Home జాతీయ వార్తలు కారు ఆపలేదని కాల్చి చంపిన పోలీసులు!

కారు ఆపలేదని కాల్చి చంపిన పోలీసులు!

UP police shoots down civilian in Lucknow for not stopping car

యుపిలో దారుణం
సంఘటనపై అవసరమైతే సిబిఐ దరాప్తు: ఆదిత్యనాథ్

లక్నో: కారు ఆపమన్నా ఆపలేదని ఓ పోలీసు కానిస్టేబుల్ యాపిల్ కంపెనీ ఉన్నతాధికారిని కాల్చి చంపిన సంఘటన శుక్రవారం అర్ధరాత్రి ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో చోటు చేసుకొంది. ఐఫోన్ కంపెనీలో ఏరియా మేనేజర్‌గా పని చేస్తున్న వివేక్ తివారి ఆఫీసు తర్వాత రాత్రి ఒకటిన్నర గంటల సమయంలో కారులో ఇంటికి వెళ్తున్న సమయంలో గోమతీనగర్ ఎక్స్‌టెన్షన్ వద్ద ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు ఆయన కారును ఆపడానికి యత్నించారు. అయితే వివేక్ వారిని పట్టించుకోకుండా.. కారు ఆపకుండా అలాగే వెళ్లిపోయాడు. దీంతో ఆ ఇద్దరిలో ఒక కానిస్టేబుల్ తన గన్ తీసి వివేక్ పైకి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఆయన మరణించాడు. కారులో వివేక్‌తో పాటు ఉన్న ఆయన మాజీ సహోద్యోగి సనాఖాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్టు చేశారు. ఈ సంఘటనపై అవసరమైతే సిబిఐ దర్యాప్తుకు ఆదేశిస్తామని యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. కాగా ఈ సంఘటన తర్వాత రాష్ట్ర డిజిపి ఒపి సింగ్ ఇది క్రిమినల్ చర్య అని అంటూ, ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను సర్వీస్‌నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్లు తివారీని కారు ఆపమని ఆడిగారని, అయితే అతను తన కారుతో వారి మోటారు సైకిల్‌ను ఢీకొట్టి గాయపరిచాడని సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ కళానిధి నైథాని చెప్పారు. కానిస్టేబుల్ ప్రశాంత్ చౌదరికి అనుమానం వచ్చి కాల్పులు జరిపాడని, ఒక తూటా కారు విండ్ స్క్రీన్‌ను చీల్చుకొని తివారీని తాకిందని పోలీసులు తెలిపారు. తివారీ పోలీసులను దాటుకొని వెళ్లే క్రమంలో కారు ఒక పిల్లర్‌ను ఢీకొట్టిందని కూడా వారు చెప్పారు. అయితే తివారీ తనపైనుంచి కారు నడిపేందుకు ప్రయత్నించడంతో ఆత్మరక్షణకోసమే తాను కాల్పులు జరిపినట్లు ప్రశాంత్ చౌదరి చెప్తున్నాడు. ఈ కాల్పుల ఘటనపై దర్యాప్తు జరిపేందుకు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేశారు. న్యాయవిచారణకుసైతం ఆదేశించినట్లు అధికారులు చెప్పారు. అయితే ఇది ఎన్‌కౌంటర్ కాదని, తప్పు చేసిన వారిని వదిలి పెట్టేది లేదని, అవసరమయితే సిబిఐ దర్యాప్తు జరిపిస్తామని గోరఖ్‌పూర్‌లో విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. కాగా ఫిర్యాదు చేసిన సనాఖాన్‌కు అదనపు భద్రతను కల్పించారు. మృతి చెందిన తివారీకి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.