Home అర్బన్ మ్యూజింగ్స్ కోకిల రాగాల వేసవికేళి…!!

కోకిల రాగాల వేసవికేళి…!!

Urban Musings Kuppili Padma
కుప్పిలి పద్మ

వేసవి మామాలుగా రావటంలేదీ మధ్య. వసంతపు లేతచిగురుని గుర్తు పట్టేలోగానే అవనంతా జలపా తపు తుంపర్లా రాలే పువ్వులు. వెదురు పొదల మీదుగా వసంతపు చల్లని వెలుతుర్ని పరాగంతో చిలికీచిలక్కుండానే ప్రచండగాలులతో ఝుంఝుంమంటూ వచ్చేస్తోంది వేసవి. వుదయుడు వస్తునే జలరాసులన్నింటిని వొక్క గుక్కతో లాగేసుకొంటున్నాడు.

పొదల మీద నుంచి యెగిరి పోయి నీటి చెలమల చెంత పచ్చికలో వాలి నీళ్ళని వెతుక్కుంటు న్నాయి కొంగలు.
యీ మధ్యే యీ వసంతానికి యీ బంగ్లా తోటకి వచ్చిన కోకిల ‘అబ్బా యేమి యెండా’ అనుకుంటూ గమ్మున గున్నమామి గుబురుల్లో దాక్కొంది.

గొంతు తడుపుకోడానికి చల్లని నీరే దొరక్కా ‘’రసాలు అయ్యే వరకు వొక్క కాయేనా కొమ్మకి వుంచక పోతారా” అడిగింది ఆ తోటలోనే స్థిర నివాసముండే రామచిలుకని ఆశతో కోకిల.

“నిన్న కాక మొన్న వచ్చేవు, నీకింకా యిక్కడ విషయాలు తెలిసిన్నట్టు లేవు. కాయలు పక్వానికి రాక ముందే దింపేసి మందులతో మగ్గ
పెట్టేస్తున్నారు. పైనంతా పండిన్నట్టు పసుపు పచ్చగా వుంటుంది. లోపలంతా తింటుంటే పుల్లన. తినగానే నోరునోరంతా పులుపుతో పొక్కి పోతుందనుకో మనుష్యులకి. తీయని మామిడి కాయలు సహజంగా పండే వరకు వోపిక పట్టలేని యీ జనాన్ని చూస్తుంటే జాలేస్తుంది. అలాంటి రోజుల్లో నువ్వూ నేను మామిడిపళ్ళ కోసం యెండిన గొంతు యెండి పోయేదాకా పాడకు… నీలో నువ్వే కూనిరాగాలు తీసుకో’ అనుభవంతో సలహా యిస్తు చెపుతున్న రామచిలుకని మాటలని తెల్లబోయి వింటోంది కోకిలమ్మ.

తేనె పిట్ట నవ్వుతూ “మొత్తానికి నీ స్వరాన్ని నా కువకువలకి దగ్గరగా తీసుకొచ్చేసారు యీ మనుష్యులు” అంది కోకిలతో.

“అసలు యిదంతా యేమిటి. యిలా యెందుకంతా మారిపోతోంది” అడిగింది కోకిల.
“రేపక్కడెక్కడో యీ విషయాలపై సభ వుందంటా వెళదామా” అడిగింది రామచిలుకా.

Urban Musings

కళ్ళ ముందే మాయమైపోయాయి. మీ అందరి పరిస్థతి యింత దారుణంగా వుందేంటి… యేదైనా సిటీకి దూరంగా కొత్తవనాన్ని వెతుక్కోపోయారా” అంది కోకిల.

‘’వనాల్లో యేముంది… కొట్టుటా… తవ్వుటా అంటా… విపరీతమైన మోటారు బళ్ళు యెటు చూసినానంటా… ఆ మధ్య వొక యెలుకబంటి వచ్చిందిలే అక్కడ నీళ్ళు దొరక్క. తను చెప్పింది” అంది చిలుక.

‘యెటు చూసినా బాధలే… యీ భూమండలాన్ని యిలా చేసుకున్నారేంటి” అని వాపోయింది కోకిల.

“అందుకే మానవులు నివసించటానికి కావలసిని మరో గ్రహాలు యేమైనా వున్నాయేమోనని అన్వేషిస్తున్నారంటా” అంది పావురం.
‘’నీకెలా తెలుసు” ఆ భాషకి ఆశ్చర్యపడుతూ అడిగింది కోకిల.

‘’తన పార్టనర్ ఆ అపార్ట్ మెంట్ చుట్టూనేగా తిరుగుతుంటుంది ఆ వేడిగాలులు పీలుస్తూ… తనిచ్చిన జ్ఞానం” నవ్వుతూ అంది తేనె పిట్ట.
వారివారి ఆహారాన్వేషణలో వారంతా అటూయిటూ వెళ్ళారు.

