Home జాతీయ వార్తలు కుల్‌దీప్ నయ్యర్ ఇక లేరు

కుల్‌దీప్ నయ్యర్ ఇక లేరు

Veteran journalist Kuldip Nayar passes away

న్యూఢిల్లీ: ప్రముఖ జర్నలిస్ట్, గొప్ప రచయిత కుల్‌దీప్ నయ్యర్ మరణించారు.  పత్రికా స్వేచ్ఛ కోసం, పౌర హక్కుల కోసం అలుపెరుగక పోరాడిన నయ్యర్ తుదిశ్వాస విడిచారు. ఢిల్లీలోని  ఎస్కార్ట్ ఆసుపత్రిలో చనిపోయారని అతని పెద్ద కొడుకు సుధీర్ నయ్యర్ ప్రకటించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనని ఐదు రోజుల క్రితం ఆ సుపత్రిలో చేర్చారు. ఆయన రక్తహీనత వల్ల చాలా నీరసంగా మారారు. ప్రముఖ పాత్రికేయుడు, ఇండో పాక్ మధ్య శాంతి కొరకు పాటు పడిన కుల్‌దీప్ నయ్యర్ అనేక రచనలతో ఎనలేని కృషి చేశారు. ఆయన పాక్‌లో ని సియోల్‌కోట్‌లో 1923లో జన్మించారు. ఆయనకు భార్యా ఇద్దరు కొడుకులున్నారు. కుల్‌దీప్ నయ్యర్‌కి అనేక భాషల్లో మంచి పట్టుంది. నిబద్దతో పని చేసిన ఆయన పౌర హక్కుల పరిరక్షణ కోసం అహర్నిశలు కృషి చేశారు.

భారతదేశంలో అత్యంత గౌరవించదగిన జర్నలిస్టుగా ఆయన గుర్తింపు పొందారు. అనేక రచనలతో ఆయన సమాజాన్ని తట్టి లేపారు. ఆయన ఉర్దూ పత్రికలో పాత్రికేయుడిగా తన ప్రస్థానం మొదలు పెట్టారు. ఆ తరువాత ఆయన అనేక పత్రికలకు సంపాదకుడిగా పని చేశారు. ఆయన హిందీ పత్రికలతో పాటు ఇండియన్ ఎక్స్‌ప్రెస్, స్టేట్స్‌మన్ పత్రికలకు కూడా సంపాదకుడిగా పని చేశారు. అతని ఆలోచనలు సూటిగా నిర్భయంగా ఉండేవి. దశాబ్దాలపాటు ఆయన ఆలోచనలు దేశమంతటా ప్రభావితం చేశాయి. ఎడిటర్ గిల్డ్ వ్యవస్థాపకుల్లో నయ్యర్ ఒకరు. పత్రికా స్వేచ్ఛ కోసం ఆయన నిరంతరం పోరాడారు. భారత జర్నలిజంలోనే ఓ కొత్త ఒరవడికి ఆయన నాంది పలికారు. ఆయనని అంతా రిపోర్టర్స్ ఎడిటర్ అని పిలిచుకుంటారని ఎటిటర్స్ గిల్డ్ ఒక సంతాప ప్రకటనలో తెలిపింది.

బ్రిటన్‌లో భారత హైకమిషనర్ బాధ్యతలు
ఆయన బ్రిటన్‌లో 1990లో భారత్ హైకమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 1997లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 1980 లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం పరువు నష్టం బిల్లు తెచ్చినప్పుడు నయ్యర్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది పత్రికా స్వేచ్ఛని హరిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 1975 జూన్ 25న ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని విధించి, పత్రికల మీద సెన్సార్‌షిప్ విధించినప్పుడు ఆయన దానిని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ప్రభుత్వం ఆయనని అరెస్ట్ చేసి జైళ్లో పెట్టింది. నయ్యర్ రాసిన బియాండ్ ది లైన్స్, బిట్వీన్ ది లైన్స్ రచనలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. అంతిమ సంస్కారాలు న్యూఢిల్లీలోని లోధి శ్మశానవాటికలో నిర్వహించారు.

నయ్యర్ ఒక గొప్ప ప్రజాస్వామ్యవాది : రాష్ట్రపతి కోవింద్
జర్నలిస్ట్ కుల్‌దీప్ నయ్యర్ మరణంపై రాష్ట్రపతి సంతాపం ప్రకటించారు. నయ్యర్ ఒక గొప్ప సంపాదకుడని, పేరుగాంచిన రచయిత, దౌత్యవేత్త అని రాష్ట్రపతి సంతాప సందేశంలో తెలిపారు. నయ్యర్ గొప్ప పార్లమెంటేరియన్‌గా రాణించారని, 1975 అత్యవసర పరిస్థితి కాలంలో ఆయన ప్రజాస్వామ్య కోసం పోరాడిన చాంపియన్ అని కోవింద్ అన్నారు. ఆయన గొప్ప రచనలు చేశారని , ఆయన లేని లోటు పాఠకులకు తీర్చలేనిదని రాష్ట్రపతి రాంనాథ కోవింద్ తన సంతాప సందేశంలో తెలిపారు.

తమ కాలంలో అద్భుతమైన మేధావి : మోడీ
కులదీప్ నయ్యర్ పబ్లిక్ సర్వీసులు, నిబద్దతలు మరింత మెరుగుపడాలని కోరుకున్నారని, ఆయనని భారతదేశం ఎన్నటికీ మరిచిపోదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన సంతాప సందేశంలో తెలిపారు. తమ కాలంలో ఆయన అద్భుతమైన మేధావిగా రాణించారని ప్రధాని చెప్పారు. నయ్యర్ మృతి పట్ల బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ , మీడియా సంపాదకులు సంతాపం ప్రకటించారు.