Home సినిమా దార్శనికుడీ దర్శకరత్న

దార్శనికుడీ దర్శకరత్న

Dasari-Narayana-Rao 1

తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల తర్వాత తప్పకుండా ప్రస్తావించాల్సిన వ్యక్తి దర్శకరత్న దాసరి నారాయణరావు(75). సామాన్యునిగా సినీ రంగంలోకి ప్రవేశించిన దాసరి తన ప్రతిభాపాటవాలతో అసమాన్యునిగా ఎదిగారు. తెలుగు సినిమా రంగంపై తనదైన ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. సినీ దర్శకుడిగా, నిర్మాతగా, మాటల రచయితగా, నటునిగా దాసరి భారత దేశ సినీ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అత్యధిక చిత్రాల దర్శకుడిగా గిన్నిస్ బుక్‌లో స్థానాన్ని సంపాదించుకున్నారు. 151 సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన ప్రతిభా పాటవాలకు గుర్తింపుగా 2 జాతీయ, 9 నంది, 4 ఫిలింఫేర్ అవార్డులు దక్కాయి.
1942 సంవత్సరం మే 4న పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో జన్మించారు దాసరి నారాయణరావు. మహాలక్ష్మి, సాయిరాజ్ ఆయన తల్లిదండ్రులు. కళాశాలలో చదువుకునే రోజుల్లోనే నాటక పోటీలలో పాల్గొని అందరి ప్రశంసలు అందుకున్నారు. అనతి కాలంలోనే ప్రతిభ గల రంగస్థల నటుడిగా, నాటక రచయితగా గుర్తింపు పొందారు దాసరి. ఇక దాసరికి పద్మతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
సినీ రంగ ప్రవేశం…
నాటక రంగం నుంచి సినీ రంగ ప్రవేశం చేసిన దాసరి నారాయణరావు ఆదుర్తి సుబ్బారావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆదుర్తి వద్ద పనిచేసిన కె.విశ్వనాథ్, కె.బాలచందర్, రాఘవేంద్రరావు వంటి వారికి భిన్నంగా రాణించారు దాసరి. ‘తాత మనవడు’ (1973) చిత్రంతో దర్శకుడిగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు దాసరి నారాయణరావు. వృద్ధులైన తల్లిదండ్రులను నిర్లక్షం చేయకుండా ఆదరించాలని… ఇప్పుడు మనము అనుసరించిన మార్గాన్నే భవిష్యత్తులో మన పిల్లలు కూడా ఆచరిస్తారని చెప్పే సందేశాత్మక చిత్రమిది. కె.రాఘవ నిర్మించిన ఈ చిత్రంలో ఎస్వీ రంగారావు, అంజలీ దేవి, రాజబాబు, విజయనిర్మల, కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య ప్రధాన పాత్రల్లో నటించారు. తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. దీంతో తొలి చిత్రంతోనే దర్శకుడిగా దాసరి నారాయణరావుకు ఎంతో పేరు, ప్రఖ్యాతులు లభించాయి.
దిగ్గజ దర్శకుడిగా…
కృషితో నాస్తి దుర్భిక్షం అనే పదానికి భారత దేశ సినీ రంగంలో ఉదాహరణగా దాసరి నారాయణ రావు గురించి చెప్పుకోవాల్సిందే.