Urban Musings

‘’యేడాది యేడాదికి భలే మారిపోతుందంతా… నా జీవితపు అస్తిత్వమే పాట కదా పాడకపోతే యెలా” బెంగగా అనుకొంది కోకిల.

ఆ మధ్యాహ్నం వేళ.

వూరికే నోరు కట్టుకొని కూర్చోలేక కొమ్మల్లోంచి కాస్త తల బయటకి పెట్టి చుట్టూ వున్న యిళ్ళ వైపు తొంగి చూద్దామని నీడపట్టునే ఆ కొమ్మలపైన కూర్చుంది కోకిల. చూట్టానికే యిబ్బంది కలిగించేంత యెర్రని యెండ. తిరిగి కొమ్మల గుబురుల్లోకి చటుక్కున దూరబోతుంటే గోలగోలగా కేకలు వినపడ్డాయి కలగాపులగంగా. వులిక్కిపడి బయటకి చూసింది.

నిర్మానుష్యమైన రోడ్. ఆ పక్క రోడ్ లో వెళుతున్న వాహనాల చప్పుడు. అపార్ట్మెంట్స్ లోకి అప్పుడప్పుడు వచ్చి వెళుతున్న కార్ల టైర్ల రాపిడి శభ్ధం. చుట్టూ వున్న చెట్లు కూడా సొమ్మసిల్లినట్టు యే కదలికా లేకుండా వున్నాయి. పావురాల వూసే లేదు. రామచిలుక జాడే లేదు. తేనే పిట్ట కిలకిలలు మచ్చుకి కూడా లేవు. అంతా వేడి నిశ్శబ్దాన్ని నేమరేస్తున్నాయి… కనపడ్డంతలో అందరి యిళ్ళ తలుపులూ మూసే వున్నాయి. మనుష్యుల అలికిడే లేదు. యింకెవరు అరిచారో వో క్షణం అర్థం కాలేదు. అంతలోనే స్ఫురించి సందు చివరికి చూపుని సారించింది కోకిల. కోకిలకొచ్చిన ఆలోచన వమ్ము కాలేదు.

చిన్నచిన్న పిల్లలు. రంగురంగు టీ షరట్స్ ల్లో. కొంతమంది తలలకి టోపీ. సరిగ్గా కోకిల వున్నఆ బంగ్లా తోటకి ముందున్న ఖాళీ రోడ్డుకి అవతలి వైపు రెండు బొమ్మరిల్లుల్లాంటి అందమైన బంగ్లాలు. ఆ ఖాళీ స్థలం పక్కన యెటు చూసినా అపార్ట్మెంట్స్. ఆ బంగ్లా కి ఆ అపార్ట్మెంట్స్ కి వెనుకా వున్న బస్తీలో పిల్లలు వాళ్ళు. చేతితో బ్యాట్ తిప్పుతూ చేతి తిప్పుతూ నవ్వుతూ తుళ్ళుతూ కేరింతలు కొడుతూ ఆడుకోడానికి వస్తున్నారు.

వేసవికి ఆటలకి యెంతో అవినాభావ సంబంధం వుంది. వేసవి సెలవలని తీసుకొస్తుంది. ఆ సెలవల్లో అంతా ఆటవిడుపే. హోం వర్క్ చెయ్యాలనే తొందర వుండదు. రేప్పొద్దున్నే పరీక్ష రాయాలనే గాబరా వుండదు. ప్రతి యేడాది అక్కడ ఆడుకొనే వాళ్ళని చూడటం కోకిలకి అలవాటే. కానీ యీ యేడాది విపరీతమైన వేడి. అయినా వీళ్ళు రావటం చూసి కోకిల ఆశ్చర్యపోయింది.

‘బాలకృష్ణుణ్ణి వసుదేవుడు రేపల్లెకు తీసుకు వెళ్ళేటప్పుడు యమునానది దారి యిచ్చేసినట్టు పిల్లలు ఆడుకోడానికి రాగానే యెండ మేఘం తప్పుకొని నీడ మేఘానికి దారి యిచ్చేస్తుందా’ అనుకొంది కోకిల.

