Home అంతర్జాతీయ వార్తలు బందీలుగా 2లక్షల మంది ఉగ్యూర్‌లు

బందీలుగా 2లక్షల మంది ఉగ్యూర్‌లు

చైనాలో నిర్బంధకాండపై ఐరాస ఆందోళన

China

జెనీవా : చైనా వాయవ్య ప్రాంతంలోని జిన్‌జియాంగ్ రాష్ట్రంలో ఉగ్యూర్ తెగవారు బందీలుగా మగ్గిపోతున్నారు. చాలా కాలంగా దాదాపు రెండు లక్షల మంది ఉగ్యూర్‌లను రాజకీయ శిబిరాలలో బందీలుగా ఉంచినట్లు ఐరాస హక్కులకు సంబంధించిన వర్ణ వివక్ష వ్యతిరేక కమిటీ తెలిపింది. ఉగ్యూర్‌లలో అత్యధికులు ముస్లింలు. నిర్థిష్ట హక్కులు లేని మైనార్టీలు . వారంతా వివిధ క్యాంపులలో నిర్బంధకాండను అనుభవిస్తున్నట్లు జాతివివక్ష వ్యతిరేక కమిటీ సభ్యులు గే మెక్‌డౌగాల్ తెలిపారు. ఈ నిర్బంధ రాజకీయ శిబిరాలలో ఈ తెగవారు పడుతున్న అష్ట కష్టాల గురించి తమకు అత్యంత విశ్వసనీయమైన రీతిలో నిజాలు తెలిశాయని, వీటిని నిర్థారించుకుని నివేదికను రూపొందించామని ఆమె వెల్లడించారు. బయటి ప్రపంచానికి తెలియకుండా లోగుట్టుగా ఈ క్యాంప్‌లను నిర్వహిస్తున్నారు. దీనితో వీటిలో ఏం జరుగుతున్నదనేది అంతుచిక్కకుండా మారింది. అయితే ఈ వర్ణ వివక్ష వ్యతిరేక కమిటీ వారు అన్ని అంశాలను నిర్థారించుకుని నివేదికను వెల్లడించారు. మొత్తం రెండు లక్షల మంది ఉగ్యూర్‌లు , ముస్లిం తెగల వారిని ఈ రాజకీయ శిబిరాలలో ఉంచి వారి ఆలోచనా ధోరణిని మార్చేందుకు నిర్భంధ శిక్షణను ఇస్తున్నారని వెల్లడైంది.

ఆ క్యాంప్‌లను పేరుకు సైద్థాంతిక రాజకీయ శిక్షణా శిబిరాలుగా పిలుస్తున్నారు . కానీ వాస్తవానికి అవి నిర్బంధ శ్రామిక శిబిరాలుగా, అంతకు మించి వెట్టి కేంద్రాలుగా ఉంటున్నాయని పాశ్చాత్య దేశాల పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. పశ్చిమ జిన్‌జియాంగ్ ప్రాంతం స్వయంప్రతిపత్తి ప్రాంతంగా ఉంది. కానీ ఉగ్యూర్‌ల బతుకులు పరాధీనంగా మారాయి. మతపరమైన తీవ్రవాదం అణచివేత పేరిట , చైనాలో సామాజిక స్థిరత సాధన సాకుతో ఈ మొత్తం ప్రాంతాన్ని నిజానికి ఒక జైలుగా మార్చారని నివేదికలో ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదం, అస్థిరత్వం ఆటకట్టుకు ఈ క్యాంప్‌ల నిర్వహణ అత్యవసరం అని చైనా అధికారికంగా తెలియచేస్తోంది. ఉగ్యూర్ ప్రాంతం స్వయం ప్రతిపత్తి ప్రాంతం.

