Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

వాహన పన్నుబకాయిలపై స్పెషల్ డ్రైవ్

రేపటి నుంచి రంగంలోకి దిగనున్న టాస్క్‌ఫోర్స్ బృందాలు 

ముమ్మరంగా తనిఖీలు
నేరుగా యజమానుల ఇండ్లకు నోటీసులు
పన్నులు చెల్లించకుంటే ఇక వాహనాలు జప్తు

checkingఆదిలాబాద్: జిల్లాలో గత కొన్నేళ్ళ నుండి పేరుకుపోయిన వాహనాల పన్ను బకాయిల వసూళ్ళ కోసం రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు కసరత్తు మొదలు పెట్టబోతోంది. సోమవారం నుండి రవాణా శాఖ అధికారులు విస్తృతంగా పన్ను వసూళ్ళ కోసం తనిఖీలు చేపట్టబోతున్నారు. దీని కోసం గాను జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు కొన్ని మండలాలను ఎంపిక చేసుకొని తమ వద్ద ఉన్న జాబితా ప్రకారం వాహనాల తనిఖీని నిర్వహించబోతున్నాయి. ఆ తర్వాత పన్ను బకాయిదారుల ఇండ్లకు వెళ్ళి ఈ బృందాలు నోటీసులు అందించనున్నాయి. నోటీసులు అందక ముందు పన్ను చెల్లించినట్లైతే బకాయి నుండి 50 శాతం మినహాయింపు నిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

మొదటి రోజు వాహన బకాయిదారులందరికి బహిరంగ హెచ్చరికలు జారీ చేయనున్నారు. 17వ తేదీ నుంచి ఈ ఆపరేషన్‌ను ఉధృతం చేయబోతున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ. 22 కోట్లకు పైగా బకాయిలున్నట్లు అధికారులు నిర్ధారించారు. కొంత మంది కొన్నేళ్ల నుంచి పన్నులు చెల్లించకుండా దర్జాగా వాహనాలను వినియోగిస్తున్నారు. దీంతో రవాణా శాఖను భారీగా ఆదాయం కోల్పోతోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఆలస్యంగా పన్ను బకాయిల వసూళ్ళపై దృష్టి సారించింది. అయితే రవాణా శాఖ అధికారులపై రాజకీయ ఒత్తిళ్ళు కూడా పెరుగుతుండడంతో వారు పన్ను వసూళ్ళకు వెనుకడుగు వేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వమే బకాయిల వసూళ్లపై కొరడా ఝులిపించాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో ఇక రవాణా అధికారులు ఈ దిశగా కఠిన వైఖరి అవలంబించాలని నిర్ణయించారు. దీని కోసం గాను ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌ను రూపొందించారు.

ఈ యాక్షన్ ప్లాన్‌కు అనుగుణంగా ఐదు ప్రత్యేక బృందాలు జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తూ బకాయిదారులను వెంబడించబోతున్నాయి. దాదాపు నెల రోజుల పాటు ఈ స్పెషల్ డ్రైవ్ పకడ్బందీగా కొనసాగించాలని రవాణా శాఖ యోచిస్తోంది. మొదట దీనిపై గ్రామగ్రామాన విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని భావిస్తున్నారు. ఆ తర్వాత హెచ్చరికలు, అనంతరం వాహనాల జప్తు లాంటి కఠిన చర్యలకు ఉపక్రమించనున్నారు. మొత్తానికి రవాణా శాఖ తీసుకోబోతున్న స్పెషల్ డ్రైవ్‌తో ఆ శాఖకు ఆశించిన మేరకు ఆదాయం సమకూరే అవకాశం ఉందంటున్నారు.

Comments

comments