Home సూర్యాపేట కమ్యూనిస్టు యోధుడు వీరారెడ్డి అంతిమయాత్ర

కమ్యూనిస్టు యోధుడు వీరారెడ్డి అంతిమయాత్ర

 Ustela Veerareddy Dies With Heart Attack in Suryapet
కోదాడ/చింతలపాలెం/మేళ్ళచెర్వుః సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం మల్లారెడ్డిగూడెంకు చెందిన కాకలు తీరిన కమ్యూనిస్టు యోధుడు ఉస్తేల వీరారెడ్డి మన మద్యలేరని భావోద్వేగంతో తెలంగాణ రాష్ట్రం కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి పేర్కొన్నారు. సోమవారం రాత్రి 8 గంటలకు హైదరాబాద్ నిమ్స్ వైద్యశాలనందు గుండెపోటుతో తుదిశ్వాస వదిలిన వీరారెడ్డి పార్ధివదేహాన్ని తన సొంత గ్రామామైన మల్లారెడ్డి గూడెంలో వేలాది మంది కమ్యూనిస్టు కార్యకర్తల మద్య అంతిమయాత్రను నిర్వహించారు. ఈ అంతిమయాత్రకు ముఖ్య అతిధులుగా సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, సహయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు పశ్య పద్మ, బొమ్మగాని ప్రభాకర్, సిపిఐ సూర్యాపేట జిల్లా కార్యదర్శి గన్నాచంద్రశేఖర్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రకమ్యూనిస్టుపార్టీ పక్షాన వీరారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

వీరారెడ్డి 1958లో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా పార్టీ సభ్యత్వం తీసుకున్ననాటి నుండి అంతిమ తుదిశ్వాస విడిచేంత వరకు కమ్యూనిస్టు పార్టీని బలోపేతంచేసేందుకు ఎన్నో అటుపోట్లాను ఎదుర్కొని నిలబడిన వీరుడు వీరారెడ్డి అని కొనియాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఆకర్షితుడై దున్నెవానికే భూమి దక్కాలని పేదలకు వేల ఎకరాల భూములను జాతీయ నాయకులు నీలం రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో పంచి పెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలిపారు. నమ్మిన సిద్దాంతాన్ని నిత్యం అమలు చేస్తూ ప్రజా సమస్యల కోసం ఉద్యమాలు నిర్వహించి అనేక సమస్యల పరిష్కారానికి పోరాడిన వ్యక్తి అని ఆయన తెలిపారు. తాను నమ్మిన సిద్దాంతాన్ని తన కుటుంబ సభ్యులు మొత్తం అమలు చేసి పార్టీలో కొనసాగాలని పిల్లలతో పదేపదే తెలియజేసిన గొప్ప కమ్యూనిస్టు నాయకుడని ఆయన తెలిపారు.  స్వార్ధం తెలియని జీవితాన్ని గడుపుతూ చివరకు తన పార్ధివ దేహాన్నికూడా మెడికల్ కళాశాలకు ఇవ్వాలనే కోరికతో తుదిశ్వాస వదిలారని ఆయన తెలిపారు. ఈ అంతిమయాత్రలో సిపిఐ సీనియర్‌నాయకులు దొడ్డానారాయణరావు, సూర్యాపేట జిల్లా కార్యవర్గసభ్యులు బద్దం భద్రారెడ్డి, మేకల శ్రీనివాసరావు,  రాష్ట్రమహిళ నాయకురాలు ఉస్తేల సృజన,  ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మల్లారెడ్డిగూడెంలో వేలాది మంది కమ్యూనిస్టు కార్యకర్తలు ఎర్రజెండాలను చేపట్టి అంతిమయాత్ర అగ్రభాగాన నిలిచి వీరారెడ్డికి జోహర్లు ఆర్పించారు.