Home జాతీయ వార్తలు ఉరేనియం కుంపటి

ఉరేనియం కుంపటి

అటవీ ప్రాంతంలో తవ్వకాలకు ఎన్‌ఒసి జారీ?, చెంచు పెంటలు ఛిద్రం, ఆనాడు వద్దన్నదే.. ఇప్పుడు ముద్దు అయింది

విరివెంటి ప్రహ్లాద్/ మన తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
forestపుట్టుక నుంచి చావు వరకు అడవితో మమేకమైన గిరిపుత్రులను ఉన్న ఫళంగా నాగరికులుగా తీర్చిదిద్దాలనే ఉక్కు సంకల్పంతో ఉన్న ప్రభు త్వం అటవీ హక్కుల హద్దులకు కంచెలు పెడుతోంది. దీనితో ఆదివాసీ లకు అడవిపై ఉన్న హక్కులను పరిరక్షణకై పార్లమెంట్‌లో రూపొందిం చిన రక్షణ చట్టం పలుచ బడుతోంది. ప్రభుత్వాల నిర్లక్షానికి వివిధ కారణాలు తోడై కనుమరుగైపోతున్న ఆదివాసీ తెగలను సంరక్షించే బాధ్యతలను స్వీకరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తయారు చేసిన చట్టాల అమలు ప్రశ్నార్థకంగా మారుతోంది. అంతరించిపోతున్న జంతువులు,అడవి బిడ్డలను గుర్తిస్తూనే అభయారణ్యాలలో జంతువులకు తప్ప ఆదివాసి తెగలకు చోటులేదని పాల కులు నిర్మోహమాటంగా చెప్తున్నారు. ఆదివాసీలను నాగరిక సమా జంలో భాగస్వాములను చేసి ఆధునిక జీవన విధానాన్ని నేర్పించేందుకు తహతహ లాడుతున్నారు. 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం నల్లమల్ల ఆడవుల్లో యురే నియం తవ్వకాలను అనుమతించిన తీరును తీవ్రంగా వ్యతిరేకించిన తెలం గాణ ఉద్యమ నేతలు అధికార పీఠం ఎక్కగానే అదేపనికి నిర్మొహమాటంగా నిరభ్యంతర పత్రం జారీచేయడానికి పావులు కదుపుతున్నారు. నల్లమల్ల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని అమ్రాబాద్, ఉడిమిల్ల, నల్గొండ జిల్లాలోని నారాయణపూర్ పరిధిలో 83 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో యురేనియం తవ్వకాలకు అనుమతించాలన్న అణు విద్యుత్ దక్షిణాది సంచాలకుల కార్యా లయం నుంచి అందిన లేఖపై గత ఏడాది 6వ తేదీన వన్యప్రాణి సంరక్షణ బోర్డు మొదటి సమావేశం ఏర్పాటు చేశారు. దీనితో పాటు వన్యప్రాణి, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, జాతీయ జంతుప్రదర్శన శాలలు విస్తరించిన ప్రాంతాల్లో విస్తరణ,అభివృద్ది పనులకు సంబంధించి వివిధ శాఖల నుంచి అందిన ప్రతిపాదనలను ఎజెండాలో చేర్చారు. రాష్ట్ర అటవీశాఖ మంత్రి అధ్యక్షతన జరిగిన మొట్ట మొదటి వన్యప్రాణి సమావేశంలో ఎజెండాలోని ఐదు అం శాలను ప్రస్తావించి, అందులో లేని అంశం యురేనియం తవ్వకాలకు ఎన్‌ఓ సి జారీ చేసినట్లు వెల్లడైంది. కుంటి సాకులతో నల్లమల్ల అడవుల నుంచి చెంచులను తరిమేసేందుకు సమైక్య రాష్ట్రంలో గత ప్రభుత్వాలు ప్రయత్నాలు చేసినా అభయారణ్యంలో తవ్వకాలకు అధికారిక అనుమతులిచ్చిన దాఖలా లు లేవు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదివాసీల ఉద్యమానికి ఆనాడు మద్దతుగా నిలిచారు. డిబీర్ మల్టినేషనల్ సంస్థ నల్లమల్ల అడవిలో కాలుమోపడానికి వీల్లేదని ఖరాఖండిగా తేల్చిచెప్పారు. ఇదిలా ఉంటే అటవీ హక్కుల అమలు తీరుతెన్నులను సమీక్షించేందుకు ఏర్పాటైన రాష్ట్రస్థాయి సలహా మండలి కేవలం ఒకే ఒక్కసారి సమావేశమైంది. పలు సాగునీటి ప్రాజెక్టులు,థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు, రైల్వే లైన్, మిషన్ భగీరథ, ఇతర పథకాలకు అటవీ భూములను సేకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ భూమికి బదులుగా ఇతర భూములను కేటాయిస్తోంది. భూములకే పరిమితమైన చేబదులు కార్యక్రమం బ్రహ్మాండంగా సాగుతోంది. తరతరాలుగా అడవిని నమ్ముకుని జీవిస్తూ అందులో భాగమైన ఆదివాసీలను విస్మరిస్తున్నారు. ఐటిడిఏ,మాడా ఇతర పథకాలు ఎన్నో పథకాల కింద వేలకోట్లు ఖర్చుచేసినా ఆదివాసీల గోచీల మైల మాత్రం పోలేదు. రెంటికి చెడ్డరేవడిలా ఎటుకాకు ండా పోతామనే ఆందోళన చెందుతున్న తెగలు అడవి నుంచి తమను దూరం చేయొద్దని వేడుకుంటున్నారు. తమ ఉనికి ప్రమాదంలో పడినపుడు రోడ్డెక్కుతాంటున్నారు.
