Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

అలుపెరుగని కలం

Veteran journalist Kuldip Nayar passed away

స్వతంత్ర భారత చరిత్రను నేటి వరకు దగ్గరగా పరిశీలించి, రికార్డు చేసిన పాత్రికేయుడు కులదీప్ నయ్యర్. 14 భాషల్లో ఆయన క్రమం తప్పకుండా కాలమ్స్ రాశారు. 80 దినపత్రికలు ఆయన కాలమ్‌ను ప్రచురించేవి. 15 పుస్తకాలు రాశారు. ఆయన రాసిన పుస్తకాల్లో, బియాండ్ ది లైన్స్, ఇండియా ది క్రిటికల్ ఇయర్స్, డిస్టాంట్ నెయిబర్స్, ఎ టేల్ ఆఫ్ ది సబ్ కాంటినెంట్, ఇండియా ఆఫ్టర్ నెహ్రూ, ది లైఫ్ అండ్ ట్రయల్ ఆఫ్ భగత్ సింగ్ గొప్ప రచనలుగా పేరొందాయి. పంజాబులోని సియాల్ కోట్ లో ఆయన జన్మించారు. ప్రముఖ కవులు ఇక్బాల్, ఫైజ్ అహ్మద్ ఫైజ్ లు కూడా సియాల్ కోట్ వాళ్ళే. ఆగష్టు 14, 1923న ఆయన పుట్టారు. లాహోరులో బి.ఏ. ఆనర్స్ చేశారు. లాహోరులోనే న్యాయశాస్త్రం చదువుకున్నారు. 1952లో నార్త్ వెస్ట్ యూనివర్శిటీ నుంచి జర్నలిజం చదివారు. లాల్ బహదూర్ శాస్త్రీ ప్రధానిగా ఉన్నప్పుడు కులదీప్ నయ్యర్ ఆయన వద్ద మీడియా సలహాదారుడిగా పనిచేశారు. భారత పాకిస్తాన్ ల మధ్య తాష్కెంట్ ఒప్పందానికి ఆయన ప్రత్యక్ష సాక్షి. అదే రోజు రాత్రి లాల్ బహదూర్ శాస్త్రీ గుండెనొప్పితో మరణించారు. ఆ వార్తను మొదట ప్రపంచానికి చెప్పింది కులదీప్ నయ్యరే ఇండియా పాకిస్తాన్ మధ్య శాంతి సుహృద్భావాల కోసం ఆయన అనేక ప్రయత్నాలు చేశారు. 1992సంవత్సరం తర్వాతి నుంచి ప్రతి సంవత్సరం అగష్టు 14 అర్థరాత్రి తర్వాత వాఘా బోర్డర్ వద్ద క్యాండిల్ లైట్ మార్చ్ నిర్వహించేవారు. సరిహద్దులోని అత్తారీ వరకు ఈ మార్చ్ సాగేది. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని చాలా మంది విమర్శించినప్పటికీ ఆయన శాంతి స్థాపన కోసం ఏ చిన్న ప్రయత్నాన్ని వదల్లేదు.

