Home అంతర్జాతీయ వార్తలు కోఫీ అన్నన్ కన్నుమూత

కోఫీ అన్నన్ కన్నుమూత

United Nations former UN Secretary General Kofi Annan dead

ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రెటరీ జనరల్

ప్రపంచ దిక్సూచీగా
మారిన ఆఫ్రికాబిడ్డ 

జెనీవా : ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ కన్నుమూశారు. ఆఫ్రికా దేశం నుంచి తొలిసారిగా ఐరాస జనరల్ సెక్రెటరీగా ఎంపికైన కోఫీ తమ 80వ ఏట స్విట్జర్లాండ్‌లో శనివారం మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన పేరిట వెలిసిన ఫౌండేషన్ వారు వెల్లడించారు. ప్రతిష్టాత్మక దౌత్యవేత్తగా పరిణతి చెంది, తరువాత ఐరాస సారథ్య బాధ్యతలు చేపట్టిన అన్నన్ ఐరాసకు కీర్తి ప్రతీకగా మారారు. స్వల్పకాలిక అస్వస్థత తరువాత ఆయన మృతి చెందినట్లు ఫౌండేషన్ వారు తమ ప్రకటనలో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజానీకాన్ని ఆయన ఎల్లవేళలా ఆదుకున్నారు. ప్రత్యేకించి అణగారిన వర్గాల పట్ల ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ వచ్చేవారు. వారికి చిత్తశుద్ధితో కూడిన ఓదార్పును కల్గించేవారని ఫౌండేషన్ తమ ప్రకటనలో తెలిపింది. ఐరాసకు రెండు పర్యాయాలు ఆయన సెక్రెటరీ జనరల్‌గా ఉన్నారు.

1997 జనవరి 1 నుంచి 2006 డిసెంబర్ 31 వరకూ ఆయన పదవీ బాధ్యతలు అత్యంత సమర్థవంతంగా నిర్వర్తించారు. ఆయన దాదాపుగా తమ అధికార బాధ్యతలన్నింటినీ ఐరాస సేవలోనే ముగించారు. ఆద్యంతం అత్యంత హుందాతనం, ప్రశాంత చిత్తంతో కూడిన కౌశలం, రాజకీయ చాతుర్యం ఆయనకు వరంగా మారింది. ప్రపంచ దేశాల కీలక సంస్థకు ఐరాస అంతర్గత వ్యక్తినే ఏడవ ప్రధాన కార్యదర్శిగా ఎంపికచేసేందుకు దారితీసింది. ఆయన పదవీకాలం మధ్యలోనే ఐరాసకు , ఆయనకు సంయుక్తంగా నోబెల్ శాంతి పురస్కారం 2001లో అందింది. దీనితో ఐరాస ప్రతిష్ట మరింత ఇనుమడించింది. అప్పటివరకూ దెబ్బతిని ఉన్న ఐరాస ప్రతిష్టను చక్కదిదేందుకు ఆయన విశేషంగా కృషి సల్పారు. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో తలెత్తిన సవాళ్లను ధీమంతుడిగా అన్నన్ ఎదుర్కొన్నారు. ఆయన సముపార్జించుకున్న నైతిక ప్రతిష్ట తిరుగులేనిదిగా నిలిచింది. ప్రపంచంలోని కీలక శక్తియుత దేశాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ, వివాదాస్పద అం శాలను సరిదిద్దుతూ ఆయన ప్రస్థానం సాగింది. అంతేకాకుండా ఆయన వ్యక్తిగత ప్రతిష్ట కూడా ఆయనకు ఈ దిశలో సహకరించింది.

జననం ఘనాలో.. సంపన్న కుటుంబంలో
కోఫీ అన్నన్ ఆఫ్రికా దేశం ఘనాలో 1938 ఎప్రిల్ 8వ తేదీన జన్మించారు. ఆ దేశంలోని కుమాసీలో సంపన్న కుటుంబంలో పుట్టిన అన్నన్ తండ్రి ప్రాంతీయ గవర్నర్. గిరిజన ప్రాంత అధినేతల మనవడు. అన్నన్ పలు భాషాకోవిదుడు. ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడే వారు. ఫ్రెంచ్ వచ్చు. పలు ఆఫ్రికా దేశాల భాషలు తెలు సు. ఆయన విద్యాభ్యాసం ప్రఖ్యాత విద్యాలయాల్లో సాగింది. అంతర్జాతీయ వ్యవహారాలలో డిగ్రీ తీసుకున్న అనుభవంతోనే ఆయన ఐరాసలో ఉద్యోగ వృత్తికి చేర్చింది. చివరికి ఆయనను ఈ సంస్థ అధినేతగా చేసింది.

ఓ మంచి కార్యక్రమం చేపట్టేందుకు కోఫీ అన్నన్ తమకు మార్గదర్శక శక్తిగా మారారని ఐరాస ప్రస్తుత అధినేత ఆంటోనియో గుటెర్రెస్ కొనియాడారు. ఆయన మృతి చెందారని తెలిసి బాధపడుతున్నాను. పలు విధాలుగా ఆయన ఐరాసకు మార్గదర్శకులు, ఎందరికో స్ఫూర్తి ప్రదాత అని తెలిపారు. ఆయన సంస్థకు సమర్థవంతమైన నాయకత్వం వహించారు.

ఉదాత్త శాంతి ప్రదాత అన్నన్ : మోడీ
కోఫీ అన్నన్ మరణం పట్ల ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. అన్నన్ కేవలం అతి గొప్ప ఆఫ్రికా నేతగా, దౌత్యవేత్తగా, మానవతావాదిగానే కాకుండా అంతర్జాతీయ శాంతి ప్రదాత, ప్రపంచ భద్రతా పరిరక్షకుడిగా గుర్తుండిపోతారని ప్రశంసించారు. సహస్రాబ్ధి అభివృద్ధి లక్షాలను (ఎండిజి) ఖరారు చేయడంలో కోఫీ అన్నన్ గురుతర బాధ్యత వహించారు. ఆయన సేవలను ప్రపంచ ప్రజలంతా గుర్తుంచుకుంటారని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు, ఆయనకు ఆత్మశాంతి కలుగాలని ఆకాంక్షిస్తున్నట్లు తమ ప్రకటనలో వెల్లడించారు.