృష్టి పెట్టామని, ధరల అనిశ్చితి సమస్యను పరిష్కరించాల్సి ఉందని అన్నారు.
ముంబైలో లీటరు పెట్రోలు రూ.85
కాగా పెట్రోల్ ధరలు బుధవారం ఢిల్లీ, ముంబయిల్లో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఢిల్లీలో మొట్టమొదటిసారి లీటరు పెట్రోల్ ధర రూ. 77 దాటింది. కాగా ముంబయిలో లీటరు పెట్రోల్ ధర రూ. 85కు కేవలం 1 పైసా తక్కువగా(రూ. 84.99) ఉంది. ఇంధన ధరలు బుధవారం పదో రోజున ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై వంటి మెట్రో నగరాల్లో వరుసగా పెరిగాయి. ఇతర నగరాల్లో లీటరు పెట్రోల్‌పై 14 నుంచి 34 పైసలు, డీజిల్‌పై 21 నుంచి 31 పైసలు పెరిగాయి. తాజాగా పెరిగిన ధరలు బుధవారం ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వచ్చాయి.
పెట్రోల్‌పై రూ. 25 తగ్గించవచ్చు : చిదంబరం
లీటరు పెట్రోల్‌పై రూ.25 తగ్గించే సామర్థం ఉన్నా ప్రభుత్వం అలా చేయడం లేదని కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబర్ విమర్శించారు. ‘లీటరు పెట్రోల్‌పై రూ. 25 తగ్గించడం సాధ్యమే. కానీ ప్రభుత్వం అలా చేయదు. రూ.1 లేక రూ. 2 మాత్రమే తగ్గించి ప్రజలను మోసగిస్తారు’ అని చిదంబరం తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘హక్కు ప్రకారం సగటు వినియోగదారుడికి దక్కాల్సిన రూ. 25ను కేంద్ర ప్రభుత్వం దిగమింగేస్తోంది’ అని కూడా ఆయన తన తెలిపారు. ముడిచమురు పతనమైనప్పుడల్లా కేంద్రం లీటరు పెట్రోల్‌పై రూ.15 ఆదా చేసుకుందని, అంతేకాక ప్రతి లీటరు పెట్రోల్‌పై అదనంగా రూ. 10 పన్నును విధిస్తోందని చిదంబరం పేర్కొన్నారు.

దివాలా చట్టంలో సవరణలకు కేబినెట్ ఆమోదం

ప్రభుత్వం నియమించిన ప్యానెల్ సూచించిన మార్పులతో దివాలా చట్టంలో చేసిన సవరణలకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ సమావేశం తర్వాత కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, కొత్త చట్టం వివరాలను వెల్లడించలేమని, దీనిని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని అన్నారు. ప్యానెల్ సిఫారసు చేసిన ప్రకారంగా, గృహ కొనుగోలుదారులకు ఊరట కల్గించే విధానాలను కేబినెట్ ఆమోదం తెలిపిందా? అని మీడియా ప్రశ్నించగా మంత్రి సమాధానమిస్తూ.. రాజ్యాంగ ప్రోటోకాల్ దీనిలో ఉందని, రాష్ట్రపతి దీనికి ఆమోదం తెలపాల్పి ఉందని, దీని గురించి ఎలాంటి వివరాలను తెలపలేమని అన్నారు. దివాలా బిల్లుపై 14 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. గృహ కొనుగోలుదారుల సమస్యలకు పరిష్కారం, రుణదాతలకు సులువుగా రికవరీ వంటి అంశాలతో పాటు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖకు ఈ కమిటీ సూచనలు చేసింది.