Home స్కోర్ నాదల్ మూడోసారి

నాదల్ మూడోసారి

 యుఎస్ ఓపెన్ విజేతగా స్పెయిన్ బుల్

 తుది పోరులో కెవిన్ అండర్సన్‌పై అద్భుత విజయం

 కెరీర్‌లో రఫెల్‌కు 16వ గ్రాండ్‌స్లామ్ టైటిల్

Nadal

న్యూయార్క్: టెన్నిస్ ప్రపంచ చరిత్రలో స్పెయిన్ బుల్, వరల్డ్ నెంబర్‌వన్ టెన్నిన్ స్టార్ రఫెల్ నాదల్ ముచ్చటగా మూడోసారి యుఎస్ ఓపెన్ విజేతగా నిలిచి సంచలనం సృష్టించాడు. ఇప్పటికే రెండు యుఎస్ ఓపెన్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్న నాదల్ తాజాగా మూడో యుఎస్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. తద్వారా తన కెరీర్‌లో 16వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాడు. న్యూయార్క్‌లోని ఆర్థర్ ఆషే స్టేడియంలో ఆదివారం పురుషుల సింగిల్స్ విభాగంలో రెండు గంటల 28 నిమిషాల పాటు ఏకపక్షంగా సాగిన ఫైనల్లో దక్షిణాఫ్రికా క్రీడాకారుడు కెవిన్ అండర్సన్‌పై వరుస సెట్లలో అద్భుత విజయం సాధించాడు. తనదైన శైలిలో ఆడుతూ ప్రత్యర్థి అండర్సన్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు. ఈ క్రమంలో ప్రపంచ నెంబర్ వన్ నాదల్ 63, 63, 64 తేడాతో అండర్సన్‌ను చిత్తుగా ఓడించాడు. మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో ఫైనల్ వరకు దూసుకెళ్లిన 31 ఏళ్ల రఫెల్ తన మార్క్ ఆటతో ఈ ఏడాదిలో తుదిపోరులో విజృంభించి రెండు యుఎస్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. టైటిల్ విజేతగా నిలిచిన నాదల్‌కు 3.7 మిలియన్ల డాలర్లు (రూ. 23 కోట్ల 61 లక్షలు), రన్నరప్‌గా నిలిచిన అండర్సన్‌కు 1.825 మిలియన్ల డాలర్లు (రూ. 11 కోట్ల 64 లక్షలు) నగదు బహుమతి అందుకున్నారు.
రఫ్ఫాడించిన రఫెల్
ఫైనల్ టోర్నీలో ఆరంభం నుంచి నాదల్ భారీ షాట్లతో రఫ్ఫాడించాడు. ఫైనల్ వరకు దూసుకెళ్లిన నాదల్ ప్రత్యర్థి అండర్సన్‌ను ఒత్తిడికి గురిచేశాడు. నువ్వానేనా అంటూ సాగిన మ్యాచ్‌లో అండర్సన్‌పై 40తో మరోసారి రఫెల్ ఆధిక్యాన్ని ప్రదర్శించాడు. 2010, 2013 చాంపియన్‌షిప్‌లో మొత్తం మ్యాచ్‌లో కేవలం 15 పాయింట్లు మాత్రమే కోల్పోయిన నాదల్.. ఎక్కడా కూడా బ్రేక్ పాయింట్లు ఎదుర్కొకుండానే నెట్‌లో వరుసగా 16 పాయింట్లను గెలిచాడు. 31 ఏళ్ల క్రీడాకారుడిగా పొడగారి కెవిన్ అండర్సన్ తొలి సెట్‌లో 23 అనవసర తప్పిదాలు చేయగా, నాదల్ మాత్రం ఐదు తప్పిదాలు మాత్రమే చేసి పుంజుకున్నాడు. రెండో సెట్‌లో ఇరువురి మధ్య పోరు పోటాపోటీగా సాగినప్పటికీ, సర్వీసు చేయడంలో నాదల్‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. తొమ్మిది సర్వీసు గేమ్స్‌లో కేవలం ఏడు పాయింట్లు మాత్రమే నాదల్ కోల్పోయి రెండో సెట్‌లో ఆధిక్యాన్ని సాధించాడు. మూడో సెట్ ఆరంభంలో పుంజుకున్న అండర్సన్ ఒక బ్రేక్‌పాయింట్‌తో నాదల్‌కు గట్టి పోటీనిచ్చినప్పటికీ చివరిలో అనవసర తప్పిదాలతో మ్యాచ్ చేజార్చుకున్నాడు. ఫలితంగా రెండో మ్యాచ్‌లో పాయింట్‌తో నాదల్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఇక దక్షిణాఫ్రికా క్రీడాకారుడు అండర్సన్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి కాగా, 1968 తర్వాత యుఎస్ ఓపెన్ ఫైనల్ టోర్నీ వరకు చేరిన తొలి దక్షిణాఫ్రికా ఆటగాడిగా నిలిచిన అండర్సన్ రన్నరప్‌గానే మిగిలాడు.
