Home అంతర్జాతీయ వార్తలు సత్తా చాటిన ‘సమోసా కాకస్’

సత్తా చాటిన ‘సమోసా కాకస్’

ప్రతినిధుల సభకు తిరిగి ఎన్నికయిన నలుగురు భారతీయ అమెరికన్లు

US Midterm Elections: Indo Americans Re Elected in House

వాషింగ్టన్: అమెరికా ప్రతినిధుల సభలో  ‘సమోసా కాకస్’గా పిలువబడే డెమోక్రటిక్ పార్టీకి చెందిన నలుగురు భారతీయ అమెరికన్లు తాజా ఎన్నికల్లో తిరిగి విజయం సాధించారు. ఇతర పదవులకు జరిగిన ఎన్నికల్లో మరో డజను మంది భారతీయ సంతతి వారు కూడా విజయం సాధించడాన్ని బట్టి చూస్తే అమెరికా రాజకీయాల్లో భారతీయుల ప్రాబల్యం రోజురోజుకు పెరుగుతూ ఉన్న విషయం స్పష్టమవుతోంది. ఇల్లినాయస్‌కు చెందిన ఎనిమిదో కాంగ్రెస్ జిల్లానుంచి రాజా కృష్ణమూర్తి రెండో సారి విజయం సాధించారు. ఆయన రిపబ్లికన్ పార్టీకి చెందిన మరో భారతీయ అమెరికన్ జెడి న్న్‌కర్‌పై సునాయాసంగా విజయం సాధించారు. కాగా ఇప్పటికే మూడు పార్లు విజయం సాధించిన డాక్టర్ అమీ బేరా కాలిఫోర్నియాకు చెందిన ఏడో కాంగ్రెస్ జిల్లానుంచి వరసగా నాలుగో సారి గెలుపొందారు.

అయితేగత మూడు ఎన్నికల్లో రీకౌంటింగ్ దాకా వేచి ఉండాలి వచ్చిన ఆయన ఈ సారి మాత్రం  నేరుగా విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీ ప్రత్యర్థి ఆండ్రూ గాట్‌పై ఆయన 5శాతం మెజారిటీతో గెలుపొందారు. సిలికాన్ వ్యాలీలో కాలిఫోర్నియాకు చెందిన 17వ కాంగ్రెస్ జిల్లానుంచి రో ఖన్నా 44 శాతం భారీ మెజారిటీతో గెలుపొందారు. కాగా ప్రస్తుత ప్రతినిధుల సభలో ఏకైక భారతీయ అమెరికా మహిళా ప్రతినిధి అయిన ప్రమీలా జయపాల్ ప్రత్యర్థి క్రైగ్ కెల్లర్‌పై భారీ మెజారిటీతో గెలుపొందారు. కాగా కొత్తగా తొలిసారి బరిలోకి దిగిన దాదాపు అరడజను మంది భారతీయ అమెరికన్లలో ఎవరు కూడా విజయం సాధించలేదు. అయితే వివిధ పదవులకు పోటీ చేసిన భారతీయ అమెరికన్లు దాదాపు డజను మంది విజయం సాధించారు. అన్నిటిలోకి విస్కాన్ రాష్ట్ర అటార్నీ జనరల్ పదవికి జరిగిన ఎన్నికల్లో జోష్‌కౌల్  విజయం సాధించి ఈ పదవికి ఎన్నికయిన తొలి భారతీయ అమెరికన్‌గా చరిత్ర సృష్టించారు.

రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రస్తుత అటార్నీ జనరల్ బ్రాడ్ ష్కిమెల్‌ను ఆయన ఓడించారు. ‘అమెరికాలోని భారతీయులకు ఈ రోజు ఓ గొప్ప రోజు.అమెరికా ప్రతినిధుల సభకు చెందిన నలుగురు సభ్యులు తిరిగి ఎన్నిక కావడమే కాకుండా మరో ఆరుగురు సభ్యులు కొత్తగా వివిధ రాష్ట్రాల చట్ట సభలకు ఎన్నికయ్యారు. వీరిలో నలుగురు కెంటకీ, న్యూయార్క్, ఇల్లినాయిస్, ఆరిజోనా రాష్ట్రాల చట్టసభల్లో తొలిసారిగా అడుగుపెడుతున్న వారు కూడా ఉన్నారు’ అని గురువారం ఫలితాలు పూర్తిగా వెల్లడైన తర్వాత ‘ ఇంపాక్ట్’ సంస్థకు చెందిన గౌతమ్ రాఘవన్ పిటిఐతో మాట్లాడుతూ అన్నారు. రాఘవన్ గతంలో ఒబామా ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా పని చేశారు.

US Midterm Elections: Indo Americans Re Elected in House

Telangana news