Home అంతర్జాతీయ వార్తలు రష్యా క్షిపణులా.. తీవ్ర ఆంక్షలా తేల్చుకోండి

రష్యా క్షిపణులా.. తీవ్ర ఆంక్షలా తేల్చుకోండి

 పుతిన్ రాక తరుణంలో భారత్‌కు అమెరికా హెచ్చరిక

Trump allies push White House to consider regime change in Tehran

వాషింగ్టన్ : రష్యా అధ్యక్షులు పుతిన్ పర్యటన నేపథ్యంలో అమెరికా భారత్‌కు ఆంక్షల హెచ్చరికలు వెలువరించింది. ఎస్ 400 క్షిపణి రక్షణ వ్యవస్థను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేయరాదని స్పష్టం చేసింది. ఈ వ్యవస్థను భారత్ కొనుగోలు చేసినట్లు అయితే తీవ్ర ఆంక్షల విధింపు దిశలో చర్యలు తీసుకోవల్సి ఉంటుందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి గురువారం తెలిపారు. గురువారం నుంచే భారత్‌లో రష్యా అధ్యక్షులు పుతిన్ పర్యటన ప్రారంభం అవుతుంది. ఈ సందర్భంగా పలు ఆయుధాలు, భద్రతా వ్యవస్థల కొనుగోళ్ల ఒప్పందాలు కుదరనున్నాయి. రష్యన్లతో గణనీయ స్థాయిలో వ్యాపార లావాదేవీలకు దిగే ఏ దేశంపై అయినా ఆంక్షల విధింపు ప్రధాన అంశం అవుతుందని అమెరికా తెలిపింది. ఇరాన్, ఉత్తర కొరియా, లేదా రష్యాలతో ఎటువంటి లావాదేవీలు జరిపే దేశం అయినా అమెరికాకు శత్రుదేశంగా భావించాల్సి వస్తుందనే అమెరికా తీరు ఇప్పుడు భారత్‌కు చిక్కులు తెచ్చిపెట్టింది. అమెరికాతో పలు రకాలైన వ్యాపార లావాదేవీలను భారత్ కొనసాగిస్తోంది. అయితే పాకిస్థాన్, చైనాలను సరైన విధంగా కట్టడి చేసేందుకు చిరకాల మిత్రపక్షంగా ఉన్న రష్యాతో అత్యంత కీలకమైన క్షిపణి వ్యవస్థను సేకరించాలని భారతదేశం తలపెట్టింది.

ఇతర దేశాలపై తీవ్ర స్థాయి ఆంక్షల విధింపునకు అమెరికా తమ స్వదేశీ చట్టం క్యాట్సాను ప్రయోగిస్తోంది. అమెరికాకు మార్కెట్‌పరంగా ప్రతికూలతలను లేకుండా చేసేందుకు ఈ కటుతరమైన చట్టాన్ని అమెరికా వాడుతోంది. ఈ చట్టాన్ని ఇప్పుడు భారత్‌పై కూడా ప్రయోగించే అవకాశం ఉందని తాజాగా అమెరికా విదేశాంగ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌లో రష్యా సైనిక జోక్యం, అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ప్రమేయం ఆరోపణల అంశాలతో ఇప్పుడు అమెరికా రష్యాపై తీవ్ర స్థాయి ఆంక్షలకు దిగింది. అంతేకాకుండా తమ మిత్రపక్ష దేశాలు అయినా, వ్యాపార వాణిజ్య భాగస్వామ్య దేశాలు అయినా రష్యాతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోరాదని, ఇంతకు ముందు పెట్టుకున్నా వాటిని వదులుకోవాలని అమెరికా హెచ్చరించింది. క్యాట్సా పరిధిలో అటువంటి దేశాలపై పాత మిత్రత్వాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా చర్యలు తీసుకుంటామని అమెరికా విదేశాంగ ప్రతినిధి హెచ్చరించడం కలకలం రేపింది.

రష్యా నుంచి ఎస్ 400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టంను భారత్ సమీకరించుకుంటోందనే విలేకరుల ప్రశ్నకు విదేశాంగ ప్రతినిధి స్పందించారు. అమెరికా ఆంక్షల చట్టంంలోని సెక్షన్ 231 పరిధిలోకి వచ్చే దిశలో ఎస్ 400 వాయు, క్షిపణి రక్షణ వ్యవస్థ ఉంటుంది. తదనుగుణంగా చర్యలకు అవకాశం ఉంటుందని విదేశాంగ ప్రతినిధి తెలిపారు. వందల కోట్ల డాలర్ల విలువైన భూతల గగనతల సామర్థ క్షిపణి వ్యవస్థను భారత్‌కు కట్టబెట్టే దిశలో రష్యా చాలా కాలంగా యత్నిస్తోంది. దూర ప్రాంత శత్రు స్థావరాలను దెబ్బతీసేందుకు అనువుగా ఉండే ఈ క్షిపణి వ్యవస్థ అత్యంత అధునాతమైనది. రష్యా అధ్యక్షులు పుతిన్ భారతదేశ ఆగమన దశలోనే ఆయన పర్యవేక్షణలోనే శుక్రవారం దీనికి సంబంధించిన ఒప్పందంపై ఇరుపక్షాల మధ్య సంతకాలు జరుగుతాయని భావిస్తున్నారు.

భారత్ రష్యాల వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షులు పుతిన్ భారత్ పర్యటన తలపెట్టారు. అన్ని దేశాలతో సత్సంబంధాల దిశలో , క్రమబద్థీకరణ స్థాయిలో ప్రెసిడెంట్ ట్రంప్ ప్రయత్నిస్తున్నారని ఇటీవలే అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియో ఇటీవలే ఎన్‌బిసి న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు. ప్రెసిడెంట్ యత్నాలకు ఇప్పటికైతే సరైన ఫలితం దక్కలేదని కూడా వెల్లడించారు. రష్యాతో సైనిక వ్యాపార లావాదేవీలను జరిపే దేశాల రక్షణ అవసరాలను కించపర్చడం అమెరికా ఉద్ధేశం కాదని, అయితే ఆంక్షల ఫలితపు వ్యయాన్ని రష్యాపై మోపడం, ఈ దేశ అప్రతిష్ట చర్యలకు ప్రతిగా చేపట్టే చర్యలే అని అమెరికా స్పష్టం చేసింది.

US warns India: Missile Deal Between Russia and Bharath

Telangana news