Home ఎడిటోరియల్ స్వాతంత్య్రోద్యమ దశలు

స్వాతంత్య్రోద్యమ దశలు

Vasco da Gama started his first voyage to India

క్రీ .పూ 3000 సంవత్సరంలోనే ఉనికిలో ఉన్న అంత్యంత ప్రాచీన నాగరికతల్లో ఒకటైన సింధు నాగరికత భారతీయ చరిత్రకు మూలం. ఇతర నాగరికతలవలె కాక,ఒక క్రమానుగత ప్రగతి అనగా నవీన శిలాయుగం నుంచి రాతి యుగానికి, అక్కడి నుంచి కంచు యుగానికి పరిణామం చెందిన భారతీయ ప్రాచీనత సింధు నాగరికతలో కనబడుతుంది. అతి పెద్ద నాగరికతగా శాంతియుత సహజీవనానికి కారణమై భారతదేశపు ముఖ్య లక్షణమైన భిన్నత్వంలో ఏకత్వం ఏర్పడడానికి ఇది దారి తీసింది.ఈ కాలంలోనే వ్యవసాయంతో భారత భూమి సుభిక్షంగా వర్ధిల్లడమే గాక,చేతి వృత్తులు, నౌకా రవాణా ద్వారా విదేశీ వ్యాపారాన్ని విస్తృతంగా చేపట్టడం జరిగింది. ఈజిప్టు, గ్రీస్ మొదలైన దేశాలతో వర్తక వాణిజ్యాలు జరిగేవి.
భారతదేశ గతిని మార్చేసిన సంఘటన క్రీ.శ 1498 లో జరిగింది.పోర్చుగీసు వర్తకుడైన వాస్కోడిగామా భారతదేశానికి సముద్రయానాన్ని కనుగొనడంతో,వర్తక వాణిజ్యాల కోసం విదేశీ వర్తకులు ఇక్కడ అడుగుపెట్టారు. పోర్చుగీసు వారు ముందుగా పశ్చిమ తీరాన కల కాలికట్ చేరుకొని అక్కడి రాజు జామోరిన్ తో వర్తక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆ తరువాత డచ్ దేశస్థులు,ఫ్రెంచ్ వర్తకులు,బ్రిటీష్ వారు భారత భూభాగంలోకి అడుగుపెట్టారు. 1707- 1857 కాలంలో మొగల్ వంశ పాలకుల అసమర్థత,వారసత్వ యుద్ధాలు,చిన్న రాజ్యాలు ఎక్కువగా ఉండడం,అంతర్గత తిరుగుబాట్లు ,స్వార్ధబుద్ధి,దూరదృష్టి భారతీయ రాజ్యాల మధ్య ఐక్యత లేకపోవడం వలన క్రమంగా ఆంగ్లేయులు అధికారిక పట్టు సాధించుకున్నారు.ఆయా కారణాల వల్ల చివరికి బ్రిటిష్ వారికి భారత దేశ వర్తకంపై గుత్తాధిపత్యం కలిగింది. కొన్ని భారతీయ శక్తులు వారికి సహాయపడడంతో వారి పని సులువైంది.
ఆంగ్లేయుల వలస దశలను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. మొదటి దశ 1757 -1813. మధ్యలో ఇంగ్లాండ్ పరిశ్రమలకు అవసరమయ్యే ముడి సరుకుల దోపిడీకి ప్రాధాన్యం కలిగి ఉంది. ఇందుకు వ్యాపార పంటల విధానాన్ని ప్రవేశపెట్టారు. జమీందారీ, మహల్వారి లాంటి పద్దతుల ద్వారా రైతులను దోచుకొన్నారు. రెండవ దశ 1813 – 1858 లో భారతదేశాన్ని కేవలం ముడిసరుకులు ఉత్పత్తి చేసే దేశంగానే కాక,తమ ఉత్పత్తులకు మార్కెట్‌గా మార్చారు. ఇంగ్లాండ్‌లో పారిశ్రామిక విప్లవం విజయవంతం అయి న కారణంగా తమ ఉత్పత్తులతో భారత మార్కెట్ ను ముంచెత్తారు.
ఒక వైపు స్వదేశీ పరిశ్రమలను దెబ్బతీస్తూ,తన అవసరాలకు అనుగుణంగా ఆధునిక పరిశ్రమలను,మౌలిక సదుపాయాలను(రైల్వే, టెలిగ్రామ్, రోడ్డు సదుపాయాలు, పత్రికలు)ప్రవేశ పెట్టారు. 1858 తరువాతిది మూడవ దశ. ఈ దశలో భారత వ్యవసాయం,చేతి వృత్తులు పూర్తిగా అణిచివేతకు గురి కాబడ్డాయి.పేదరికం,నిరుద్యోగం ప్రబలి రైతులు,వర్తకులు,చేతి వృత్తుల వారు వీధిన పడ్డారు.స్వేచ్ఛ సమానత్వాలు అందని ద్రాక్షలయి ఆంగ్లేయులకు బానిసలుగా మారారు.ఇందులో విద్యా వంతులూ ఉన్నారు.ఈ బానిస సంకెళ్ళ నుండే ఆత్మ గౌరవం అనే నినాదం పురుడు పోసుకుని ఎంతో మంది యువకులకు,సంఘ సంస్కర్తల పోరాటానికి నాంది పలికింది.దానికి తోడు ఆంగ్లేయులు తమ అవసరాల కోసం ఏర్పరుచుకున్న ఆంగ్ల విద్య బోధన, రోడ్డు, రైలు సదుపాయాలు, వార్తాపత్రికలను స్వాతంత్ర యోధులు వారి పోరాటానికి ఉపయోగించుకున్నారు. 1857 తిరుగుబాటు భారత దేశ మొదటి స్వాతం త్య్ర పోరాటం. బ్రిటీష్ సైన్యంలో ఎక్కువ శాతం భారతీయులే.
భారతీయులలో హిందువులకు గోవు పవిత్ర జంతువు,ముస్లిం లకు పంది అతి జుగుత్సాకర జంతువు.పంది కొవ్వు,ఆవు మాంసంతో తయారు చేసిన ఒక పదార్థాన్ని తూటాల వాడకంలో బ్రిటిష్ వారు ఉపయోగించారు. దానిని భారతీయ సైనికులు వ్యతిరేకించారు. వాడాలని ఆదేశించిన బ్రిటీష్ అధికారిని మంగళ్ పాండే అనే సైనికుడు కాల్చి చంపి తిరుగుబాటుకు నాంది పలికాడు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో మూడు కీలకమైన దశలు.అవి మితవాద (1885 – 1905 ), అతివాద (1905 -1920 ), గాంధీ యుగాలు (1920 -1947 ). మితవాదులు ప్రార్థన, అభ్యర్థన, నిరసన అనే ఉపాయాలతో తమ కోర్కెలను సాధించుకోవాలనుకున్నారు. తానొవ్వక నొప్పించకుండా పోరాటం సాగించిన వారు మితవాదులు.
వీరి శైలి నచ్చని వారు మితవాద నాయకత్వాన్ని రాజకీయ భిక్షకులుగా వర్ణించి, అతివాదులుగా మారి, వీరోచిత పోరాటాలే స్వాతంత్య్రాన్ని కట్టబెడతాయని నమ్మారు. నిర్ణయాత్మక ప్రతిఘటనతో తిలక్, అరవింద్ ఘోష్ వంటి వారు కదం తొక్కారు. విదేశీ వస్తువుల బహిష్కరణ నినాదంతో వీరి పోరాటం సాగింది. గాంధీ 1914లో ఇంగ్లాండ్ నుండి భారతదేశానికి రావడంతో స్వాతంత్య్ర పోరాటం కొత్త పుంతలు తొక్కింది. ముందు పోరాట దశలకు, ఈ దశకు ఉన్న ముఖ్యమైన తేడా ప్రజలు స్వాతంత్య్ర పోరాటంలో మిళితం కావడమే. సహాయ నిరాకరణోద్యమం, శాసన ఉల్లంఘన, క్విట్ ఇండియా ద్వారా గాంధీ శాంతితో బ్రిటీష్ వారిని ముప్పు తిప్పలు పెట్టగా, మన్యం పులి అల్లూరి, యువ మహాజ్వాల భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్‌లు బ్రిటీష్ ప్రభుత్వానికి కునుకు లేకుండా చేశారు. చివరికి భారత జాతి వీరుల పోరాటాన్ని ఆపలేమని గ్రహించిన బ్రిటీష్ ప్రభుత్వం స్వాతంత్య్రం ఇస్తున్నామని ప్రకటించింది. ఉన్న సంస్థానాలను ఇటు భారత దేశంలో నైనా,అటు పాకిస్థాన్‌లోనైనా, లేదంటే స్వతంత్ర రాజ్యాలుగానైనా ఉండవచ్చని రూల్ తీసుకు వచ్చింది. ఈ విధంగా 1947 ఆగస్టు 15 న ఇండియా స్వతంత్ర దేశమైంది. పంద్రాగస్టు చరిత్ర పటంపై చెరగని ముద్ర వేసింది. ఎందరో పోరాట యోధుల త్యాగాల ఫలాలు భవిష్యత్తు తరాలకు స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను అందించాయి.ఈ రోజున భారతీయులు అనుభవిస్తున్న రాజ్యాంగ హక్కులు ఆనాటి దేశ భక్తుల త్యాగాలకు ప్రతిరూపం. స్వేచ్ఛ సమానత్వాలతో ప్రతీ మనిషి జీవించడం ఆ మహానుభావుల కల. ఆ కల నేటికీ కలగానే ఉండడం విచారకరం.పేదరికం,నిరుద్యోగం,మత కుల లింగ వివక్షల వల్ల ఇప్పటికీ కొన్ని వర్గాలు తమ అస్తిత్వం కోసం పోరాటం చేస్తూనే ఉన్నాయి. ఆ నాడు పరదేశీ పాలన నుండి విముక్తి కోసం ఆ యోధులు సమరం సాగించారు. సామాజిక, ఆర్థిక సమానత్వాల కోసం ఈ తరం పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఈ పోరాటంలో ఆనాటి యోధుల సంకల్పాన్ని అణువణువునా పుణికి పుచ్చుకుని ముందడుగేయాల్సిన తరుణమిది. అందరికీ స్వాతంత్య్ర ఫలాలు అంది ప్రతి మనిషీ గౌరవప్రదంగా జీవించాలన్నదే వారి తపన. దాన్ని సుసాధ్యం చేయడమే మనం ఆ యోధులకు ఇచ్చే నిజమైన నివాళి.