కానీ అలాంటిదేం జరగలేదు. కారాగారంలో దేవకీ వసుదేవులకి కృష్ణుడు.శంకచక్రధారియై ప్రత్యక్షమైనట్టు పిల్లలకి నీడమబ్బు ప్రత్యక్షం కాలేదు.
భానుడి ప్రతాపంతోనూ నిమిత్తం లేకుండా కింద కోలాహలంగా పిల్లలంతా క్రికెట్ ఆడుతూ కనపడ్డారు. యింతటి వేసవిగాలుల మధ్యాహ్నాల్లో అమ్మలు యెండకు మాడిపోతారనీ వడదెబ్బ కొడుతుందని యెవరెన్ని చెప్పినా యెంత గోలపెట్టినా వినకుండా అందరూ ఆడుకోడానికి బయలుదేరినట్టున్నారు. అచ్చు టివీ లో క్రికెట్ చూపిస్తున్నట్టే ఆట మొదలైంది. ఆడే వాళ్ళ చుట్టూ బండరాళ్ల పై చెట్ల చప్టా పై కూర్చుని కొందరు ఆట చూస్తున్నారు.

కళ్ళు తిరిగే షాట్ యెవరైనా కొడితే తేనెటీగల నాదంలా యీలలు చుట్టు ముడుతున్నాయి.

‘మిట్టమధ్యాహ్నం వేళఆటలూ మీరూనూ, శుభ్రంగా పడుకోనీయకుండా… ‘ అని అపార్ట్మెంట్స్ లో యింట్లోనే వుండే ఆడవాళ్ళు
పెద్దవాళ్ళు కొందరు అరుస్తున్నారు బాల్కనీలో కి వచ్చి.

‘’బయట ఆడుకొనే పిల్లలే తక్కువైపోయారు. అంతా కంప్యూటర్ గేమ్స్ లేదా స్మార్ట్ ఫోన్ అప్స్ లో తలలు దించుకునే వాళ్ళే పోనిద్దూ‘ అని ముచ్చటడే వాళ్ళని చేతి వేళ్ళ మీద పెట్టొచ్చు.

నిద్ర చెడగొట్టినందుకు కోపంతో ఫ్లాట్ లో వాళ్ళు యింటర్ కంలో సెక్యూరిటీ వాళ్లకి చెప్పటం. యేమిటా గోలా… యిక్కడ ఆడొద్దనో లేదా అరవకుండా ఆడుకోండనో వాచ్ మెన్ చెపుతుండగానే ‘అలాగే అంకుల్’ అని ముక్త కంఠంతో చెపుతూ తిరిగి అదే స్థాయిలో ఆడుతున్నారు.

బాల్కనీలో బంతి పడింది. ఆ బంతి యివ్వడానికి ఆ యింటి వాళ్ళు యెవ్వరూ లేరక్కడ. ఆ బంతి విషయం తరువాత చూసుకోవచ్చని, కూర్చుని ఆట చూస్తున్న వాళ్ళ దగ్గరా రెడీగా వున్న కొత్త బంతి తెచ్చుకుని ఆట సాగిస్తున్నారు.

ఆటని చూస్తున్న కోకిల సిక్స్ కొట్టగానే ఆగకుండా పాడుతోంది. ఫోర్ కొట్టగానే నాలుగు సార్లు కూసింది. ఆటని చూస్తూ చూస్తూ తను కూడా ఆడుతున్నట్టు వూహించుటోంది కోకిల. వూహే, కానీ వుత్సాహవంతమైంది. యెంత వుత్సాహ్మంటే ఆటని అలా చూస్తూ యెండని దాహాన్ని మరచిపోయింది కోకిల. యీ ఆట లేకపోతే యీ వేసవి యెంత వేడిగా వుండేదో కదా …వూహించుకోడానికే భయపడింది కోకిల.

అందరూ క్రికెట్ ఆడుకుంటున్నారు. మళ్ళీ అనిపించింది యెన్ని కంప్యూటర్ గేమ్స్ వచ్చినా యీ వొక్క ఆటని యెండలో ఆడకపోతే పిల్లలకి బాల్యమే లేనట్టేమో. కిక్కిరిసిన నగరంలో చీమల్లా కదులుతున్నా ట్రాఫిక్ నిండిన యీ ఆధునిక నగర సముదాయాల నడుమ పిల్లలు అందరికి యిష్టమైన నిఖ్సాన ఆటని వాళ్ళు వొళ్ళు యెరగకా ఆడేస్తున్నారు.

వీళ్ళూ అంతే, దుందుడుకుగా చేతికి దొరికిన బంతిని బాదేస్తున్నారు. చూస్తూండగానే వొకడు బంతిని వేసిన వేగానికి ఆ బంతిని నిట్టనిలువుగా పైకి కొట్టేడో బుడతడు అత్యుత్సాహంతో. అపార్ట్ మెంట్ లోని వొక ఫ్లాట్ కిటికీ అద్దాలకి తగిలింది. అద్దం భళ్ళుమని పగిలింది. అంతే ఆ యింటి ఆవిడా బాల్కానీ లోకి వచ్చి అరవటం మొదలు పెట్టింది హిందీలో.

