Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

యుఎస్ ఓపెన్ టైటిల్ విజేత స్లోనె స్టీఫెన్స్

 ఫైనల్లో స్నేహితురాలు మాడిసన్ కీస్‌పై ఘన విజయం
 కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ సాధించిన నల్ల కలువ

Stephens

న్యూయార్క్: యుఎస్ ఓపెన్‌లోకి అడుగుపెట్టిన అన్‌సీడెడ్ టెన్నిస్ క్రీడాకారిణి నల్లకలువ స్లోనె స్టీఫెన్స్ చరిత్ర సృష్టించింది. యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ ఫైనల్లో తన చిన్ననాటి స్నేహితురాలు 15వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా)పై 63, 60తో ఘన విజయం సాధించింది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి ఇద్దరి అమెరిక్ల మధ్య 61 నిమిషాల పాటు సాగిన తుదిపోరులో ప్రత్యర్థి మాడిసన్‌ను స్టీఫెన్స్ మట్టికరిపించింది. దీంతో తన కెరీర్‌లోనే తొలి గ్రాండ్‌స్లామ్‌ను సొంతం చేసుకుంది. తాజా విజయంతో 83వ ర్యాంకులో ఉన్న స్టీఫెన్స్ 17 స్థానాలకు ఎగబాకగా, ఓపెన్ ఎరాలో గ్రాండ్ స్లామ్ గెలిచిన ఐదో అన్‌సీడెడ్ మహిళా క్రీడాకారిణిగా ఘనతను సాధించింది. ఓపెన్ ఎరాలో న్యూయార్క్‌లో ఇద్దరు టెన్నిస్ మహిళా క్రీడాకారిణులు గ్రాండ్ స్లామ్ తుదిపోరులో తలపడటం ఇది రెండోసారి. వింబుల్డన్‌లో నల్లకలువ స్లోనె కాలికి గాయం కావడంతో 11 నెలల పాటు ఆటకు దూరమైంది. విరామం తరువాత స్టీఫెన్స్ తన ఆటతీరుతో యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను దక్కించుకుంది. గత జనవరిలో కాలికి గాయం కారణంగా ఆమె శస్త్రచికిత్స చేయించుకోవడంతో 16 వారాల పాటు సరిగా నడవలేకపోయింది. దాంతో టోర్నీకి దూరమైంది. రెండు నెలల క్రితమే వింబుల్డన్‌కు తిరిగివచ్చిన 24 ఏళ్ల స్టీఫెన్స్ వాషింగ్టన్ వేదికగా జరిగిన టోర్నమెంటులో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. ఫలితంగా 957వ ర్యాంకుకు పడిపోయింది. వాషింగ్టన్ వేదికగా జరిగిన టోర్నమెంటుల్లో ఆడిన 17 మ్యాచ్‌ల్లో 15 విజయాలు సాధించిన స్టీఫెన్స్ కొత్త గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా అవతరించి అందరి దృష్టిని ఆకర్షించింది.

తొలిసారి గ్రాండ్‌స్లామ్ గెలవడంతో స్టీఫెన్స్ 3.7 మిలియన్ డాలర్ల నగదు బహుమతిని అందుకుంది. టైటిల్ గెలుచుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘వావ్.. యుఎస్ ఓపెన్ టైటిల్ గెలవడం ఎంతో అద్భుతం. నేను ఇప్పుడూ కదా రిటైర్ కావాలి. మాడిసన్ కీస్ నా గొప్ప స్నేహితుల్లో ఒకరు. తుదిపోరులో విజయాన్ని మాటల్లో చెప్పలేను’ అంటూ స్టీఫెన్స్ సంతోషాన్ని వ్యక్తం చేసింది. మరోవైపు ఓటమిపాలైన కీస్ మాట్లాడుతూ.. ‘స్లోనె నేను అమితంగా అభిమానించే గొప్ప స్నేహితుల్లో ఒకరు. ఆమెతో కలిసి ఆడటం నాకు చాలా ప్రత్యేకం. స్టీఫెన్స్ స్థానంలో మరెవరైనా ఉంటే వారిని ఓడించేదాన్ని. నా ఓటమి విషయంలో కంటే స్టీఫెన్స్ విజయమే నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది’ అని నవ్వుతూ చెప్పింది. అంతకముందు క్వార్టర్స్‌లో 16వ సీడ్ అనస్టాసిజా సెవస్తోవా (లాత్వియా)పై గెలిచిన స్టీఫెన్స్ సెమీస్‌లోకి దూసుకెళ్లింది. అనంతరం సెమీస్‌లో ప్రత్యర్థి వీనస్ విలియమ్స్‌కు షాక్ ఇచ్చి ఫైనల్‌కు చేరింది.

Comments

comments