88 సంవత్సరాల వయసులో ఢిల్లీ నుంచి రైలులో అమృతసర్ వెళ్ళడం, అమృతసర్ నుంచి కారులో వాఘా వరకు వెళ్ళడం, అక్కడి నుంచి అర్ధరాత్రి కాలినడకన మార్చింగ్ లో పాల్గొనడం, హిందూస్తాన్ పాకిస్తాన్ దోస్తీ జిందాబాద్ నినాదాలిస్తూ శాంతికోసం ప్రయత్నించడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనలు ఆయన మరణానికి కొన్ని గంటల ముందు రాసిన చివరి కాలమ్ లో మోడీ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శతో పాటు ప్రభుత్వానికి అవసరమైన సలహాలు కూడా ఉన్నాయి. మోడీ ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల్లో ప్రగతి గురించి, పరిపాలన గురించి ఆలోచించాలని, అంతే తప్ప హిందూత్వ రాజకీయాలు నడపరాదని రాశారు. తన మరణానికి కొన్ని గంటల ముందు ఈ వ్యాసం రాసి లోక్ మత్ టైమ్స్ కు పంపించి నిద్రపోయారు. అర్ధరాత్రి తర్వాత అందరికి ఇక సెలవంటూ వెళ్ళిపోయారు. మర్నాడు ఉదయం లోక్ మత్ టైమ్స్ లో ఆయన వ్యాసం వచ్చింది. చివరి శ్వాస వరకు అలుపెరుగని కలం యోధుడాయన. “ప్రవాసులా లేక ఓటు బ్యాంకులా” అనే శీర్షికతో ఆ వ్యాసం వచ్చింది. కులదీప్ నయ్యర్ రాసిన బియాండ్ ది లైన్స్ పుస్తకం భారత రాజకీయ పరిణామాల ప్రత్యక్ష వ్యాఖ్యానం. నిజానికి ఈ పుస్తకం ఆయన జీవితచరిత్ర, కాని స్వతంత్ర భారత చరిత్రలోని ప్రతి సంఘటన ఆయన జీవితంలో చూశారు. చాలా ధైర్యంగా రిపోర్టు చేశారు. ఎలాంటి ఒత్తిళ్ళకు లొంగలేదు. ఇందిరాగాంధీ ఎమర్జన్సీని ఎంత తీవ్రంగా వ్యతిరేకించారో, అంతకన్నా తీవ్రంగా జనతాపార్టీ, ఆ తర్వాత బిజేపిలను విమర్శించారు.

ఆయన విలువలకు మాత్రమే ప్రాముఖ్యం ఇచ్చిన పాత్రికేయుడు కులదీప్ నయ్యర్ రాసిన మరో పుస్తకం టేస్తకం ఆఫ్ టు సిటీస్. దేశవిభజన గురించి లోతయిన అవగాహనతో రాసిన పుస్తకమిది. దేశవిభజనకు జిన్నా ఎంత బాధ్యుడో, నెహ్రూ కూడా అంతే బాధ్యడని నిస్సంకోచంగా చెప్పారు. దేశవిభజన కాలం నాటి రక్తపాతాన్ని ఆయన కళ్ళారా చూశారు. ఈ రక్తపాతం, ప్రజల ఆర్తనాదాలు తనపై చాలా ప్రభావం వేశాయని, అందుకే తాను భారతదేశంలో లౌకిక విలువలకు అత్యంత ప్రాముఖ్యం ఇస్తానని చెప్పేవారు. పండిత్ గోవింద్ వల్లభ్ పంత్ ల వద్ద మీడియా సలహాదారుడిగా పనిచేశారు. ఈ కాలంలోనే అనేక చారిత్రక పరిణామాలకు కూడా ఆయన ప్రత్యక్ష సాక్షి. 1955 నుంచి 1961 వరకు పండిత్ గోవింద్ వల్లభ్ పంత్ కేంద్రమంత్రిగా పనిచేశారు. భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడింది అప్పుడే. కులదీప్ నయ్యర్ ఎమర్జన్సీని తీవ్రంగా నిర్భయంగా వ్యతిరేకించారు. చాలా మంది ఇందిరాగాంధీ ఒత్తిళ్ళకు లొంగిపోయినప్పటికీ కులదీప్ నయ్యర్ వంటి కొందరు ఏమాత్రం చలించలేదు. జూన్ 28, 1975వ తేదీన ఆయన కొందరు జర్నలిస్టులతో సమావేశం ఏర్పాటు చేసి బహిరంగంగా ఎమర్జన్సీని ఖండిస్తూ తీర్మానం ప్రకటించారు. ఎమ ర్జన్సీ విషయంలో తన వ్యతిరేకతను, విమర్శను ఇందిరాగాంధీకి లేఖ రూపంలో కూడా రాశారు. అర్ధరాత్రి ఆయన ఇంటికి వచ్చిన పోలీసులు అరెస్టు చేస్తున్నామని జీపెక్కమన్నారు. కులదీప్ నయ్యర్ ఈ సంఘటన గురించి కూడా రాస్తూ, జిపు ఎక్కిన తర్వాత జీపు స్టార్టవ్వకుండా మొరాయించింది. చివరకు జీపును నెట్టడానికి కులదీప్ నయ్యర్ కూడా సహాయం చేయవలసి వచ్చింది. 1977లో ఇందిరాగాంధీ ఎన్నికలు ప్రకటిస్తారన్న వార్తను ముందుగా ప్రపంచానికి చెప్పింది కూడా కులదీప్ నయ్యర్.

భారత చరిత్రలో అనేక పరిణామాలు, నెహ్రూ పాలన, ఇందిరాగాంధీ ఎమర్జన్సీ, జనతా ప్రభుత్వం, జనసంఘ్ రాజకీయాలు, బిజేపి ఉత్థానం, కాంగ్రేసు పతనం, బాబరీ విధ్వంసం, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ఒకటేమిటి ప్రతి పరిణామాన్ని పాత్రికేయుడుగా దగ్గరి నుంచి ఆయన చూశారు. భారతదేశంలోని రాజకీయాలే కాదు భుట్టో తో సహా పాకిస్తాన్ రాజకీయాలను కూడా చాలా దగ్గరగా పరిశీలించారు. ఇమ్రాన్ ఖాన్ ఎన్నికపై కూడా ఆయన రాశారు. డైలీ స్టార్ ఆఫ్ బంగ్లాదేశ్ పేపరులో ఆయన ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం గురించి రాస్తూ, పాకిస్తాన్లో సైన్యాన్ని, ఇమ్రాన్ ఖాన్ను తీవ్రంగా విమర్శించారు. ఆయన పనిచేసిన మొదటి పత్రిక పేరు అంజామ్. ఉర్దూలో అంజామ్ అంటే అర్థం ముగింపు. నేను చివరి వరకు పాత్రికేయుడిగా ఉండడానికే వచ్చాను అనేవారు. మేరే సహాఫత్ కా ఆగాజ్ అంజామ్ సే హువా అంటూ చమత్కరించేవారు. అంటే నా పాత్రికేయ జీవితం ముగింపుతో ప్రారంభమయ్యింది అని అర్ధం. 1948లో గాంధీజీ హత్యను అంజామ్ పత్రికలో ఆయన రిపోర్టు చేశారు. ఆయన పేర జర్నలిజంలో ఇచ్చే అవార్డు అత్యంత ప్రతిష్టాత్మకమైనది. 2017 నుంచి ఈ అవార్డును ప్రారంభించారు. మొదటి అవార్డు ప్రముఖ జర్నలిస్టు రవీష్ కుమార్ స్వీకరించారు. కులదీప్ నయ్యర్ పై డాక్యుమెంటరీ తీసిన మీరా దీవాన్ ఆయన గురించి చెబుతూ, కులదీప్ నయ్యర్ ఉత్తరప్రదేశ్ లోని బల్లియా పై ఒక పుస్తకం రాయాలనుకున్నారని తెలియజేశారు. బల్లియా ఒక చిన్న పట్టణం. అతి తక్కువ కాలం స్వతంత్రదేశంగా ప్రకటించుకున్న రిపబ్లిక్ కూడాను.దేశవిభజన తర్వాత పాతికేళ్ళ కులదీప్ నయ్యర్ జేబులో పైసా లేకుండా అమృతసర్ వచ్చారు. కాని తన స్వంత కృషితో దేశం గర్వించదగిన జర్నలిస్టుగా ఎదిగారు.

-వాహెద్

Comments

comments