151 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన 250పైగా చిత్రాలకు సంభాషణల రచయితగా, గీత రచయితగా పనిచేశారు. 53 సినిమాలను స్వయంగా నిర్మించారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాలు చేసిన దాసరి కొత్త కళాకారులు ఎందరినో సినీ రంగానికి పరిచయం చేశారు. ఎన్టీర్, ఏఎన్నార్ వంటి అగ్ర కథానాయకులతో సినిమాలు చేసి జాతీయ స్థాయి పురస్కారాలను అందుకున్నారు. తాతా మనవడు, స్వర్గం నరకం, మేఘ సందేశం, మామగారు వంటి విజయవంతమైన చిత్రాలు దాసరికి పలు అవార్డులను తెచ్చిపెట్టాయి. ఆయన సినిమాల్లో పలు చిత్రాలు మహిళా ప్రధానంగా రూపుదిద్దుకోవడం, వరకట్న సమస్యకు వ్యతిరేకంగా సందేశాత్మకంగా తెరకెక్కాయి. దాసరి తీసిన బొబ్బిలిపులి, సర్దార్ పాపారాయుడు చిత్రాలు అగ్ర కథానాయకుడు నందమూరి తారకరామారావు రాజకీయ రంగ ప్రవేశానికి ప్రధాన పాత్ర వహించాయి. మామగారు, సూరిగాడు, ఒసేయ్ రాములమ్మా చిత్రాలు దాసరి నటనా కౌశలానికి మచ్చుతునకలు. ఈ సినిమాల్లో నటనకు విమర్శకుల ప్రశంసలతో పాటు ఎన్నో అవార్డులను అందుకున్నారు దాసరి నారాయణరావు. శివ రంజని, ప్రేమాభిషేకం, మేఘ సందేశం, గోరింటాకు తదితర చిత్రాలు ఆయన దర్శకత్వ ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తాయి. ఎమ్మెల్యే ఏడు కొండలు వంటి చిత్రాలతో సమకాలీన రాజకీయాలపై వ్యంగాస్త్రం సంధించారు. మేఘ సందేశం, కంటే కూతుర్నే కనాలి వంటి చిత్రాల ద్వారా అంతర్జాతీయ గుర్తింపును కూడా పొందారు. మేఘ సందేశం చిత్రాన్ని కేన్స్, షికాగో, మాస్కో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. దక్షిణాదిన స్టార్ డైరెక్టర్‌గా రాణించిన దాసరి నారాయణరావు బాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టారు. ఆశాజ్యోతి, ఆజ్ కా ఎమ్మెల్యే వంటి హిందీ చిత్రాలు చేసి దర్శకుడిగా బాలీవుడ్‌లో పేరుతెచ్చుకున్నారు. మోహన్‌బాబు, ఆర్.నారాయణమూర్తి, రవిరాజా పినిశెట్టి, ముత్యాల సుబ్బయ్య వంటి వారిని చిత్ర పరిశమ్రకు పరిచయం చేశారు దాసరి.
అందుకున్న పురస్కారాలెన్నో.. దర్శకుడిగా తన తొలి చిత్రం ‘తాతా మనవడు’కు నంది అవార్డును అందుకున్నారు దాసరి నారాయణరావు. ఆయన తెరకెక్కించిన స్వర్గం నరకం సినిమాకు ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం దక్కింది. 1983లో మేఘ సందేశం చిత్రానికిగాను ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును పొందగా… 1992లో మామగారు చిత్రానికిగాను ఉత్తమ నటుడిగా నంది పురస్కారాన్ని దాసరి సొంతం చేసుకున్నారు. 1986లో తెలుగు సంస్కృతి, తెలుగు చిత్ర రంగానికి చేసిన సేవలకుగాను ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. నాలుగు సార్లు ఫిలింఫేర్ అవార్డును అందుకున్న దాసరి నారాయణరావు వంశీ బెర్క్‌లీ, కళాసాగర్ పురస్కారాలను సొంతం చేసుకున్నారు.