2006లో భారత పార్లమెంట్ ఆమోదం పొందిన అటవీహక్కుల చట్టం అమలుకై అడపాదడపా ఆదివాసీ తెగలు ఉద్యమిస్తున్నా వారికి మద్దతుగా నిలిచే వారు కరువయ్యారు. 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టానికి ఉన్న పదనులో పదిశాతం 2006 వచ్చిన అటవి హక్కుల చట్టం, 2012లో వచ్చిన సవరణ చట్టం అమలులో నీరసించడంతో అడవి బిడ్డలకు నీడ కల్పించ లేకపోతోంది. అంతరించిపోతున్న జాతుల జాబితాలోకి చేరిన వర్గాలను సంరక్షించాల్సిన ప్రభుత్వాలు గాలికి వదిలేశాయి. తెలంగాణ రాష్ట్రంలోని కృష్ణానది పరివాహక ప్రాంతమైన నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నల్లమల్లకు సరిహద్దు ప్రాంతాలుగా తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఐదు జిల్లాల సరిహద్దులకు విస్తరించింది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని మన్ననూర్, అమ్రాబాద్, పదర, వంకేశ్వరం, వటవర్లపల్లి, మల్లెలతీర్థం, ఫర్హాబాద్ పరిసర ప్రాంతాల్లోని పదుల సంఖ్యలో ఉన్న చెంచుపెంటను ఖాళీ చేయించేందుకు అటవీశాఖ చేసిన విశ్వప్రయ త్నాలు చేసినా అడవిని వదిలి వెళ్లేందుకు ఆదివాసీలు నిరాకరించడంతో చర్య లు విఫలమయ్యాయి.సాగుభూమి, పక్కాఇళ్లు, రుణాలు ఉపాధి వగైరాలు కల్పిస్తామని అటవీశాఖ అధికారులు నచ్చజెప్పినా చెంచులు అందుకు సమ్మతించలేదు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంల్లో యూరేనియం నిక్షేపాలను గుర్తించిన కేంద్రం 2008లో డీబిర్ మల్టినేషనల్ సంస్థకు నిక్షే పాలను వెలికి తీసేందుకు అనుమతించింది. కేంద్రం సై అన్నా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వకుండా,అభ్యంతరం తెలుపకుండానే అధికారికంగా ఎటువంటి ఉత్తర్వులు ఇచ్చే సాహసం చేయలేకపోయింది. ఐనా సదరు సంస్థ మల్లెలతీర్థం, ఫర్హాబాద్,వటవర్లపల్లి పరిసర గ్రామాల్లో నిక్షేపాలను వెలికి తీసేందుకు చేపట్టిన డ్రిల్లింగ్ పనులకు స్థానికుల నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురుకావడంతో పోలీసు బలగాల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇన్ని అవరోధాల మధ్య పనులు చేయలేమంటూ సదరు సంస్థ ఉట్టిచేతులతో వెనుదిరిగింది. తాయిళాలు,నజరానాలతో ఎరవేసి చివరికి భయపెట్టైనా వందల సంఖ్యలో ఉన్న చెంచుపెంటలు,గిరిజన గూడెలను ఖాళీ చేయించే ందుకు సదరు సంస్థ అన్ని విధాలుగా ప్రయత్నించినా స్థానికుల తిరుగుబా టుతో ముందడుగు వేయలేకపోయింది. నల్లమల్ల అడవులకు సరిహద్దు మండలాలైన అమ్రాబాడ్,అచ్చంపేట,బల్మూర్,లింగాల,కొల్లాపూర్‌లో అడవి మధ్య వరకు విస్తరించిన చెంచుపెంటల్లో సలేశ్వరం, మల్లెలతీర్థం, కదళీవ నం, లొద్దిమల్లయ్య వంటి పురాతన ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. పర్హా బాద్ నుంచి పాతాళగంగ మధ్య ఉన్న 18 చెంచు పెంటలు కాకుండా ఆదివా సీలు, అడవి జంతువులకు జీవనాధారంగా 12 చెరువులు,6 బావులు,3 ఊట లు ఉన్నాయి.యురేనియం తవ్వకాల కారణంగా నీటి నిక్షేపాలు కలుషిత మైతాయేమోన్న భయం కూడా వారిని వెంటాడుతోంది.
