Home తాజా వార్తలు పేదల పెన్నిధి కెసిఆర్

పేదల పెన్నిధి కెసిఆర్

Uppala Srinivas Gupta joining in TRS Party

కులమతాలకతీతంగా అందరికీ న్యాయమే ఆయన ధ్యేయం, కృషి

పాక్ క్రికెట్ టీమ్‌ను తలపిస్తున్న కాంగ్రెస్
అమలుకాని హామీలిస్తున్నది
వారు అభివృద్ధిని అడ్డుకుంటున్నందుకేప్రజా కోర్టుకు
శ్రీనివాస్‌గుప్తా టిఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా కెటిఆర్

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌లా ఉందని ఆపద్ధర్మ మంత్రి కెటిఆర్ అభివర్ణించారు. ఆర్యవైశ్య ఫెడరేషన్ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస గుప్తా కెటిఆర్ సమక్షంలో బుధవారం టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కెటిఆర్ మాట్లాడుతూ పేదరికానికి కులం, మతం ఉండదని, రాష్ట్రంలో పేదలందరికీ న్యాయం చేయడమే కెసిఆర్ అభిమతమని, అందుకనుగుణంగానే ఆయన కృషి చేస్తున్నారన్నారు. రూ.200ల పింఛన్ ఇచ్చిన కాంగ్రెస్ నేతలు ప్రస్తుత ఎన్నికల సమయంలో అమలు కాని హామీలను గుప్పిస్తున్నారన్నారు. రెండు వేల రూపాయల పింఛన్‌ను ఇస్తామంటూ ఆ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలనుకోవడం కెసిఆర్ ఇప్పుడు అమలుచేస్తున్న వేయి రూపాయల పింఛనువల్లేనని పేర్కొన్నారు.

కెసిఆర్ అమలు చేసిన పథకాలను చూసి వారికి భయం పట్టుకుందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తామని, ఇది ఎన్నికల కోసం కాక భవిష్యత్ తరాల కోసమని అన్నారు. కెసిఆర్ మట్టి బిడ్డ, రైతు బిడ్డ కాబట్టే రైతు బంధు పథకాన్ని తీసుకువచ్చారన్నారు. స్థానిక కోర్టుల మొదలు సుప్రీంకోర్టులో కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టులపై కేసులు వేశారన్నారు. అభివృద్ధిని అడ్డుకున్నందుకే ప్రజాకోర్టులో తేల్చుకునేందుకు ముందుకు వెళుతున్నామన్నారు. ఎన్నికలకు ఒకవైపు సై అంటూనే మరోవైపు కోర్టుల్లో కేసు లు కాంగ్రెస్ వారు వేస్తున్నారన్నారు. ఇంటి కిరాయి కడతామని బిజేపి నాయకుడు మాట్లాడుతున్నాడని, గతంలో నోట్ల రద్దు సమయంలో ప్రధాని మోదీ ప్రతి ఒక్కరి అకౌంట్‌లో వేస్తామని ప్రకటించిన రూ.15 లక్షలను అకౌంట్‌లో వేస్తే ప్రజలే ఇంటి కిరాయి కడతారన్నారు. కాంగ్రెస్‌లో అందరూ సిఎం అభ్యర్థులే అన్నారు. ఉత్తమ్‌కుమార్ హామీలన్నీ అన్నీ ఉత్తవే అని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టులను అడ్డుకోవడానికి చంద్రబాబు 30 లేఖలు కేంద్రానికి రాశారన్నారు. ఢిల్లీ పాదదాసులు, చంద్రబాబుతో తెలంగాణకు న్యాయం జరగలేదన్నారు.

టిఆర్‌ఎస్ హయాంలో వైశ్యులకు తగిన గుర్తింపు : శ్రీనివాస గుప్త
టిఆర్‌ఎస్‌లో చేరిన ఆర్య వైశ్య సమాఖ్య అధ్యక్షుడు శ్రీనివాస గుప్తా మాట్లాడుతూ నాలుగు రోజుల ముందే కెటిఆర్ అపాయింట్‌మెంట్ ఇచ్చారన్నా రు. టిఆర్‌ఎస్‌లో వైశ్యులకు తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. ఇప్పటికే ఆర్యవైశ్యులను గుర్తించి కెసిఆర్ వారికి పదవులు కూడా కట్టబెట్టారని రాను న్న రోజుల్లో మరిన్ని పదవులు తమకు ఇచ్చేలా కెటిఆర్ చొరవ తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మాజీ ఎమ్మెల్యే గణేశ్ బిగాలా, హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ సంపత్‌కుమార్, బేవరేజేస్ కార్పొరేషన్ చైర్మన్ దేవిప్రసాద్, ఎంపి మల్లారెడ్డి పాల్గొన్నారు.