ప్రముఖుల సంతాపం…

దాసరి మరణం షాక్‌కు గురిచేసింది: చిరంజీవి
దర్శకరత్న దాసరి నారాయణరావు అకాల మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. ఇటీవలే ఆయన అనారోగ్యం కారణంగా అల్లు రామలింగయ్య అవార్డును స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి నా చేతుల మీదుగా అందజేశాను. ప్రస్తుతం చైనాలో ఉన్న నాకు ఇలాంటి చేదు వార్తను వినాల్సి రావడం ఎంతో బాధ కలిగించింది. దర్శక నిర్మాతగా సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలు అనిర్వచనీయం. ఇప్పటివరకు తెలుగు సినిమాకు పెద్ద దిక్కులా ఉన్న ఆయన ఇప్పుడు మన మధ్య లేకపోవడం బాధాకరం. భౌతికంగా దాసరి మన మధ్యన లేకపోయినా ఆయన సేవలను ఎప్పుడూ స్మరించుకుంటూనే ఉంటాం.
చిత్ర పరిశ్రమకు తీరని లోటు: రామ్‌చరణ్
తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కు అయిన డా.దాసరి నారాయణరావు మరణం యావత్ తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.
నా సన్నిహిత శ్రేయోభిలాషి: రజనీకాంత్
భారతదేశంలోని గొప్ప దర్శకుల్లో దాసరి నారాయణరావు ఒకరు. ఆయన నా ప్రియ, సన్నిహిత శ్రేయోభిలాషి. ఆయన మరణం మొత్తం భారత చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబానికి నా సంతాపం. దాసరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా.
కెబి సార్ దాసరిని ఆరాధించేవారు: కమల్‌హాసన్
దాసరి నారాయణరావు కుటుంబానికి నా సానుభూతిని తెలియజేస్తున్నా. ఆయన మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద లోటు. స్వర్గీయులు కెబి సార్ (కె.బాలచందర్) ఆయనను ఎప్పుడూ ఆరాధించేవారు.
ఆయన లోటు ఎప్పటికీ తీరదు: మహేశ్‌బాబు
దాసరి నారాయణరావు మరణవార్త తెలుసుకొని దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని వేడుకుంటున్నాను. ఆయన మరణం ఏర్పరచిన లోటు ఎప్పటికీ తీరదు. ఆయన కుటుంబానికి అందరి ప్రార్థనలు తోడుంటాయి.
మరువదు మీ సేవలను ఈ పరిశ్రమ: ఎన్టీఆర్
తెలుగు చిత్ర కళామతల్లి కన్న ఒక దిగ్గజం ఇకలేరు. మరవదు ఈ పరిశ్రమ మీ సేవలను. దాసరి నారాయణరావు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా.
లెజెండ్స్ ఎప్పటికీ సజీవంగానే: పూరీ జగన్నాథ్
ఒక శకం ముగిసింది. కానీ లెజెండ్స్ ఎప్పటికీ సజీవంగానే ఉంటారు. దాసరి మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబానికి నా సంతాపాన్ని తెలియజేస్తున్నా.
మీరెప్పుడు మాకు జ్ఞాపకం ఉంటారు : రకుల్‌ప్రీత్ సింగ్
దాసరి నారాయణరావు ఆత్మకు శాంతి చేకూరాలి. మీరెప్పుడూ మాకు జ్ఞాపకం ఉంటారు. తెలుగు చిత్ర పరిశ్రమ హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయారు.
చిత్ర పరిశ్రమ వెలుగును కోల్పోయింది : అల్లరి నరేశ్
మన చిత్ర పరిశ్రమ… దారి చూపే వెలుగును కోల్పోయింది. దాసరి నారాయణరావు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా.
చిత్ర పరిశ్రమకు అమావాస్య : పరుచూరి వెంకటేశ్వరరావు
దాసరి మరణించిన రోజు పరిశ్రమకు అమావాస్యలాంటిది. దాసరి లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన నిరంతరం సేవలందించారు.
దాసరి మహోన్నత వ్యక్తి : రాజ్‌తరుణ్
దాసరి నారాయణరావు మహోన్నత వ్యక్తి. చిత్ర పరిశ్రమకు, ఆయన కుటుంబానికి తీరని లోటు. ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నా.
దిగ్భ్రాంతికి గురిచేసింది: సునీల్
దాసరి నారాయణరావు మృతి దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన లోటు తీర్చలేనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా.
మా తరానికి స్ఫూర్తిదాయకం: మారుతి
హృదయ విదాకరకమైన వార్త ఇది. దాసరి నారాయణరావు మరణం మనకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. మా తరానికి మీరు స్ఫూర్తిదాయకం. మా హృదయాల్లో మీరెప్పుడూ నిలిచి ఉంటారు.
పెద్ద దిక్కును కోల్పోయాం: శివాజీ రాజా, నరేష్
ఇటీవలే అభిమానుల సమక్షంలో దాసరి నారాయణరావు ఘనంగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ఇంతలోనే ఆయన మరణ వార్తను వినాల్సి వచ్చింది. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ టీమ్‌కు పెద్ద దిక్కులా ఉండే వ్యక్తిని మేము కోల్పోయాం. తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో సేవలందించిన వ్యక్తి దాసరి నారాయణరావు.
కళా జగద్గురు… అజరామర ధృవతార: అల్లాణి శ్రీధర్
దర్శకరత్న దాసరి నారాయణరావు తెలుగు సినిమా పరిశ్రమకు మూల స్తంభం. అనేక మంది దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన మహావృక్షం నేలకూలడం టాలీవుడ్‌కు తీరని లోటు. నేను కూడా నారాయణ మంత్రం జపిస్తూ దాసరి సంస్థానంలో స్థానం పొందిన అదృష్టవంతుడినే. ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా… ఆయనతో చెప్పుకుంటే సరిపోతుంది….కష్టం తీరిపోతుంది. నలుగురి కోసం ఆలోచించే ‘ఒకే ఒక్కడు’ ఇప్పుడు లేరు. అందరి సంక్షేమం కోసం నిజాయితీగా, నిబద్ధతో కృషి చేయడం… అలా చేసేవారిని ప్రోత్సహించడమే కళా జగద్గురు దాసరికి మనం ఇవ్వగల నిజమైన నివాళి.

దర్శకరత్న దాసరి నారాయణరావు మృతిచెందడం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని ఎపి హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి జలకం సంపత్‌కుమార్, ఎస్సీ, ఎస్టీ, బిసి అడ్వకేట్స్ అసోసియేషన్ కార్యదర్శి జలకం సత్యారామ్‌లు అన్నారు. ఆయన లెజెండరీ సినీ దర్శకుడే కాదు గొప్ప రాజకీయవేత్త అని పేర్కొన్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ హృదయంలో దాసరి నారాయణరావు చిరస్థాయిగా నిలచిపోయారని వారు తెలిపారు.