Home అంతర్జాతీయ వార్తలు ఇరాన్ పై అమెరికా కఠిన ఆంక్షలు

ఇరాన్ పై అమెరికా కఠిన ఆంక్షలు

United States sanctions against Iran

వాషింగ్టన్ : ఇరాన్‌పై గతంలో ఎన్నడూ లేని విధంగా కఠినమైన ఆంక్షలు విధించామని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో చెప్పారు. ఇరాన్ చమురు, ఆర్థిక రంగాలపై ఈ ఆంక్షలు విధించామని ఆయన తెలిపారు. టెహరాన్‌తో చేసుకున్న బహుళ జాతీయ అణు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నామని మే నెలలోనే ట్రంప్ ప్రకటించారు. అమెరికా తాజాగా విధించిన ఆంక్షలు సోమవారం నుంచే అమలులోకి వచ్చాయని చెప్పారు. ఇరాన్‌తో వ్యాపారాలు చేసే మూడో దేశాల కంపెనీలపై ఈ ప్రభావం ప్రత్యక్షంగా ఉంటుందని తెలిపారు. ఈ ఆంక్షల వల్ల ప్రపంచ చమురు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకునే 8 దేశాలకు ఈ ఆంక్షల నుంచి అమెరికా వెసులుబాటు కల్పించింది. ట్రంప్ తీసుకున్న చర్య అమెరికా ప్రతిష్టని దిగజారుస్తుందని, అనేక సంవత్సరాలుగా రెండు దేశాల మధ్య కొనసాగుతున్న వివాదంలో అమెరికానే నష్టపోతుందని ఇరాన్ నేత ఆయతుల్లా అలీ ఖమేనీ అన్నారు.

ఇరాన్‌పై ఆంక్షలు సోమవారం అర్థరాత్రి నుంచి అమలులోకి వస్తాయని పాంపియో ప్రకటించారు. ఉగ్రవాద ఇరాన్ తన పద్ధతిని మార్చుకోవాలని ఆయన అన్నారు. అమెరికా ఆంక్షలతో ప్రపంచ చమురు మార్కెట్లు అప్రమత్తమయ్యాయి. ఆంక్షల వల్ల తలెత్తే సమస్యలను ఎదుర్కోవడానికి మార్గాలను వెతుకుతున్నాయి. అందరి దృష్టి ఇరాన్ ఎగుమతులపై ఉన్నాయని, అమెరికా ఆంక్షలను ఖాతరు చేయకుండా తమ దేశాలకు చమురుని ఎగుమతి చేస్తుందని కొన్ని దేశాలు ఆశిస్తున్నాయని నిపుణులు చెప్పారు. ఇరాన్ ప్రధాన ఆదాయం చమురు ఎగుమతి వల్లనే వస్తుంది. ఒపెక్ దేశాల్లో ఇరాన్ మూడో స్థానంలో ఉంది. అమెరికా చర్యల వల్ల మే నుంచి ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ మూడు వంతులు పడిపోయింది. ఇరాన్ చమురు ఎగుమతులు రోజుకు మిలియన్ బారెల్స్ తగ్గిపోయాయి.

అయితే ఇప్పటికీ భారత్, చైనా దేశాలు ఇరాన్ నుంచి చమురుని దిగుమతి చేసుకుంటున్నాయి. భారత్, చైనా దేశాలు ఇరాన్ నుంచి చమురుని దిగుమతి చేసుకోవడం ఆరు నెలల్లో ఆపివేయాలని అమెరికా పట్టుబడుతుందా అని ప్రశ్నించినప్పుడు, తాము ఏం చేస్తామో చూడమని పాంపియో అన్నారు. తాము చరిత్రలో ఎన్నడూ లేనంతగా ముడి చమురుని మార్కెట్ నుంచి సేకరించామని, సౌదీ అరేబియా దేశమొక్కటే చమురు ఉత్పత్తిలో ఇరాన్‌కు ప్రత్యామ్నాయమని పాంపియో తెలిపారు. అమెరికా ఆంక్షలు విధించిన వెంటనే ఇరాన్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం దగ్గర ఇరానియన్లు నిరసనకు దిగారు. అమెరికా జెండా, నకిలీ డాలర్లని తగులబెట్టారు.
అమెరికా ఆంక్షలను లెక్కచేయం : ఇరాన్
తమ దేశంపై అమెరికా విధించిన ఆంక్షలను ఖాతరు చేయమని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహాని అన్నారు. సగర్వంగా ఆంక్షలను అధిగమిస్తామని తెలిపారు. అంతర్జాతీయ నియమాలకు ఈ ఆంక్షలు వ్యతిరేకమని, ఇది చట్టవ్యతిరేకమైన చర్య అని, అన్యాయమైన ఆంక్షలని రౌహాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఆర్ధిక యుద్ధంలోఉన్నామని, చట్టం, అంతర్జాతీయ నియమాలకు వ్యతిరేకమైన వ్యక్తి అమెరికా చరిత్రలోనే ఒకరు వైట్ హౌజ్‌లో చేరారని అన్నారు. తాజాగా అమెరికా విధించిన ఆంక్షల వల్ల ఇరాన్ ముడి చమురు ఎగుమతులు దారుణంగా పడిపోతాయి. మే నుంచి ప్రతిరోజు మిలియన్ బారెల్స్ ఎగుమతులు తగ్గిపోయాయి. అంతర్జాతీయంగా వచ్చే ఆదాయం తగ్గిపోయింది.

అయితే ఆంక్షల నుంచి భారత్, జపాన్, టర్కీతోపాటు మరో ఐదు దేశాలకు అమెరికా తాత్కాలిక మినహాయింపు ఇచ్చింది. ఈ దేశాలు ఇరాన్ నుంచి ముడి చమురుని దిగుమతి చేసుకోవచ్చని, ప్రపంచ మార్కెట్, ఆయా దేశాల ఆర్థిక రంగాలను దృష్టిలో పెట్టుకుని ఈ వెసులుబాటు కల్పించామని అమెరికా ప్రకటించింది. అయితే ఇరాన్ చమురు ఎగుమతులను సున్నాకి తీసుకువస్తామని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి స్పష్టం చేశారు. మనం కూర్చొని చర్చించుకుందామని అమెరికా అంటుందని, దేని గురించి చర్చించాలని ఇరాన్ అధ్యక్షుడు రౌహానీ ప్రశ్నించారు. తాను ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి హాజరైనప్పుడు మధ్యవర్తిత్వం వహిస్తామని నాలుగు దేశాలు చెప్పాయని, మధ్యవర్తులు అవసరం లేదని ఆనాడే చెప్పానని ఆయన తెలిపారు. అమెరికా విధించిన ఆంక్షలను బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, చైనా, రష్యా వ్యతిరేకించాయి. చమురు వ్యాపారాన్ని అడ్డుకోవద్దని కోరాయి.

United States sanctions against Iran

Telangana News