‘సారీ ఆంటీ’ అని పిల్లలంతా మిస్టర్ యిండియా సినిమాలో సన్నివేశాన్ని తలదన్నేలా రాగం తీయసాగారు. ఆమె లోపలకి వెళ్ళి సెక్యూరిటీకి కాల్ చేసి వాళ్ళని అక్కడ ఆడనివ్వొద్దని అరిచింది.

యింతలో మరో షాట్ ధోనిలా ఫోజ్ పెట్టి కొట్టాడో చిన్నోడు.

గ్రిల్ వూచల మధ్యలో పడి యిరుక్కు పోయింది. ఆ శబ్ధానికి ఆ యింటామె బయటకి వచ్చింది.

‘బాల్ ఆంటీ అని పిల్లల అరుపులు.

‘’గ్రిల్లో యిరుక్కు పోయింది” అందామె.

ఆమె కావాలనే యివ్వటం లేదనుకొని పిల్లలు కాసేపు బ్రతిమాలారు. కాసేపు అరిచారు. యింతలో వాచ్ మెన్ వచ్చి పడుకునే వేళ యీ గొడవ యెంటని అన్నాడు.

‘యిది రోడ్… అని వో కుర్రాడు…

కాసేపు ఆ వాచ్ మెన్ నచ్చ చెప్పడానికి ప్రయ త్నించారు.

‘యెక్కువ అరవంలే’ అని మరో కుర్రాడు అరిచాడు.

అంత గట్టిగా యెందుకు కొట్టావనో, అలా కొడితే తలుపులకి తగల్దా అని రకరకాల గొడవలు.
చివరికి అంతా గొడవగా మారిపోయింది.

యేమిటో యిన్ని గొడవలు. ఆట కంటే గొడవలే యెక్కువ అయినా వాళ్ళు ఆట ముగించి వెళ్ళటం లేదు. వాళ్ళు ఆటని ఆస్వాదిస్తున్నారా లేక గొడవనా నాకర్థం కాలేదు కోకిలకి. కానీ వాళ్ళని చూస్తూ అక్కడే కొమ్మ చాటు నుంచి చూస్తోంది.

మరో ఐదు నిముషాలకి ఆ గొడవ చల్లబడ్డాక తిరిగి ఆడటం మొదలు పెట్టారు.

బంతి కోసం వెదకడం మొదలెట్టారు. వొకరినొకరు బెదిరించుకొంటున్నారు. హాస్యాలు ఆడుతున్నారు.

లోడలోడా మాటలనుకుంటున్నారు. సముదాయిన్చుకొంటున్నారు.

యింతలో బంతిని గాల్లోకి యెగరేసి నవ్వాడొకడు. గొడవ పడుతునే తన చేతుల్లోకి అందుకుటూ ‘రండర్రా’ పరుగు తీశాడు మరో కుర్రాడు. యెవరు యెంత అరచినా వాళ్ళు ఆటని ఆపేట్టు లేరు. అరుపులూ ఆగేట్టు లేవు. అరచిఅరచి వాచ్ మెన్ యెన్ని వేసవులు గడిచిపోయాయో యిప్పుడు గుర్తోస్తే ఆశ్చర్యమనిపిస్తుంది వెళ్ళి పోయారు. పిల్లల కోలాహలం వినిపిస్తూనే వుంది. పూర్తిగా బయటకి వచ్చేసింది కోయిల.

‘’అయ్యో, యిలా రాకు బయటకి యెండ” హెచ్చరిస్తుంది పావురం.

‘’అలా పాడకు అదే పనిగా దాహం” వారిస్తోంది రామచిలుక.

కూ కూ పాడుతోంది కోకిల ఆపకుండా… కొంటె పిల్లలు తిరిగి కూకూ అని కోయిలని అనుకరిస్తున్నారు.

తన పాట పిల్లల గొంతు లోంచి యెప్పుడు విన్నా దానిమ్మ పండు వలుస్తున్నప్పుడు తీయని రసం పైకి రివ్వున చిమ్మిన సంతోషం కోకిలలో. ప్రతి యేడాది కొత్తగా యిలా ఆనందం మొలకలు వేస్తుంటే వడగాలులొక లెక్కా… పిల్లల కోలాహం చల్లగా వీస్తుంటే యెండదాహం తీరిపోదా…

మండువేసవిలో తోటలు, చెట్లు, యిళ్ళు, ట్రాఫిక్ సిగ్నల్స్ ని దాటి ఫ్లై వోవర్స్ మీదుగా కోకిల పాట చిమ్ముతోంది ఫౌంటెన్ ల్లా నగరమంతా.