Home అంతర్జాతీయ వార్తలు గ్రీన్ కార్డు రివొల్యూషన్!

గ్రీన్ కార్డు రివొల్యూషన్!

Green card Rivolyusan

 

అమెరికా కాంగ్రెస్‌లో రెండు కీలక బిల్లులు
ఉభయ పార్టీల సభ్యుల మద్దతు
భారతీయ నిపుణులకు మేలు
శాశ్వత నివాసానికీ వీలు

వాషింగ్టన్ : గ్రీన్‌కార్డుల జారీపై దేశాలవారీగా ఉన్న పరిమితిని ఎత్తివేసే ఒకే రకమైన రెండు కీలక బిల్లులను అమెరికా ప్రభుత్వం రెండు చట్టసభల్లో ప్రవేశపెట్టింది. అమెరికాలో శాశ్వత నివాసానికి ఈ గ్రీన్‌కార్డులు చట్టబద్ధత కల్పిస్తాయి. వీటితో వేలాది మంది భారతీయ వృత్తి నిపుణులకు లాభం చేకూరుతుంది. సిలికాన్ వ్యాలీకి చెందిన గూగు ల్ వంటి ప్రముఖ కంపెనీల మద్దతుతో రెండు వేర్వేరు బిల్లులను అమెరికా ప్రతినిధుల సభ, సెనెట్‌లో ప్రవేశపెట్టింది. సెనెట్‌లో రిపబ్లికన్ పార్టీకి చెందిన మైక్ లీ, దేశాధ్యక్ష పదవికి బరిలో దిగుతున్న డెమోక్రాటిక్ సభ్యురాలు కమలా హారిస్ ఫెయిర్‌నెస్ ఫర్ హై స్కిల్డ్ ఇమ్మిగ్రేంట్స యాక్ట్‌ను ప్రవేశపెట్టారు. ఉద్యోగ ప్రాతిపదికన ఇచ్చే గ్రీన్‌కార్డుల విషయంలో దేశాలవారిగా ఉన్న పరిమితిని తొలిగించేందుకు ఈ బిల్లు దోహద పడుతుంది. ఇక ఇదే విధమైన హెచ్‌ఆర్ 1044 బిల్లును ప్రతినిధుల సభలో కాంగ్రెస్ సభ్యులు జొ లాఫ్‌గ్రెన్, కెన్ బక్‌లు తీసుకువచ్చారు. కెన్ బక్ ఇమ్మిగ్రేషన్, పౌరసత్వం న్యాయ ఉపసంఘం సభ్యులుగా ఉన్నారు.

ఈ కమిటీకి అధ్యక్షులుగా లాఫ్‌గ్రెన్ వ్యవహరిస్తున్నారు. ఈ బిల్లును వీరికి తోడుగా 112 మందితో కూడిన రెండు పార్టీల బృందం సభలో ప్రవేశపెట్టారు. దీనితో బిల్లు ఆమోదానికి మార్గం సుగమం అయింది. కాంగ్రెస్ ఆమోదం పొంది , చట్టంగా రూపొందితే, ప్రస్తుతం హెచ్ 1 బి వీసాలపై ఉన్న వేలాది మంది భారతీయ వృత్తి నిపుణులకు ప్రయోజనం చేకూరుతుంది. వారికి అమెరికాలో శాశ్వత నివాస యోగ్యత దక్కుతుంది. ప్రస్తుతం ఈ వీసాదార్లు దేశంలో శాశ్వత నివాస అర్హత కోసం దశాబ్ద కాలం పైగా వేచి ఉండాల్సి వస్తోంది. హెచ్ 1 బి వీసాపైనే వేలాది మంది భారతీయ ఐటి యువత వివిధ కంపెనీలలో ఉద్యోగాలలో ఉన్నారు. హెచ్ 1 బి వీసా కేవలం తాత్కాలిక నివాస సౌకర్యం కల్పిస్తోంది. ఇది నాన్ ఇమ్మిగ్రేంట్ వీసాగా ఉంటోంది. సరైన సాంకేతిక, విద్యాపరమైన అనుభవం ప్రాతిపదికన విదేశీయులను అమెరికా కంపెనీలలోకి తీసుకుని, తగు స్థానం కల్పించేందుకు ఈ హెచ్ 1 బి వీసా వీలు కల్పిస్తోంది. ప్రస్తుతం ప్రవేశపెట్టిన బిల్లులతో విదేశీయులకు ప్రత్యేకించి భారతీయులకు దక్కే గ్రీన్‌కార్డులతో సంబంధితులు అమెరికాలో శాశ్వతంగా ఉండేందుకు ఉద్యోగాలు చేసేందుకు వీలేర్పడుతుంది.

అమెరికాలో ప్రతి ఏటా 1,40,000 గ్రీన్‌కార్డులు అందుబాటులో ఉంటున్నాయి. ఉద్యోగాలలో ఉన్న ఇమ్మిగ్రేంట్లకు వీటిని జారీ చేస్తున్నారు. తాత్కాలిక హెచ్ 1 బి లేదా ఎల్ వీసాలపై వచ్చే వారికి వీటిని సమకూరుస్తున్నారు. అయితే దేశాల వారిగా గ్రీన్‌కార్డుల జారీలో పరిమితి ఉంది. ఏడు శాతం కోటా ఉండటంతో చైనా లేదా భారతీయ పిజి పట్టభద్రులు దశాబ్ధం అంతకు మించి గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. తక్కువ జనాభా ఉండే దేశాలతో పోలిస్తే ఇది అత్యధిక గడువుగా మారుతోంది. ప్రత్యేకించి భారతీయులు చాలా కాలం కేవలం హెచ్ 1 బి వీసాలతోనే ఉద్యోగాలు చేస్తూ, శాశ్వత నివాస పౌరులుగా మారేందుకు బిక్కుబిక్కు మంటూ ఎదురుచూడాల్సి వస్తోంది. ‘మాది వలసదార్ల దేశం. వైవిధ్యం, మన ఐక్యతనుంచే మన బలం సంతరించుకుంది’ అని ఇండియన్ అమెరికన్ సెనెటర్ కమలా హారిస్ చెప్పారు. వివక్షతో కూడిన జాప్యాలను తొలిగించుకోవల్సి ఉంది. కుటుంబాల కలయికకు అవకాశం కల్పించాల్సి ఉంది. దీనితో అత్యంత నిపుణులైన ఇమ్మిగ్రేంట్లు దోపిడికి గురికాకుండా ఉంటారని, అమెరికాలోనే కొనసాగుతూ , దేశ ఆర్థిక వ్యవస్థకు దోహదం చేసిన వారవుతారని అన్నారు.

US Government introduced two key bills in the legislature