Home జాతీయ వార్తలు యాక్టింగ్ డైరెక్టర్ ఉండరు: ‘సుప్రీం’లో వర్మ వాదన

యాక్టింగ్ డైరెక్టర్ ఉండరు: ‘సుప్రీం’లో వర్మ వాదన

verma

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఎలా ఉండరో సిబిఐకి కూడా తాత్కాలిక డైరెక్టర్ ఉండబోరని సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ గురువారం సుప్రీంకోర్టుకు తెలియచేశారు. తనను కేంద్ర ప్రభుత్వం బలవంతాన సెలవుపై పంపించడాన్ని సవాలు చేస్తూ అలోక్ వర్మ దాఖలు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో గురువారం వాదనలు కొనసాగాయి. వర్మ తరఫున సీనియర న్యాయవాది ఫాలి ఎస్ నారిమన్ వాదనలు వినిపిస్తూ, సిబిఐకి తాత్కాలిక డైరెక్టర్ నియామకాన్ని చట్టం నిర్దేశించలేదని తెలిపారు. ప్రభుత్వం తన అధికారాల మేరకు నడుచుకుందని, సిబిఐ డైరెక్టర్‌గా వర్మ ఇప్పటికీ కొనసాగుతున్నారని, ఆయనను బదిలీ చేయలేదన్న ప్రభుత్వ వాదనను ఆయన తిరస్కరించారు.

అన్ని అధికారాల నుంచి తప్పించిన తర్వాత దాన్ని ‘బదిలీ అనే అంటారు. బదిలీ అంటే కేవలం ఒక స్థానం నుంచి మరో స్థానానికి పంపడం మాత్రమే కాదు..బాధ్యతల నుంచి తప్పించడం కూడా ఉంటుంది, అని వర్మ తరఫు న్యాయవాది ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి తెలియచేశారు. ఈ వాదనతో ధర్మాసనం కూడా ఏకీభవిస్తూ బదిలీని కేవలం భాషాపరమైన అర్థంతోనే చూడకూడదని అభిప్రాయపడింది. సిబిఐ డైరెక్టర్ పదవికున్న ప్రాముఖ్యత కేవలం విజిటింగ్ కార్డుపై రాసుకోవడానికి మాత్రమే పరిమితం కాదని, సెలవుపై పంపించి ఆ తర్వాత ఇంకా ఆయనే డైరెక్టర్ అనడంలో అర్థం లేదని నారిమన్ వ్యాఖ్యానించారు. బంగళా, కార్లు..ఇలా దేనిమీదైనా వాదించనివ్వండి..కాని ఆయన ఇప్పుడు సిబిఐ డైరెక్టర్ మాత్రం కారు, అని నారిమన్ చెప్పారు.

నెల రోజుల క్రితం ఈ పిటిషన్‌పై విచారణ ప్రారంభమైన నాటి నుంచి వర్మ వాదన ఒక్కటే..రెండేళ్ల నిర్ణీత తన పదవీకాల పరిమితిని సెలెక్షన్ కమిటీ అనుమతి లేకుండా కుదించడానికి వీల్లేదు. తనను నియమించే అధికారం ఉన్న సెలెక్షన్ కమిటీకి మాత్రమే తనను బాధ్యతల నుంచి తప్పించే అధికారం ఉంటుందన్నది ఆయన వాదన. సెలెక్షన్ కమిటీలో సభ్యులుగా ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, పార్లమెంట్‌లో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఉంటారు.

సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్థానాల మధ్య ఘర్షణను జూలై నుంచి భరించి రాత్రికి రాత్రే సెలవుపై పంపిస్తూ ఉత్తర్వులను ఎందుకు జారీచేయవలసి వచ్చిందంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ధర్మాసనం ఘాటైన ప్రశ్నలను సంధించింది. అసాధారణ పరిస్థితుల వల్ల అలా చేయవలసి వచ్చిందన్న ప్రభుత్వ వాదనను తోసిపుచ్చుతూ దీనిపై సెలెక్షన్ కమిటీని ఎందుకు సంప్రదించలేదని ధర్మాసనం ప్రశ్నించింది. సిబిఐ డైరెక్టర్‌పై చర్యలు తీసుకునే అధికారం కేవలం సెలెక్షన్ కమిటీకే ఉన్నప్పుడు వారిని బదిలీ చేసే విషయంలో ఎందుకు తొందరపాటు చర్య చేపట్టారని కేంద్రాన్ని నిలదీసింది. పిల్లుల్లా కొట్లాడుకుంటున్న ఇద్దరు సిబిఐ డైరెక్టర్లను నిలువరించడానికి వారిని బదిలీ చేయడమొక్కటే తమకు లభించిన ఏకైక ప్రత్యామ్నాయమని బుధవారం ప్రభుత్వం చేసిన వాదనతో ధర్మాసనం విభేదించింది. సెలెక్షన్ కమిటీని సంప్రదించక పోవడం కన్నా సంప్రదించడమే మంచిది. అది చట్టాన్ని పాటించడమే కాదు.మరింత మెరుగ్గా పాటించడం అవుతుంది. ఒకవేళ అత్యవసరమే అయినప్పటికీ ఏదో ఒక దశలో కమిటీని సంప్రదించడం అవసరం కాదా? అని ధర్మాసనం ప్రశ్నించింది.

Verma Argues there cant be no Acting Director for CBI, Alok Verma says the govt has no power to send him on leave