Home ఎడిటోరియల్ భారత్‌కు ట్రంప్ కష్టాలు

భారత్‌కు ట్రంప్ కష్టాలు

Article about Modi china tour

‘ఇరాన్ నుంచి ఆయిలు దిగుమతులను నవంబర్ 4 నాటికి పూర్తిగా నిలుపు చేయండి లేదా ఆంక్షలకు గురవుతారు’ ఇది భారత్, చైనా ప్రభుత్వాలకు అమెరికా ప్రభుత్వ హెచ్చరిక. ఇది ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న భారత ఆర్థిక వ్యవస్థకు ఎదురుకానున్న విపత్కర పరిస్థితి. ఇరాన్‌తో భద్రతా మండలి సభ్య దేశాలు ఐదు ప్లస్ జర్మనీ సంతకాలు చేసిన అణుశక్తి కార్యక్రమాల నిషేధ ఒప్పందం నుంచి డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం గత నెలలో ఏకపక్షంగా ఉపసంహరించుకోవటం తెలిసిందే. అణు ఒప్పందం నిబంధనలను ఇరాన్ పాటిస్తున్నదని రషా, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా, జర్మనీ చెబుతున్నా పెడచెవిన పెట్టిన ట్రంప్ రాజకీయ కోణం నుంచి ఇరాన్‌ను శిక్షించేందుకు సిద్ధమైనారు. ఇరాన్ సిరియాలో అస్సాద్ ప్రభుత్వానికి తోడ్పాటివ్వటం, ఇజ్రాయిల్ దురాగతాలకు వ్యతిరేకంగా పాలస్తీనాకు మద్దతివ్వటం ట్రంప్‌కు, పశ్చిమాసియా లో అమెరికాకు కీలక మద్దతుదారైన సౌదీ అరేబియాకు కంటగింపు కలిగించే విషయాలు. అందువల్ల ఇరాన్ పశ్చిమాసియాలో టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నదని, దానికి గుణపాఠం చెప్పేందుకు అణు ఒప్పందం నుంచి ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. అణు ఒప్పందం కుదరటానికి ముందు ఇరాన్‌పై విధించిన ఆంక్షలు పునరుద్ధరించారు. ఇరాన్‌తో వ్యాపారం చేసే విదేశీ కంపెనీలు వాణిజ్య స్వభావాన్ని బట్టి 90180 రోజుల్లో దాన్ని పూర్తిగా బంద్ చేయాలని ఆదేశించారు. ఉల్లంఘించే దేశాలు అమెరికా ఆంక్షలకు గురవుతాయని హెచ్చరిక చేశారు. అమెరికాతో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన చైనాకు, వ్యూహాత్మక మిత్రదేశమైన భారత్‌కు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చేందుకు కొందరు లా మేకర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నవంబర్ 4 నుంచి ఇరాన్ ఆయిలు దిగుమతిని పూర్తిగా నిలుపు చేయాలని భారత్, చైనాలకు కూడా చెప్పారా అన్న ప్రశ్నకు విదేశాంగ శాఖ ప్రతినిధి “కచ్చితంగా” చెప్పినట్లు సమాధానమిచ్చారు.
మన దేశ ఆయిలు అవసరాల్లో 80 శాతం దిగుమతులపై ఆధారపడి ఉండగా, మన దేశానికి ఇరాక్, సౌదీ అరేబియా తర్వాత అతి ఎక్కువ ఆయిలు సరఫరా చేస్తున్న మూడవ దేశం ఇరాన్. 201718 ఆర్థిక సంవత్సరం తొలి 10 మాసాల్లో (2017 ఏప్రిల్ నుంచి 2018 జనవరి వరకు) ఇరాన్ మన దేశానికి 18.4 మిలియన్ టన్నుల క్రూడ్ ఆయిలు సరఫరా చేసింది. ఇరాన్ ఆయిలును ఇండియన్ కార్పొరేషన్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నది. అమెరికా ఆంక్షలతో ఇప్పుడది సరఫరాల సంరక్షణకు అమెరికా వంటి సుదూర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దాంతో ఖర్చులు పెరుగుతాయి. ఇప్పటికే హెచ్చుగా ఉన్న పెట్రోలు, డీజిల్ రిటైల్ రేటు మరింత పెరుగుతుంది. ఎన్నికల సంవత్సరంలో ప్రధాని మోడీకిది ఇబ్బందికర పరిస్థితి.
అమెరికాతో మితిమీరిన స్నేహంవల్ల ఏదో మంచి జరుగుతుందని మోడీ ఆశించి ఆలింగనం చేసుకుంటే చెడు ఎదురవుతున్నది. ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుద్ధం మన దేశాన్ని తాకింది. ప్రతిచర్యలు తీసుకోవలసి వచ్చింది. అమెరికా నుంచి దిగుమతులపై భారత్ 100 శాతం సుంకాలు విధిస్తోందని, వాటిని తగ్గించకపోతే ప్రతీకార చర్యలు తప్పవని ట్రంప్ ఇప్పటికీ హెచ్చరిస్తున్నాడు. “ఆంక్షల చట్టం ద్వారా అమెరికా ప్రత్యర్థులను ఎదుర్కోవటం (సిఎఎటిఎస్‌ఎ)” చట్టం తెచ్చాడు. దీన్ని అమలు చేస్తే మన దేశానికి సాంప్రదాయక ఆయుధ సరఫరాదారైన రష్యా నుంచి ఆయుధాల కొనుగోలు ఇబ్బందిలోపడుతుంది. ఇది మన దేశ భద్రతా వ్యవస్థకు పెనుముప్ప అవుతుంది. పాకిస్థాన్ భూభాగంతో సంబంధం లేకుండా ఆఫ్ఘనిస్థాన్‌కు, అటువైన మధ్య ఆసియాకు సరఫరాల నిమిత్తం ఇరాన్‌లోని చాబహార్ రేవును భారత్ అభివృద్ధి చేస్తోంది. ఇరాన్‌పై ఆంక్షలు విధించటం తమ “జాతీయ భద్రత” సమస్యగా అమెరికా ఎలా చూస్తుందో, చాబహార్ రేవు మన జాతీయ ప్రయోజనాలకు అంతే ముఖ్యం. అమెరికా ఆంక్షలతో ఈ ప్రాజెక్టు ఇబ్బందిలో పడుతుంది. అందువల్ల మన జాతీయ ప్రయోజనాల కొరకు భారత ప్రభుత్వం దృఢంగా నిలబడాలి. ఇరాన్ అణు ఒప్పందాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్న దేశాలతో సహకరించాలి.