Search
Saturday 17 November 2018
  • :
  • :

ప్రారంభమైన విజయ్ దేవరకొండ కొత్త చిత్రం

vijay

‘పెళ్లిచూపులు’ చిత్రంతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఆతర్వాత ‘అర్జున్‌రెడ్డి’తో  మంచి క్రేజ్‌ను తెచ్చుకున్నారు. ఈ రెండు చిత్రాలతో యూత్‌లో అతనికి మంచి పాపులారిటీ వచ్చింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా మెహరీన్ హీరోయిన్‌గా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెలుగు, తమిళ్‌లో నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా ప్రారంభమైంది. స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, కె.ఎస్.రామారావు, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, స్వప్నదత్, వంశీపైడిపల్లి, మెహర్ రమేష్, సందీప్ రెడ్డి వంగతో పాటు చిత్ర బృందం పాల్గొంది. పూజా కార్యక్రమాల అనంతరం హీరోహీరోయిన్‌లు విజయ్ దేవరకొండ, మెహరీన్‌లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్‌నివ్వగా… సందీప్‌రెడ్డి వంగ కెమెరా స్విచాన్ చేశారు. అనంతరం ఏర్పాటైన విలేకరుల సమావేశంలో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ “స్టూడియో గ్రీన్ కె.ఇ.జ్ఞానవేల్ రాజా బ్యానర్‌లో ఈ సినిమా చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. సినిమా స్క్రిప్ట్ వినగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. తొలిసారి తెలుగు, తమిళ్‌లో సినిమా చేస్తున్నాను. డేట్స్ లేకపోయినప్పటికీ స్క్రిప్ట్ నచ్చడంతో డేట్స్ అడ్జస్ట్ చేసి ఈ సినిమాకే ఓకే చెప్పాను”అని అన్నారు. నిర్మాత కె.ఇ.జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ “అర్జున్ రెడ్డి సినిమాను థియేటర్‌లో ఐదుసార్లు చూశాను. విజయ్ దేవరకొండ అమేజింగ్ యాక్టర్. అతనితో తెలుగు, తమిళ్‌లో సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. దర్శకుడు ఆనంద్ శంకర్ చెప్పిన స్క్రిప్ట్ నచ్చి ఈ సినిమా తీస్తున్నాను. ఈనెల 8 నుండి తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో చేసి రెండో షెడ్యూల్‌ను చెన్నైలో చేస్తాం”అని చెప్పారు. దర్శకుడు ఆనంద్ శంకర్ మాట్లాడుతూ “విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్‌రెడ్డి’ అన్ని భాషల్లో మంచి హిట్ అయింది. అతని నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. అతను ఈ స్క్రిప్ట్ విని వెంటనే సినిమా చేస్తానని అన్నాడు. తమిళ్ నేర్చుకొని డైలాగ్స్ చెబుతానని అన్నాడు. ఈ చిత్రంలో సత్యరాజ్, నాజర్ ముఖ్య పాత్రల్లో నటిస్తారు. తెలుగు, తమిళ్ ప్రేక్షకులకు నచ్చేవిధంగా ఈ చిత్రం ఉంటుంది”అని పేర్కొన్నారు. హీరోయిన్ మెహరీన్ మాట్లాడుతూ “విజయ్ దేవరకొండతో ఇటీవల ఒక హోలీ పండుగ పాటలో నటించాను. వెంటనే ఇప్పుడు అతనితో హీరోయిన్‌గా నటిస్తున్నాను. స్టూడియో గ్రీన్ బ్యానర్‌లో ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది”అని అన్నారు. ఈ చిత్రానికి కెమెరాః శాంత, సంగీతంః సి.ఎస్.శ్యామ్, కాస్టూమ్స్ డిజైనర్‌ః శ్రావ్య, ఆర్ట్‌ః కిరణ్.

Comments

comments