Home రాష్ట్ర వార్తలు అదనపు విద్యుత్ ఉత్పత్తి ఏదీ?

అదనపు విద్యుత్ ఉత్పత్తి ఏదీ?

shbr

ఒక్క యూనిట్ కూడా కొత్తగా ఉత్పత్తి చేయకుండా మిగులు రాష్ట్రమంటే ఎలా?
కొనుగోలు చేస్తూ జెన్‌కోను నిర్వీర్యం చేస్తున్నారు : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ పవర్ పాయింట్ ప్రజంటేషన్

హైదరాబాద్ : రాష్ట్రంలో కెసిర్ ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క యూనిట్ విద్యుత్ కూడా అదనంగా ఉత్పత్తి చేయలేదని, అలాంటిది తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రమని పత్రికల్లో పెద్ద ప్రకటనలు ఇచ్చుకోవడం సిగ్గు చేటు అని టిపిసిసి అధ్యక్షులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ప్రైవేటు కం పెనీల నుండి కొనుగోలు చేస్తున్న విద్యుత్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఉత్పత్తి చేస్తున్నట్లుగా లెక్కలు చూపుకోవడం ఘోరమన్నా రు. వచ్చే రెండేళ్ళలో కూడా కెసిఆర్ ప్రారంభించిన యాదాద్రి, భద్రాద్రి పూర్తికావని, దీంతో ఎత్తిపోతల పథకాలు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పేరుతో కమీషన్‌ల కోసం ప్రైవేటు కంపెనీల నుండే విద్యుత్‌ను కొంటారని, అందుకే జెన్‌కోను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. యుపిఎ పదేళ్ళ హాయంలోనే దేశంలో అదనంగా లక్ష మెగావాట్ల ఉత్పిత్తి పెంచారని, ఫలితంగానే ప్రస్తుతం మిగులు విద్యుత్ అందుబాటులోకి రావడంతో రైతులకు 24 గంటల విద్యుత్ సాధ్యమైందన్నారు. గాంధీభవన్‌లో “కరెంటుపై కెసిఆర్ అబద్ధాలు విద్యుత్ వాస్తవాలు’ అనే పేరుతో విద్యుత్ శాఖ మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్ష నాయకులు మహ్మద్ అలీ షబ్బీర్, టిపిసిసి ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌లు బుధవారం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు సంబంధించిన విద్యుత్ అంశం గురించి ఇతర రాష్ట్రాల పత్రికలకు యాడ్స్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. కేవలం తన స్వంత ప్రచారం కోసమే కోట్లాది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ యాడ్‌లు ఇచ్చుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన కాంగ్రెస్ ప్రారంభించిన భూపాలపల్లి, జైపూర్, జూరాల, పులిచింతల వంటి విద్యుత్ ప్లాంట్‌ల నుండే కొత్తగా విద్యుత్ ఉత్పత్తి అవుతోందని, అలాగే ప్రైవేటు నుండి వస్తున్న సోలార్ విద్యుత్ అందుబాటులోకి వచ్చిందని, వీటితో పాటు ప్రైవేటు కంపెనీల నుండి ఎక్కువకు కొనుగోలు చేసిన విద్యుత్‌ను కలుపుకొని తాము విద్యుత్ మిగులు రాష్ట్రమని కెసిఆర్ చెప్పుకోవడం దారుణమన్నారు. ఛత్తీస్‌ఘడ్ నుండి తెస్తున్న విద్యుత్‌లో పెద్ద కుంభకోణం దాగి ఉందన్నారు. అలాగే ఉద్యమ సమయంలో కడతామన్న పిట్–హెడ్ (గనుల వద్దే) పవర్ ప్లాంట్ ఎక్కడున్నాయని ప్రశ్నించారు.రెండేళ్ళలో లోపు పూర్తి చేస్తానని శాసనసభలో స్వయంగా ప్రకటించిన యాదాద్రి పవర్ ప్రాజెక్ట్‌లో మూడేళ్ళవుతున్నా తట్టెడు మట్టి ఎత్తలేదన్నారు. అలాగే భద్రాద్రిలోని కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ పవర్ ప్లాంట్‌ను కూడా పూర్తి చేయలేకపోయారని, కెసిఆర్ ప్రారంభించిన ఈ రెండూ 2020 వరకు కూడా పూర్తి కాబోవని చెప్పారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో భద్రాద్రిలోని హిందూజ సబ్ క్రిటికల్ టెక్నాలజీని అమ్మేందుకు చూడగా వద్దన్నామని, అలాంటి దాన్ని కోట్లు దండుకునేందుకే అనుమతించారని అన్నారు. మరోవైపు ప్రభుత్వరంగంలో ఉన్న జెన్‌కోను క్రమంగా నిర్వీర్యం చేస్తున్నారని, అందుకే 2014లో 80 శాతం ఉన్న జెన్‌కో ఉత్పత్తిని 65 శాతానికి తగ్గించారని ఆరోపించారు. అలాగే ఎన్‌టిపిసి అవసరమైన నీరు, భూమి ఇస్తే వెంటనే ప్రాజెక్టును పూర్తి చేసి 3వేల మెగావాటల విద్యుత్ ఇస్తామన్న చెప్పినా కూడా మూడున్నరేళ్ళలో 800 మెగావాట్ల ఉత్పత్తికి మాత్రమే అవసరమైన వనరులు సమకూర్చారని అన్నారు. ఇదిచివరకు విద్యుత్ లేదంటూ అడ్డగోలుగా ప్రైవేటు విద్యుత్ కేంద్రాల నుండి విద్యుత్ కొనుగోలు చేస్తారని చెప్పారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో తొలుత షబ్బీర్ అలీ మాట్లాడుతూ విద్యుత్ విషయంలో సిఎం కెసిఆర్ అన్ని అబద్ధాలే చెబుతున్నాడని అన్నారు. మూడున్నరేళ్ళలో 6వేల మెగావాట్ల నుండి విద్యుత్ 14వేల మెగావాట్లు ఎలా పెరిగిందో సిఎం కెసిఆర్ చెప్పాలని అన్నారు. అలాగే వచ్చే రెండేళ్ళలో 14వేల మెగావాట్లను ఎలా ఉత్పత్తి చేసి 28వేల మెగావాట్ల లక్షాన్ని చేరుకుంటారని ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత అదనంగా ఉత్పత్తి అయిన 8340 మెగావాట్ల విద్యుత్‌లో కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టుల ద్వారానే 3,840 మెగావాట్లు వచ్చాయని, అలాగే 3వేలమెగావాట్లు సోలార్ పవర్ నుండి వచ్చాయన్నారు.మిగతాదంతా ప్రైవేటు కంపెనీల నుండి ఇష్టమొచ్చిన ధరలకు కొంటున్నారని, దీంతో ప్రజలపై భవిష్యత్తులో భారీ భారం పడుతుందన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా 9 శాతం వృద్ధి రేటుతో ముందుకుపోతున్న నేపథ్యంలో నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ పారిశ్రామిక, వ్యవసాయ అవసరాల కోసం 1.50 లక్ష మెగావాట్ల విద్యుత్ అదనపు విద్యుత్ అవసరమవుతుందని, ఆనాడే ప్రణాళికలు రచించి, ప్రాజెక్టులకు అనుమతులిచ్చారని గుర్తు చేశారు.
ప్రజలపై పెనుభారం- దాసోజు: దేశంలో 1950లో 2వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నుండి 2015 నాటికి 2.84లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలు వేసిన పునాధే కారణమని దాసోజు శ్రవణ్ చెప్పారు. కాంగ్రెస్ కట్టిన ఇంట్లో దొడ్డిదారిలో గృహ ప్రవేశం చేసిన కెసిఆర్ తానే విద్యుత్‌ను తీసుకువచ్చినట్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఛత్తీస్‌ఘడ్ విద్యుత్ ఒప్పందంతో ప్రజలే ఏటా రూ.1500 కోట్ల భారం పడుతోందని, మార్కెట్‌లో రూ.3.50కే యూనిట్ దొరుకుతుంటే అక్కడి నుండి రూ.6 ఖర్చుతో 500 యూనిట్లే తెప్పించుకుంటున్నా వెయ్యి యూనిట్‌లకు డబ్బులు కడుతున్నామన్నారు. దీనిని వ్యతిరేకించిన ఇందన శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌ను ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేశారన్నారు.అలాగే ప్రైవేటు కంపెనీల నుండి అడ్డగోలు ధరకు కొనుగోలు చేయడం ద్వారా రూ.1,126 కోట్లు చెల్లించారని, దీని వెనుక అక్రమాలు ఉన్నాయన్నారు.గతంలో థర్మల్ పవర్ టెక్ సంస్థతో రూ.3.58 కే యూనిట్ కొనుగోలు చేస్తే తెలంగాణ వచ్చాక రూ.4.15కు కొనుగోలు ఒప్పందం చేసుకున్నారన్నారు. టెలిస్కోపిక్ విధానం నుండి నాన్ టెలిస్కోపిక్ విధానంలో బిల్లులను మారుస్తూ సామాన్యులపై పరోక్షంగా పెను భారం మోపుతున్నారని తెలిపారు. 101 యూనిట్లు వాడే వినియోగదారుడికి గతంలో రూ.232 బిల్లు వస్తే ఇప్పుడు రూ.384 బిల్లు వస్తుందని, 201 యూనిట్లు వాడితే రూ.655 బిల్లు వస్తే, ఇప్పుడు 1067 బిల్లు వస్తోందని, అంటే నెలకు రూ.412 అదనంగా కట్టాల్సి వస్తుందని వివరించారు. మాటిచ్చిన ప్రకారం కాంట్రాక్టు కార్మికులకు రెగ్యులరైజేషన్ కాలేదని, ఇపిఎఫ్, ఇఎస్‌ఐకి కూడా వాళ్ళ జీతం నుండే కట్ చేస్తున్నారని దాసోజు తెలిపారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ కారణంగా విద్యుత్ ఖర్చు విపరీతంగా పెరుగుతోందని, సగటున ఎకరానికి రూ.80వేలు వ్యయం అవుతుందని చెపాపరు. ప్రాజెక్టుపై పెట్టుబడి ఖర్చులు కలుపుకుంటూ సాగుకు మొత్తం ఖర్చు ఎకరానికి రూ.1.35వేలు అవుతుందని చెప్పారు. మొత్తం గంటన్నర పాటు సాగిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో దాసోజు 1950లో విద్యుత్ పరిస్థితి నుండి ప్రస్తుతం మిగులు విద్యుత్ వచ్చిన కారణాలు లెక్కలతో సహా వివరించి ఆకట్టుకున్నారు. అలాగే ప్రాజెక్టు వారీగా ఉత్పత్తి అవుతున్న విద్యుత్, ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్న మొత్తాన్ని కూడా సవివరంగా చెప్పారు.