ఆనాడు వద్దన్నారు..
తెలంగాణ మలిదశ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ ప్రాంతంలో పర్యటించి స్థానికుల ఆందోళనలకు మద్దతుగా నిలిచారు. ఎటువంటి పరిస్థితుల్లోను డీబిర్ సంస్థ యురేనియం నిక్షేపాలకు వెలికి తీసేందుకు అనుమతించేది లేదని తేల్చిచెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో యురేని యం నిక్షేపాలను వెలికితీసే పనులకు అడ్డుపడిన టిఆర్‌ఎస్ నాయకత్వం తమ ఏలుబడిలో ఆదివాసీల ఆకాంక్షలను పూర్తిగా విస్మరించినట్లుగా వ్యవహరిస్తోందనే విమర్శలు తీవ్రమవుతున్నాయి. యురేనియం నిక్షేపాలను వెలికి తీసేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని కేంద్రానికి లిఖిత పూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం నిరభ్యంతర పత్రం జారీ చేయడంతో డీబిర్ సంస్థ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లోకి యంత్రాలతో దిగడానికి సన్నద్దమవుతోంది. ఒక నాడు అభయారణ్యం పేరిట మరోనాడు యురేనియం పేరిట పూటకో పేరుచెప్పి ఆదివాసీలను అడవినుంచి తరిమేసే పథకాలు పురుడు పోసుకుంటున్నాయి.
రాజకీయ చక్రబంధంలో గిరిపుత్రులు..
అమ్రాబాద్ నుంచి ఫర్హా బాద్ వరకు యురేనియం జరిపే యురేనియం తవ్వకాలను అడ్డుకుంటామని కాంగ్రెస్,టిడిపిలు ఇప్పటికే ఆందోళనలకు పిలుపు నిచ్చాయి. చెంచు పెంటల పెద్దలతో కలిసి వామపక్షపార్టీలు నిరసన లు చేపట్టాయి.అచ్చంపేట నియోజ కవర్గానికి ప్రాతినిథ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ ”2008లో మా పార్టీ ప్రభుత్వంలో ఉన్నా స్థానికులు, ఆదివాసీల అభిప్రాయాలను గౌరవించి డిబీర్ సంస్థ యురేనియం తవ్వకాలను వ్యతిరేకించాం. ప్రభుత్వం అనధికారికంగా ఇచ్చిన అనుమతులు వెనక్కి తీసుకునేలా వత్తిడి తేగలిగామ న్నారు. ప్రస్తుత ప్రభుత్వం యురేనియం తవ్వకాలను నిరభ్యంతర పత్రం జారీ చేసినట్లు తమకు సమాచారం ఉందన్నారు. ఆదివాసీలతో పాటు అమ్రా బాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌ను పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం అన్నారు. ఐతే యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తామన్నారు. ఇదిలా ఉంటే రాజకీయా లకు దూరంగా ఉండే ఆదివాసీలు, చెంచులు తమ సమస్యల పరిష్కారానికి తరచుగా రోడ్డెక్కుతూ మద్దతుగా నిలుస్తున్న రాజకీయ పక్షాల నేతల వైపు ఆకర్శితులవుతుండటం వారి ప్రత్యేక ఉనికికి ఇబ్బందికరంగా మారుతోంది.