Home ఎడిటోరియల్ ఆదిత్యుడే బిజెపి నాథుడా?

ఆదిత్యుడే బిజెపి నాథుడా?

Cartoon-New

దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా ప్రధాని మోడీ ప్రతిష్ఠ మసకబారి ఆయన గడ్డు పరిస్థితిలో పడినందువల్ల వచ్చేనెల, డిసెంబర్‌లో ఎన్నికలు జరగనున్న హిమాచల్ – గుజరాత్‌లో ప్రచారానికి, కేరళలో మార్క్సిస్టు వ్యతిరేక సభలకు ఆయన స్థానే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ను దింపాలని బిజెపి కొత్తగా యోచిస్తోంది. అయితే గోరఖ్‌పూర్ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరవడి సుమారు 69మంది పసిపిల్లలు మరణించడంతో అప్రతిష్ఠ మూటకట్టుకున్న ఆదిత్యనాథ్ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. మోడీని అభివృద్ధి నినాదానికి, ఆదిత్యను హిందూత్వకు ప్రత్యేకించారు. కనుక హిందూత్వ ప్రచారానికి ప్రాధాన్యతను ఇస్తూ ఆదిత్యనాథ్‌ను తాజాగా బిజెపి ఎంచుకొన్నట్లు కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ బిఆర్‌డి వైద్య కళాశాల ఆసుపత్రిలో69మంది దాకా పిల్లలు గత ఆగస్టులో ఆక్సిజన్ సరఫరా కొరవడి మరణించారు. ఇటీవల మరి 19మంది పిల్లలు కూడా సరైన వైద్యం లభించక మృతిచెందారు. అది ఆదిత్యనాథ్ నియోజక వర్గం. ఆయన ప్రచార సారథిగా నెగ్గుకు వస్తారా, అందుకు తగిన సమర్థత ఆయనకు ఉందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్న ఈ నేపథ్యంలో సంఘ్ పరివార్ ఆయనను హిందూత్వ ముఖచిత్రంగా చూపదలిచింది.

మరో ప్రక్క బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కేరళలో తమ పార్టీ రాజకీయ అవకాశాలను విస్తరింప చేయాలని నిర్ణయించారు. డిసెంబర్‌లో ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో ఆదిత్యనాథ్ బిజెపికి ప్రచారం చేస్తారు. వచ్చేనెల ఎన్నికలకు సిద్ధమౌతున్న హిమాచల్ ప్రదేశ్‌లో కూడా ఆ పార్టీకి ఆయన ప్రచార సారథి కానున్నారు. గుజరాత్ ప్రచారంలో బిజెపి ఆదిత్య నాథ్ దసరా చిత్రాలను విరివిగా వాడుతోంది. నాథ్‌కు తీరిక దొరికినపుడల్లా భారీ ఎత్తు రాముని విగ్రహ నిర్మాణం వంటి కొత్త పథకాలను ప్రకటిస్త్తున్నారు. ఈ దీపావళికి ఆయన అయోధ్యలో గడపనున్నారు. ప్రచార పట్టాలపైకి మళ్లీ రామమందిరం నిర్మాణం అంశాన్ని ఎక్కిస్తారనడానికి ఇది సంకేతం. 2014 సార్వత్రిక ఎన్నికలు గెలవడానికి మోడీ ప్రచారం చేసిన ‘వికాస్(అభివృద్ధి)’, ‘సుపరిపాలన’ వాగ్దానాలు ఇప్పుడు అడ్రసు లేకుండా పోవడంతో పార్టీ ప్రచార నినాదాలను మార్చే పనిలో బిజెపి పడింది. ఆర్థికవృద్ధి తిరోగమనంలో పడడంతో మోడీ హామీలు గాలిలో కలిశాయి. బ్యాంకింగ్, పరిశ్రమలు, వస్తూత్పత్తి, వ్యవసాయ రంగాలు చతికిలబడి ప్రభుత్వానికి ఆర్థికంగా దిక్కు తోచని పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఎత్తుగడలను సంఘ్ పరివార్ మార్చదలిచింది. యువత అధికంగా ఉన్న దేశం ఉద్యోగ కల్పనలో వెనుకబడడం, ఆ రంగంలో వృద్ధి సున్నాకావడం, మాజీ మంత్రులు, బిజెపి సీనియర్లు యశ్వంత్ సిన్హా,, అరుణ్ శౌరీ వంటివారు ప్రభుత్వ తీరును ఘాటుగా విమర్శించడం, అమిత్ షా కుమారుడు జయ్ షా కంపెనీల ఆస్తులు మోడీ అధికారం చేపట్టాక హఠాత్తుగా పెరగడంపై కథనాలు- ఆరోపణలు వంటి పరిణామాలు బిజెపిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

