Friday, April 19, 2024

అకాల వర్షం..అపార నష్టం

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని పలు మండలాల్లో శనివారం రాత్రి, ఆదివారం అకాల వర్షాలు రైతులను దారుణంగా దెబ్బతీశాయి. పలు గ్రామాల్లో చేతికి వచ్చిన పంటలకు అపార నష్టం వాటిల్లడంతో రైతులు లబోదిబో మంటున్నారు. దోమకొండ మండలంలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి, ఈదురు గాలులకు వరి, మొక్కజొన్న పంటలతో పాటు ఇతర పంటలు నేలకొరిగాయి. వర్షానికి దెబ్బతిన్న పంటలను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జెడ్‌పిటిసి తిరుమల్‌గౌడ్ తదితరులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ నష్టపోయిన రైతులందరికీ ముఖ్యమంత్రితో

మాట్లాడి ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బీర్కూర్ మండలంలోని కిష్టాపూర్, అన్నారం, చించొల్లి తదితర గ్రామాల్లో గత రాత్రి కురిసిన అకాల వర్షం, వడగండ్లతో నష్టపోయిన పంటలను ఆదివారం ఉదయం మాజీ స్పీకర్, ఎంఎల్‌ఎ పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి ఆయా శివారుల్లో వరి పంటలను పరిశీలించారు. బాధిత రైతులను ఓదార్చారు. జరిగిన పంట నష్టం గురించి ఫోన్ ద్వారా కామారెడ్డి జిల్లా కలెక్టర్, నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌లకు ఆయన వివరించారు.
కామారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో శనివారం రాత్రి కురిసిన వడ గండ్ల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వ ఆదుకోవాలని కామారెడ్డి ఎంఎల్‌ఎ కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. ఆదివారం కామారెడ్డి మండలంలోని తిమ్మక్‌పల్లి, చిన్న మల్లారెడ్డి, కొటాలపల్లి, నర్సన్నపల్లి గ్రామాల్లో వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.

మొక్కజొన్న, వరి, కూరగాయల పంటలు 90 శాతానికిపైగా దెబ్బతిన్నాయని అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజక వర్గంలో కురిసిన వడగళ్ల వర్షం వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని బిఆర్‌ఎస్ నాయకుడు, దర్పల్లి జడ్‌పిటిసి సభ్యుడు బాజిరెడ్డి జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిరికొండ మండలం, మైలారం, కుర్ధుల్‌పేట్, న్యావనంది, రావుట్ల గ్రామాల్లో వడగళ్ల వర్షం వల్ల దెబ్బతిన్న వరి, మొక్కజొన్న పంటలను పరిశీలించారు. కల్లాల్లో ఆరబోయగా తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు.సంగారెడ్డి జిల్లా, న్యాల్‌కల్ మండలంలో ఆదివారం అకాల వర్షం, గాలి వాన బీభత్సం సృష్టించాయి. పొలాల్లో పంటలు నేలకొరిగాయి. మెటల్‌కుంట=అల్లాదుర్గం రహదారిపై ముంగి గ్రామ శివారులో చెట్టు నేలకొరిగింది. దీంతో ప్రయాణికులు గంటల తరబడి గాలివానలో నిలబడక తప్పలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News