Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

సైనాకు షాక్

nehwalటోక్యో : ప్రపంచ నెం.1 సైనా నెహ్వాల్‌కు జపాన్ సూపర్ సిరీస్‌లో షాక్ తగిలింది. ఏడాదిగా అద్భుత ఫామ్‌లో ఉన్న సైనా రెండోరౌండ్లో అన్‌సీడెడ్ మిత్సుని మితాని(జపాన్)తో చేతిలో ఓటమి పాలైంది. సొంతప్రేక్షకుల మధ్య చెలరేగి ఆడిన మితాని 21-13, 21-16తో సైనాను చిత్తుచేసింది. 40 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌ను సైనా ఘనంగా ఆరంభించింది. సైనా తప్పిదంతో మ్యాచ్‌లో మితాని తొలిపాయింట్ సాధించినా తరువాత సైనా వరుస పాయింట్లతో 6-2తో నిలిచింది. అయితే అదే స్కోరువద్ద నెట్‌గేమ్ ఆడిన మితాని..సైనాపై ఒత్తిడి పెంచి స్కోరుబోర్డును 7-7తో సమంచేసింది. ఆ వెంటనే చెరో పాయింట్ నెగ్గి స్కోరుబోర్డును మళ్లీ 8-8తో సమం చేసినా.

తరువాత స్మాష్‌లతో విజృంభించిన మితాని.. ఐదు వరుస పాయింట్లు నెగ్గి 13-8తో నిలిచింది. ఈ దశలో సైనా పుంజుకునే ప్రయత్నం చేసినా గేమ్‌పై పట్టు కోల్పోని మితాని చివరికి గేమ్‌ను 21-13తో సొంతం చేసుకుంది. ఇక రెండో మొదట్లోనే సైనా 6-0 ఆధిక్యాన్ని సాధించినా మళ్లీ తడబాటుకు గురైంది. పదేపదే షటిల్‌ను నెట్ కొడుతూ మితానికి పాయింట్లు సమర్పించుకోవడంతో సైనా ఆధిక్యం క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇక సైనా 14-12 ఆధిక్యంలో ఉన్న దశలో మిథాని వరుస  పాయింట్లు నమోదుచేసి ఆధిక్యంలో నిలిచింది. ఇక అదే జోరును కొనసాగించిన మితాని చివరికి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

తొలిరౌండ్లో మితాని భారత్‌కే చెందిన పివి సింధును ఓడించిన విషయం తెలిసిందే. ఇక పురుషుల సింగిల్స్‌లో మూడోసీడ్ కిడంబి శ్రీకాంత్ కూడా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. భారత్‌కే చెందిన పారుపల్లికశ్యప్ 21-11, 21-19తో చేతిలో శ్రీకాంత్ ఓటమిచవిచూశాడు. తొలిగేమ్ వీరిద్దరూ స్కోరుబోర్డు 6-6 వరకు హోరాహోరీగా తలపడినా.. సీనియర్ షట్లర్ కశ్యప్ తెలివిగా ఆటతీరు మార్చి 9-6తో ముందంజ వేశాడు.  తరువాత ఒత్తిడికి గురైన శ్రీకాంత్ తప్పులు చేయడంతో కశ్యప్ గేమ్‌ను సులువుగానే సొంతం చేసుకున్నాడు.

రెండోగేమ్‌లోనూ జోరు కొనసాగించిన కశ్యప్ 4-1తో నిలిచినా శ్రీకాంత్ పుంజుకొని స్కోరును 8-8తో సమం చేయడంతో పాటు 19-14తో నిలిచాడు. అయితే శ్రీకాంత్ మళ్లీ తడబాటుకు గురికావడంతో కశ్యప్ గేమ్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. మరో మ్యాచ్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ కూడా 9-21, 16-21తో క్వాలిఫయిర్ లీ డాంగ్(కొరియా) చేతిలో ఓడాడు.

Comments

comments