ఈ ఆరోపణలు ముఖ్యంగా రెండు పర్యవసానాలకు దారితీశాయి. ఒకటి – జయ్ షాకు మద్దతు ప్రకటనల్లో బిజెపి వారు అతి ప్రదర్శించారు. రైల్వేమంత్రి పీయూష్ గోయల్ ప్రత్యేకంగా విలేకరుల గోష్టి ఏర్పాటు చేసి షా కంపెనీల వ్యాపారంపై ‘ది వైర్’ కథనాలను ఖండించారు. ప్రైవేటు వ్యక్తి జీవితంలోకి తొంగిచూసి అతడిని ఇబ్బంది పెట్టడంగా దీనిని గోయల్ అభివర్ణించారు. అనేకమంది కేంద్రమంత్రులు జయ్ షాకు మద్దతుగా టివిలలో మాట్లాడారు. ఆరోపణలను పరిశీలించకుండానే ఖండించడం ‘తక్షణ కర్తవ్యం’ అయినట్టుగా ప్రభుత్వ పెద్దలు ప్రవర్తించారు. అతికి ఇది తిరుగులేని నిదర్శనం. ప్రస్తుతం జయ్‌షా పై వచ్చిన ఆరోపణలవంటివే గతంలో బిజెపి కాంగ్రెస్ నేత సోనియాపై, ఆమె అల్లుడు రాబర్ట్ వాద్రాపై చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ అవినీతి ప్రధాన ప్రచార అంశంగా బిజెపి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్‌పై ఎటువంటి ఆరోపణలు చేసిందో అటువంటి అవినీతి ఉదంతాల్లోనే ఇప్పుడు బిజెపి అత్యున్నత నేత కుటుంబ సభ్యునిపై ఆరోపణలు గమనార్హం. ఇంతవరకు తలెత్తుకు తిరిగిన బిజెపి నేతలకు ఇప్పుడు ఈ పరిస్థితి మింగుడు పడడం లేదు. అమితవేగంగా జయ్ షా రక్షణకు కేంద్ర సర్కార్ దిగడంపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అదనపు సొలిసిటర్ జనరల్‌ను జయ్ షా డిఫెన్స్ లాయర్‌గా రంగంలోకి దించడాన్ని అనేకమంది తప్పుపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఇక 18 నెలల వ్యవధి మాత్రమే ఉన్న తరుణంలో ‘అభివృద్ధి’ అంశాన్ని తప్పించి పూర్తి స్థాయిలో హిందూత్వ నినాదాన్ని ప్రచారంలో పెట్టాలని బిజెపి నిర్ణయించడం కూడా జయ్ షా పై ఆరోపణలతో వచ్చిన కథనాల పర్యవసానమే అని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఆదిత్యనాథ్ ఎన్నికల నూతన ముఖచిత్రంగా దూసుకు వచ్చారు. గుజరాత్‌లో ఆయన మోడీతోపాటు ప్రచార సారథిగా ఉంటారు. వారిద్దరూ కలిసి నిరంతర ప్రచార బాధ్యతను నిర్వహిస్తారని ప్రస్తుతానికి అర్థమవుతోంది.

‘లవ్ జీహాద్’, రోహింగ్యాలతో భారత్‌కు ఉగ్రవాద ప్రమాదం వంటి తన ఇష్టమైన అంశాలతోనే ఆదిత్యనాథ్ ప్రచారం ఉండవచ్చు. ఆదిత్య 6 నెలల ఉత్తరప్రదేశ్ పాలనలో విచిత్రమైన అంశాలు తెరమీదకు వచ్చాయి. రోమియో నిరోధక స్కాడ్లు, కైలాష్ సబ్సిడీ, వందేమాతరం తప్పనిసరిగా పాడేలా మదర్సాలపై విడియో నిఘావంటి వింతవింత కార్యక్రమాలు ఆయన ప్రవేశపెట్టారు. ‘మీకు అర్థం కానిది ఏమిటంటే ఆదిత్యనాథ్‌ను పాలనా యంత్రాంగం ఆపజాలదు. ఆయనకు సొంత ఎజెండా ఉంది. తన విధేయులకు ప్రీతిపాత్రుడు. సంఘ్‌కు పరిపాలన అక్కరలేదు. దాని ఒకే ఒక్క లక్షం హిందూ సమాజాన్ని ఐక్యం చేయడమే. ఇంతకు ముందు యోగీ సొంత సేన హిందూ యువ వాహినితో సంఘ్ పరివార్‌కు ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఆదిత్యనాథ్‌ను సంఘ్ మనస్ఫూర్తిగా కౌగిలించుకుంటోంది’ అని ఒక సీనియర్ బిజెపి నాయకుడు చేసిన వ్యాఖ్య గమనార్హం. 2014లో ముజఫర్ నగర్ అల్లర్ల అనంతరం బిజెపి అనూహ్యంగా 73 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుంది. అప్పట్లో ఆదిత్య నాథ్ మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టి బిజెపికి లాభం చేకూర్చారు. అటువంటిదే ఇప్పుడు కూడా బిజెపి ఆయన నుంచి ఆశిస్తోంది. ఎన్నికలు జరగనున్న అన్ని రాష్ట్రాలకు తక్షణం ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలను పంపాలని అమిత్ షా ఆర్‌ఎస్‌ఎస్‌కు అత్యవసర సందేశం పంపించారు. నవంబర్ 17న రామ్ లీలా మైదానంలో భారతీయ మజ్దూర్ సంఘ్ భారీ ఎత్తు ర్యాలీని జరపనుంది. ఆ తర్వాత ఢిల్లీలో నవంబర్ 25న రైతుల ప్రదర్శన జరుగుతుంది. ఈ నెల 29న నిరసన ప్రదర్శనకు ఎస్‌జెఎం సన్నద్ధమవుతోంది. ఈ పరిణామాలన్నీ మోడీని సంక్షోభంలోకి నెట్టుతున్నాయని చెప్పక తప్పుదు. ఆయన గుప్పించిన హామీలు, వాగ్దాన మిచ్చిన ‘అచ్ఛేదిన్’ ఆనవాళ్లు కనపడని స్థితిలో మోడీకి ఇది గడ్డుకాలమే. ఆ ఖాళీని ఆదిత్యనాథ్‌తో పూరించడం సరి అయినదేనా అన్నది త్వరలోనే తేలిపోతుంది.

* స్వాతి చతుర్వేది