Home ఆఫ్ బీట్ పూల పాన్పు సొబగులు…

పూల పాన్పు సొబగులు…

Valley of Flowers, Uttarakhand tourist place

పెరటిలో ప్రేమగా పెట్టిన మొక్క మొగ్గ తొడిగితే.. ఓ ఆనందం. ఎన్ని రోజులైనా విచ్చుకోకుండా బెట్టు చేస్తున్న మొగ్గను చూస్తే నిరుత్సాహం. ఓ రోజు ఉదయం.. బద్దకంగా ఒళ్లువిరుస్తూ.. భారంగా నడుస్తుంటే.. ఏదో పరిమళం వెనక్కి పిలుస్తుంది.
చూస్తే.. తాజాగా విరిసిన విరిబాల!! మనసు పరవశిస్తుంది. ఒక్క పువ్వుకే ఇలా పొంగిపోతే ఎలా? అన్ని దారుల వెంటా.. పూలబారులుంటే! గిరులన్నీ పూచిన మోదుగ చెట్లలా దర్శనమిస్తే! లోయలన్నీ పూలపాన్పును తలపిస్తే..!! ఇంతటి సౌందర్యం ఉందంటే.. చూడడానికి ఎక్కడికైనా వెళ్లిపోతామంటారా? అయితే ఎందుకాలస్యం ప్రయాణం మొదలుపెట్టండి.

వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, ఉత్తరాఖండ్
పర్యాటక అభిరుచి, ప్రకృతిపై ప్రేమ ఉన్న వ్యక్తికి ఇష్టమైన తొలి పది విహార కేంద్రాల్లో ఉత్తరాఖండ్‌లోని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ తప్పకుండా ఉంటుంది. బదరీనాథ్ క్షేత్రానికి 25 కిలోమీటర్ల దిగువన… సముద్రమట్టానికి 3,658 మీటర్ల ఎత్తున ఉన్న పూల లోయ ఇది. 1982లో దీనిని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించారు. అంతేకాదు యునెస్కో గుర్తింపు కూడా పొందింది. సుమారు 87 చదరపు కి.మీ విస్తరించి ఉన్న ఈ భారీ ఉద్యానవనాన్ని నది రెండుగా విభజిస్తుంది. నదీపాయకు రెండు వైపులా ఆకాశాన్నంటే పర్వతాలుంటాయి. ఏడాదంతా మంచులో ముడుచుకున్న కొండలు.. జూన్ వచ్చేనాటికి ఒళ్లంతా పూలు తురుముకొని.. పిల్లగాలితో ఇచ్చికాలాడుతూ పర్యాటకులను మరోలోకానికి తీసుకెళ్తాయి. 520 రకాల కుసుమాలు వివిధ రంగుల్లో, విభిన్న ఆకృతుల్లో వికసించి విస్తుపోయేలా చేస్తాయి. బంగారు రంగులో లిల్లీ, పొద్దుతిరుగుడు పూలను మరిపించే హిమాలయన్ డేజీ, అరుదైన పుష్పాలుగా చెప్పే బ్రహ్మకమలాలు.. ఇలా ఎన్నెన్నో పూలు లోయంతా పరుచుకొని.. పర్యాటకుల కోసం కాచుకొని ఎదురు చూస్తుంటాయి.

పూబాటలో నడక
జూన్ రెండో వారం నుంచి మొదలయ్యే పూలవసంతం ఆక్టోబర్ వరకు కొనసాగుతుంది. 75 ఏళ్లు పైబడిన వృద్ధులు, ఆరేళ్లు దాటని చిన్నారులను లోయలోకి అనుమతించరు. పూలలోయ రుషీకేశ్ నుంచి 320 కి.మీ దూరంలో ఉంటుంది. గోవిందఘాట్ వరకు బస్సులో, ట్యాక్సీలో వెళ్లొచ్చు. గోవిందఘాట్ నుంచి 13 కిలోమీటర్లు కొండలు, లోయల గుండా ట్రెక్కింగ్ చేస్తే గంగారియా బేస్ క్యాంప్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి నాలుగైదు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. లోయలో పూల సొగసులు చూడడానికి మరో పది, పదిహేను కిలోమీటర్ల వరకు తిరగాల్సి వస్తుంది. ఎంత నడిచినా.. వేవేల వర్ణాల పూలు, వాటి మీదుగా వీచే గాలి పరిమళం అలసటను దరిచేరనీయవు.

ఎలా చేరుకోవాలి?
ముందుగాఢిల్లీ చేరుకోవాలి. అక్కడి నుంచి రుషీకేశ్‌కు బస్సులు, రైళ్లు, ప్రైవేట్ ట్యాక్సీల్లో వెళ్లొచ్చు.
సమీపంలో బదరీనాథ్ క్షేత్రం (25 కి.మీ), రుద్రప్రయాగ (131 కి.మీ, ఇక్కడి నుంచి దేవప్రయాగ 65 కి.మీ), హేమకుండ్ (4 కి.మీ), సాహిబ్ గురుద్వార (4 కి.మీ)

పలు ట్రావెల్ సంస్థలు, హిమాలయాస్ హెవెన్ అడ్వెంచర్ వంటి ట్రావెల్ క్లబ్‌లు రుషీకేశ్ నుంచి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌కి ప్యాకేజీలు
నిర్వహిస్తున్నాయి.రుషీకేశ్ నుంచి ఐదు రోజుల ప్యాకేజీకి సుమారు రూ.7,500- రూ.12,000 (ఒక్కొక్కరికి) వసూలు చేస్తున్నారు.

పుష్పాంజలి నాగాలాండ్
నాగాలాండ్, మణిపూర్ సరిహద్దులో ఉంటుంది జుకోవు పూలలోయ. వసంతం వెళ్లిపోయాక కూడా ఇక్కడ పూల సందడి తగ్గదు. ఎత్తుపల్లాల లోయల్లో రంగురంగుల కార్పెట్లు పరచినట్టు అనిపిస్తుంది. ఈ పూలలో జుకోవు లిల్లీ ప్రధాన ఆకర్షణ. జులై ద్వితీయార్థంలో లోయంతా పూలతో కళకళలాడుతుంటుంది. నాగాలాండ్ రాజధాని కోహిమా నుంచి 25 కిలోమీటర్లు ప్రయాణిస్తే జువోవు చేరుకోవచ్చు. జఖామా, విశ్వేమా గ్రామాల నుంచి లోయలోకి ప్రవేశించవచ్చు. కోహిమా నుంచి జఖామా 16 కి.మీ, విశ్వేమా 23 కి.మీ ఉంటుంది. రెండు గ్రామాల నుంచి కాలినడకన లోయ దాకా వెళ్లాలి.

ఎలా వెళ్లాలంటే: కోహిమాకు దగ్గర్లో ఉన్న విమానాశ్రయం డిమాపూర్. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం నుంచి కోల్‌కతా చేరుకుంటే.. అక్కడి నుంచి డిమాపూర్‌కు విమానంలో వెళ్లొచ్చు. డిమాపూర్ నుంచి కోహిమాకు 68 కి.మీ దూరం. ట్యాక్సీలు, బస్సుల్లో వెళ్లొచ్చు. విజయవాడ, విశాఖపట్టణం నుంచి డిమాపూర్‌కు రైళ్లు (వీక్లీ) అందుబాటులో ఉన్నాయి.
వసంతం ఎప్పుడో వెళ్లిపోయిందిగా.. ఇప్పుడు పూలు, పరిమళాలు ఏంటి? అంటారా! ఏడాదంతా మంచుతో వణికిపోయే గిరులకు ఇప్పుడు మంచి తరుణం వచ్చేసింది. దేశమంతా రుతుపవనాలు విస్తరిస్తున్న వేళ.. అక్కడ లోయల్లో విరివనాలు విస్తరిస్తాయి. గుట్టలన్నీ బుట్టలకొద్ది పూలు కుమ్మరించినట్టు కనిపిస్తాయి. ఉత్తరాఖండ్‌లోని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, నాగాలాండ్‌లోని జుకోవు, సిక్కింలోని యమ్‌తంగ్ లోయలు పూలతో పులకించిపోతుంటాయి. పడమటి కనుమల్లోని కాస్ మైదానం ఈ సీజన్‌లో గులాబి రేకులు పరుచుకున్న పూదోటను తలపిస్తుంది. మన దగ్గర అరకులోయ కూడా పూలతో మురిపిస్తుంది. పసుపు వర్ణంలో మెరిసిపోయే అరకు అందాలు నవంబర్-డిసెంబర్ నెలల్లో దర్శనమిస్తాయి.

పచ్చని పశ్చిమం కాస్, మహారాష్ట్ర పడమటి కనుమల్లో మిలియన్ పూల వనం మహారాష్ట్రలోని కాస్ మైదానంలో చూడొచ్చు. ప్రతి ఏడాది ఆగస్ట్-సెప్టెంబర్ నెలల్లో ఈ నేలలో రంగురంగుల పూలు పుట్టుకొస్తాయి. చుట్టూ ఎత్తయిన పర్వతాలు.. మధ్యలో విశాలమైన మైదానం. అందులో 600 రకాల మొక్కలు. కిలోమీటర్ల కొద్దీ విస్తరించి ఉంటాయి. ప్రతి కొమ్మ రెమ్మరెమ్మకు పూలు.. ఆ పూల చుట్టూ గింగిరాలు కొడుతూ.. మకరందాన్ని అందుకునే భ్రమరాలు.. ఇలా ఆ ప్రాంతమంతా సుందరంగా ఉంటుంది. ఎక్కడా కనిపించని 40 రకాల మొక్కలు ఇక్కడ పుష్పించడం విశేషం. అందుకే కాస్ మైదానం యునెస్కో జీవవైవిధ్య కేంద్రంగా గుర్తింపు పొందింది. ఏటా ఆగస్టు వచ్చిందంటే చాలు ముంబైకర్లు, పుణెవాసులు చలో కాస్ అంటారు. వానలు తెచ్చిన చల్లదనంలో మురిసిపోతూ కాస్ బాట పడతారు. నీలిమేఘాల నీడలో విరివన విహారం చేస్తారు. పూలను తాకరాదు, కోయరాదు. అయినా.. గంపెడు మధురానుభూతులతో తిరుగుప్రయాణం అవుతారు.
ఎలా వెళ్లాలి?
పుణె నుంచి కాస్ మైదానం 135 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్టణం నుంచి పుణెకు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి బస్సులు కూడా ఉన్నాయి. ముందుగా పుణె చేరుకొని అక్కడి నుంచి బస్సులు, ప్రైవేట్ ట్యాక్సీల్లో సతారా మీదుగా కాస్ చేరుకోవచ్చు. సతారా నుంచి కాస్ 23 కి.మీ దూరంలో ఉంటుంది.
సుమగిరి సొగసులు

యమ్‌తంగ్, సిక్కిం
కొండలు, కోనలు, లోయలతో అలరించే ఈశాన్య రాష్ట్రాల్లో సిక్కిం ఒకటి. ఈ రాష్ట్ర రాజధాని గ్యాంగ్‌టక్‌కు సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది యమ్‌తంగ్ లోయ. సముద్ర మట్టానికి 11,800 అడుగుల ఎత్తులో ఉన్న లోయలో యమ్‌తంగ్ నది గలగల కదిలిపోతుంటుంది. నదికి అటూ ఇటూ.. అందమైన పూలవనం కనిపిస్తుంది. రకరకాల మొక్కలు. వాటికి రంగురంగుల మొగ్గలు. గన్నేరు రకానికి చెందిన బోలెడన్ని మొక్కలు దర్శనమిస్తాయి. జులై ద్వితీయార్థం వరకు వీటిని వీక్షించవచ్చు. జూన్-జులై నెలల్లో సుమగిరి సొగసులు చూసేందుకు పర్యాటకులు క్యూ కడితే.. సెప్టెంబర్-డిసెంబర్ మాసాల్లో హిమగిరి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి వెళ్తుంటారు. లోయ సమీపంలో జలపాతాలు అదనపు ఆనందాన్ని అందిస్తాయి. ఇక్కడికి 16 కిలోమీటర్ల దూరంలో సముద్రమట్టానికి సుమారు 15400 అడుగుల ఎత్తులో ఉన్న జీరో పాయింట్ మరో ఆకర్షణ.
ఎలా వెళ్లాలంటే: సికింద్రాబాద్, విశాఖ, విజయవాడ నుంచి న్యూ జల్పాయీగురికి రైళ్లు (వీక్లీ) అందుబాటులో ఉన్నాయి. ఇక్కడి నుంచి లాచుంగ్ మీదుగా యమ్‌తంగ్ లోయకు (217 కి.మీ) ట్యాక్సీలో చేరుకోవచ్చు.
* లాచుంగ్ సమీపంలో బాగ్‌డోగ్రా విమానాశ్రయం ఉంది. కోల్‌కతా నుంచి విమానంలో బాగ్‌డోగ్రాకు వెళ్లాలి. ఇక్కడి నుంచి లాచుంగ్ మీదుగా బస్సులో గానీ, ట్యాక్సీలో గానీ యమ్‌తంగ్ (220 కి.మీ) చేరుకోవచ్చు?