అధికారికంగా చూస్తే ఈ తెగవారు పూర్తి స్థాయి నిర్ణయాధికారంతో ఉండొచ్చు. అయితే ఈ క్యాంపుల ఏర్పాటుతో ఈ ప్రాంతం అంతా ఒక అనధికారిక నిర్బంధ స్థావరంగా మారిందని వెల్లడైంది. ఈ ప్రాంతంలో హక్కులు హరించబడ్డాయి. నిజానికి ఈ ప్రాంతంలో ఉగ్యూర్‌లు ఓ దశలో అత్యధిక సంఖ్యాకులు. అయితే ఈ ప్రాంతంలోకి భారీ స్థాయిలో హాన్ చైనీస్ వారు ఒక వ్యూహం ప్రకారం తరలిరావడంతో ఉగ్యూర్‌లు ఇప్పుడు మైనార్టీలుగా మారారు. అంతేకాకుండా ఉగ్యూర్‌ల ఆచార వ్యవహారాలపై చైనా అధికార వ్యవస్థ ఉద్ధేశపూర్వకంగానే అణచివేతకు పాల్పడుతున్నారని , ఇప్పుడు ఏకంగా వారిని నిర్బంధ శిబిరాలలో తోశారని నివేదిక తెలిపింది. హక్కుల పరిరక్షణపై రెండు రోజుల సమీక్షా సమావేశం సందర్భంగా కమిటీ సభ్యురాలు తీవ్రస్థాయిలో ఈ ప్రాంతపు పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఇస్లామిక్ తీవ్రవాదుల నుంచి పలు సవాళ్లు : చైనా

ఈ ప్రాంతంలో ముస్లిం తీవ్రవాద ప్రాబల్యాన్ని నివారించేందుకు పలు చర్యలకు దిగాల్సి వస్తోందని చైనా అధికార యంత్రాంగం తెలియచేస్తోంది. ఓ వైపు ఇస్లామిస్టులు, మరో వైపు వేర్పాటువాదులు తమకు సవాలుగా మారారని, ఇక ఈ ప్రాంతంలోని అత్యధిక ముస్లిం ఉగ్యూర్‌లు ఇతరుల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు పావులు కదుపుతున్నారని అందుకే నియంత్రణ చర్యలకు పాల్పడుతున్నట్లు చైనా తెలియచేస్తోంది. ఈ ప్రాంతం తమదే అని ఉగ్యూర్‌లు వాదిస్తున్నారు. అయితే ఇప్పుడు హాన్ చైనీయులు అత్యధిక సంఖ్యాకులుగా మారడంతో ఈ ప్రాంతం వివాదాలకు కేంద్రంగా మారింది. అయితే జెనీవా సదస్సు నేపథ్యంలో కమిటీ చేసిన వ్యాఖ్యలపై చైనా స్పందించలేదు.

జెనీవాలో సోమవారం వరకూ జరిగే కీలక సమీక్షా సమావేశానికి చైనా నుంచి 50 మంది అధికారులతో కూడిన ప్రతినిధి బృందం హాజరవుతోంది. చైనాలో ఉగ్యూర్‌లు, ఇతర ముస్లింలపై సాగుతోన్న అణచివేత చర్యల పట్ల ఐరాసలోని అమెరికా అధికారిక బృందం స్పందించింది. ఈ పరిణామాలు తమకు ఆందోళన కల్గిస్తున్నాయని తెలిపింది. అయితే చైనాలోని ముస్లిం వర్గాలు దేశంలో పూర్తి స్థాయిలో ఇస్లాంను దెబ్బతీసే విధంగా అణచివేత జరుగుతోందని ఆందోళన చెందుతున్నాయి. చైనాకు చెందిన హక్కుల పరిరక్షణ ప్రముఖులు కూడా పరిస్థితిపై తమ స్పందనను వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలోనే అత్యధికంగా అరెస్టులు జరిగాయని తెలిపారు.

జెనీవాలో అంతకుముందు చైనా ప్రతినిధి తమ వాదనను విన్పించారు. దేశంలోని అన్ని తెగల వట్ల అధికార యంత్రాంగం సమానతను పాటిస్తోందని, సంఘీభావానికి ప్రాధాన్యతను ఇస్తున్నామని తెలిపారు. వర్ణ వివక్షత సాగుతోందని, తెగలు, వాటి మత ప్రాతిపదికతన అధికార వ్యవస్థకు శత్రువులుగా పరిగణించే ధోరణి పెరిగిందని మెక్‌డౌగాల్ అభిప్రాయపడ్డారు. ఈజిప్టు, టర్కీ వంటి దేశాల నుంచి చైనాకు తిరిగి వచ్చిన వంద మందికిపైగా ఉగ్యూర్ విద్యార్థులను నిర్బంధంలోకి తీసుకున్నారని, వారి పరిస్థితి ఏమిటనేది తెలియదని చెప్పారు.