Home లైఫ్ స్టైల్ శ్రావణ రుచులు

శ్రావణ రుచులు

Various starchs are offered as offerings by God

శ్రావణమాసం అనగానే నోములు, వ్రతాలు, పూజలు గుర్తొస్తాయి. పట్టుచీరలు, నగలను అలంకరించుకుని మహిళలు శోభిల్లుతుంటారు. వాయినాలు ఇచ్చిపుచ్చుకోవడాలలో చాలా బిజీగా ఉంటారు. వాటితోపాటు అమ్మవారికి రకరకాల పిండివంటలను నైవేద్యంగా సమర్పిస్తుంటారు. 

నవరత్న పులిహోరకావల్సిన

పదార్థాలు : వండిన అన్నం- 5 కప్పులు, పెసలు, బొబ్బర్లు, పల్లీలు, జొన్నలు, బఠాణీలు, సజ్జలు, కాబూలీ శెనగలు, రాజ్మా లేదా సోయా ఒక్కొక్కటీ పావు కప్పు చొప్పున తీసుకోవాలి.
ఎండుమిర్చి 2 , మినపప్పు 4, ఆవాలు -టీస్పూన్, జీలకర్ర -అరటీ స్పూన్, పచ్చి శనగపప్పు -టీ స్పూన్,
కరివేపాకు -మూడు రెబ్బలు, నూనె -5 టీ స్పూన్లు, ఉప్పు- తగినంత ,నిమ్మరసం- రెండు టేబుల్ స్పూన్లు.

తయారుచేసే విధానం : అన్నంలో కొద్దిగా నూనె, పసుపు వేసి పొడిపొడిగా అయ్యేలా ఉంచాలి. గింజలన్నింటినీ రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే ఉడికించి ఉంచాలి. బాణలిలో నూనె వేసి కాగాక ఎండు మిర్చి, పచ్చి శెనగపప్పు, మినపప్పు, ఆవాలు,జీలకర్ర, కరివేపాకు వేసి తాలింపు చేయాలి. అందులోనే చీల్చిన పచ్చిమిర్చి కూడా వేసి వేయించాలి. ఇప్పుడు ఉడికించిన గింజల్ని కూడావేసి ఓ నిముషం వేయించాలి. తర్వాత వండిన అన్నం కూడా అందులోనే వేసి కలిపి దించాలి. చివరగా ఉప్పు నిమ్మరసం కలపాలి.

చక్కెర పొంగలి 

కావల్సిన పదార్థాలు : బియ్యం- గ్లాసు, పాలు- రెండు గ్లాసులు, పెసరపప్పు- అరగ్లాసు, పచ్చి కొబ్బరిముక్కలు -కప్పు, జీడిపప్పు- పది పలుకులు, నెయ్యి -తగినంత.

తయారుచేసే విధానం : బియ్యం పెసరపప్పు విడివిడిగా వేయించాలి. మూడు గ్లాసుల నీళ్లు, పాలు పోసి ఉడికించాలి. విడిగా నెయ్యిలో జీడిపప్పు, కొబ్బరి వేయించాలి. పప్పు బియ్యం ఉడికిన తర్వాత పంచదార వేసి 5నిముషాలు ఉడికించాలి. తర్వాత జీడిపప్పు, కొబ్బరి వేసి కలిపి దించాలి.

పూర్ణం బూరెలు

కావల్సిన పదార్థాలు :  శనగపప్పు – ఒక కప్పు, పచ్చి కొబ్బరి తురుము – కప్పు, బియ్యం 2 కప్పులు, పంచదార – ఒకటిన్నర కప్పు, మినపప్పు – కప్పు, ఏలకులు -6, నూనె – తగినంత.

తయారుచేసే విధానం :  శనగపప్పు రెండు గంటలపాటు నానబెట్టాలి. నీళ్లు వడకట్టి రుబ్బాలి. ఈ పిండిని ఇడ్లీ ప్లేట్లలో వేసి ఆవిరి మీద ఉడికించాలి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పంచదార, ఏలకుల పొడి, కొబ్బరి తురుము వేసి కలిపి చిన్న చిన్న ఉండలు చేయాలి. రెండు గంటల సేపు నానబెట్టిన బియ్యం, మినపప్పు కలిపి మెత్తగా రుబ్బాలి. ఈ పిండిలో శనగపప్పు ఉండను ముంచి కాగుతున్న నూనెలో వేసి బంగారు వర్ణం వచ్చే వరకు వేయిచి తీయాలి.

 అటుకుల పాయసం

కావల్సిన పదార్థాలు : అటుకులు -ఒక కప్పు,
పాలు -ఒక లీటరు, పంచదార -ఒక కప్పు,
కిస్మిస్- పది, కుంకుమ పువ్వు- కొద్దిగా ,
పిస్తాపప్పు- 5
ఏలకుల పొడి- అర టీస్పూన్.
తయారుచేసే విధానం : అటుకుల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. పాలు స్టవ్ మీద ఉంచి మరగనివ్వాలి.
అటుకులు అందులో వేసి కలుపుతూ ఉండాలి. సరిపడా చిక్కబడ్డాక మిశ్రమంలో పంచదార వేసి కరగనివ్వాలి. కిస్మిస్‌లు,పిస్తా పప్పులు, ఏలకుల పొడి వేసి బాగా కలిపి, స్టవ్ మీద నుంచి దించాలి.