విజయ మార్గం సాగిందిలా..
ఈ ఏడాది యుఎస్ ఓపెన్‌లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ తొలి రౌండ్‌లో సెర్బియా క్రీడాకారుడు దుసాన్ లాజోవిక్‌పై 7-6 (7-6), 6-2, 6-2 తేడాతో గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. రెండో రౌండ్‌లోనూ అదే దూకుడును కొనసాగించి ప్రత్యర్థి తారో డేనియల్ (జపాన్) పై 4-6, 6-3, 6-2, 6-2 తేడాతో గెలిచి మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. ఇక మూడో రౌండ్‌లో కూడా పట్టువదలని విక్రమార్కుడిలా అద్భుతమైన ఆటతీరుతో కదం తొక్కాడు. ఫలితంగా మూడో రౌండ్‌లో ప్రత్యర్థి లియోనార్డో మేయర్ (ఆర్జెంటీనా)పై 6-7, (7-3) 6-3 6-1, 6-4 తేడాతో విజయం సాధించి చివరగా నాలుగో రౌండ్‌లోకి ప్రవేశించాడు. ఇందులో కూడా అదే దూకుడును కొనసాగించిన నాదల్.. అలెగ్జాండర్ డోల్గోపోలోవ్ (ఉక్రేయిన్)పై 6-2, 6-4, 6-1 తేడాతో విజయం సాధించి క్వార్టర్స్ ఫైనల్లోకి ప్రవేశించాడు. క్వార్టర్స్‌లో కూడా సత్తా చాటి ఆండ్రీ రూబ్లేవ్ (రష్యా) పై 6-1, 6-2, 6-2 తేడాతో గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లాడు. సెమీఫైనల్లోను విజృంభించిన నాదల్.. జువాన్ మార్టిన్ డెల్ పోట్రో (అర్జెంటీనా)తో తలపడి 4-6, 6-0, 6-3, 6-2 తేడాతో గెలిచి ఫైనల్ వరకు చేరాడు. ఈ క్రమంలో టైటిల్ పోరులో దక్షిణాఫ్రికా క్రీడాకారుడు కెవిన్ అండర్సన్‌ను ఢీకొన్న నాదల్.. 6-3, 6-3, 6-4 తేడాతో అండర్సన్‌పై గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.
ఫెదరర్‌కు అగ్రస్థానం.. నాదల్‌కు రెండో స్థానం
2013 నుంచి తొలిసారి వరుసగా రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సాధించిన రఫెల్.. గత జూన్‌లో ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచాడు. ఈ ఏడాదిలో ప్రతిష్టాతక్మమైన యుఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్‌ను నాదల్ సాధించగా, స్విస్ దిగ్గజం ప్రపంచ నెంబర్ 2 ర్యాంకర్ రోజర్ ఫెదరర్ వరుసగా వింబుల్డన్, ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీ టైటిల్స్‌ను సాధించారు. పురుషుల సింగిల్స్‌లో ఆల్‌టైమ్ గ్రాండ్ స్లామ్ 19 టైటిల్స్ జాబితాలో ఫెదరర్ అగ్రస్థానంలో ఉండగా, స్పెయిన్ బుల్ నాదల్ అత్యధికగా 10 ఫ్రెంచ్ టైటిల్స్, మూడు యుఎస్ ఓపెన్, రెండు వింబుల్డన్స్, ఒకటి ఆస్ట్రేలియా టైటిల్ గెలిచి మొత్తంగా తన ఖాతాలో 16 టైటిల్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు.