Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

కొనలేం… తినలేం

Vegetable prices are falling abruptly

అమాంతం పెరిగిపోయిన కూరగాయల ధరలు
విలవిల్లాడుతున్న సామాన్యులు
దళారులదే ఇష్టారాజ్యం
లారీల బంద్‌తో మరింత పెరగనున్న ధరలు
పట్టించుకోని అధికారులు  

మన తెలంగాణ/భద్రాద్రి కొత్తగూడెం : నిన్న మొన్నటి వరకు ఓ మోస్తరు ధర పలికిన ప్రతీ కూరగాయ ఇప్పుడు ధడ పుట్టించే రేటులో దర్శనమిస్తున్నాయి. ఓ గాయకూరగను ముట్టుకున్నా భగ్గుమంటోంది. ఈ ధరలతో కొందరైతే వాటివైపుకు చూసేందుకు కూడా ధైర్యం చేయడం లేదు. బుట్టపేర్చి అమ్మకానికి పెట్టిన కూరధరలు ఎక్కడో ఆకాశంలో ఉన్నట్లుగా ఉందంటూ ప్రజలు అంటున్నారు. సామాన్య కూలీ నాలి చేసుకునే కుటుంబాల వారు మాంసాహారాలను చూసినట్లు చూస్తున్నారు కూరగాయలను. మధ్య తరగతి కుటుంబాల వారు అయితే కొనేందుకు కొంచెం ఆలోచించి కొంటున్నారు. ఓ మధ్య తరగతి కుటుంబంలో మొత్తం ఆరుగురు సభ్యులుంటే వారికి ఒక పూటకు సుమారు 600 గ్రాముల కూరగాయలు అవసరం పడతాయి. కానీ పెరిగిన ధరలకు భయపడే ఆ కుటుంబం వారు కేవలం అర కిలో మాత్రమే కొనుగోలు చేసి నీళ్ల చారు, పచ్చళ్లు వేసుకుని మమా అని పిస్తున్నారు. మరికొందరైతే పిల్లలకు పెట్టి తల్లిదండ్రులు మాత్రం ఉన్నదాన్ని సర్థుకుని తినేస్తున్నారు.

అమాంతం ఆకాశంవైపునకు :- మొన్నటి వరకు కిలో మిర్చి రూ.40 వరకు ఉండగా ఇప్పుడు అదే మిర్చిని రూ.100 నుండి రూ.120 వరకు అముతున్నారు. కిలో బెండకాయలు రూ.30 ఉండగా ఇప్పుడే అవే కిలో బెండకాయలు 50 ధర పలుకుతోంది. కిలో రూ.40 పలికే కాకరకాయ ధర రూ.80కి చేరువలో ఉంది. క్యారెట్, బీట్ రూట్, గోరిచుక్కుళ్లు, క్యాబేజీ, టమాట, దొండకాయ, వంకాయలు ఇలా అన్ని రకాల కూరగాయల ధరలు గత ధర కంటే రూ. 20 నుండి 25 వరకు పెంచి అమ్ముతున్నారు. అనుకున్న సమయానికి వర్షాలు పడక పోవడంతో కూరగాయల తోటలు ఆశించిన దిగుబడులు ఇవ్వలేదని, అదే విధంగా పదిహేను రోజుల పాటు ఏకధాటిగా కుర్సిన వర్షాలు పూసి పూత, పిందెలను మింగేసింది. దీంతో అడపా దడపా చేతికందిన కూరగాయలను పాత ధరలకే అమ్మితే పెట్టుబడి ఖర్చు కూడా రాదని భావించిన కూరగాయల రైతులు ధరలు పెంచేసినట్లు తెలుస్తోంది.

దళారుల ఇష్టారాజ్యం :- రైతులు మహా పెంచితే కేజికి రూ.5 వరకు ధర పెంచే అవకాశం ఉంది. దీనిని అదునుగా చేసుకున్న దళారులు వారి వద్ద నుండి తక్కువ ధరలకు కొనుగోలు చేసి ఈ దళారులు మాత్రం అధిక ధరలను గుంజుతున్నారు. ఆంధ్రా, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పండే కూరగాయలను ఆయా ప్రాంతాలకు సరఫరా చేసే దళారులు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోంది. మరో ప్రక్క హోల్‌సెల్, రిటైల్ వ్యాపారులు కొద్దిపాటి లాభాలు వేసుకుని మరింత పెంచి అమ్మకాలు చేస్తున్నారు. అందరూ లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ సామాన్యుని జేబులోని డబ్బులు మాత్రం ఐస్ గడ్డలా కరిగిపోతున్నాయి.

నేటి నుంచి మరింత ఇబ్బంది : – పలు సమస్యల డిమాండ్ల సాధన కోసం ట్రాన్స్‌పోర్టు రంగానికి చెందిన లారీల యజమానులు బంద్ పాటిస్తున్నారు. సోమవారం వరకు బంద్‌లో కొన్ని వస్తు రంగాలను మినహా ఇంచారు. కానీ సమస్య పరిష్కారం దిశగా మొగ్గుచూపక పోవడంతో మంగళవారం నాటి నుండి నత్యవసర వస్తువుల సరఫరాను కూడా నిలుపుదల చేయనున్నారు. దీంతో సరుకులు,కూరగాయల రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. కాగా ఆయా రంగాలకు చెందిన వ్యాపారులు ప్రైవేటు ట్రాన్స్‌పోర్టులను ఆశ్రయించి ఆటోలు, టాటా మ్యాజిక్‌లు, జీపులు తదితర వాహనాల్లో కూరగాయలు, ఇతర సరుకులు తెప్పించే పరిస్థితి ఉండటంతో ఖర్చులు కలుపుకుని మరికొద్దిగా ధరలు పెంచి అమ్మే పరిస్థితి ఉంది. దీంతో కూరగాయలతో పాటు, ఇతర వస్తువుల ధరలు సైతం అమాంత పెరిగిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే సామాన్యుని పరిస్థితి ఇబ్బందికరంగా ఉండగా, కూరగాయలు, నిత్యవసరాల సరఫరాను లారీలు ఆపనుండటంతో మూలిగే నక్కపై తాటికాయపడ్డ చందంగా తయారుకానుంది ప్రజల పరిస్థితి.

పట్టించుకోని అధికారులు : – మార్కెట్లో దళారుల రాజ్యం సాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు ఎవరూ దృష్టి సారించడం లేదని వాదన బలంగా ఉంది. నెలనెలా అధికారులకు ముడుపులు చేరుతుండటంతో ఎవరెటు పోతే మాకేంటిలో ఉన్నట్లుగా ఉందంటూ పలువురు అంటున్నారు. సంబంధితశాఖాధికారులకు బుట్టల కొద్ది కూరగాయలు, ఇతర వస్తువులు ఇళ్లకు చేరిపోతుండటంతో ధరల భయం లేదని, ఇక సామాన్యుల బాధలు వారికేమి పడతాయిలే అంటూ పలువురు పెదవి విరుస్తున్నారు.

Comments

comments