Home ఎడిటోరియల్ విజయ్ మాల్యా ‘విలువైన’ ప్రశ్న!

విజయ్ మాల్యా ‘విలువైన’ ప్రశ్న!

vijay-malya

చట్టాలను ఉల్లంఘించిన వారు కూడా ఒకోసారి విలువైన ప్రశ్నలు వేయగలరు. వాటిని విన్నప్పుడు, ఆ ఉల్లంఘనదారులపై సదభిప్రాయమేమీ కలగదుగాని, అదే సమయంలో వారి ప్రశ్నలోని విలువను గుర్తించకతప్పదు. దేశంలోని 13బ్యాంకులకు కలిపి రూ. 9,200 కోట్లు బకాయీ పెట్టి లండన్‌కు విజయవంతంగా పారిపోయిన విజయ్ మాల్యా ఈనెల 9వ తేదీన సుప్రీంకోర్టు ఎదుట తన న్యాయవాది ద్వారా ఒక ప్రశ్నవేసాడు. బ్యాంకులకు మొత్తం ఏడులక్షలకోట్ల రూపాయల మొండిబకాయీలు ఉండి వాటిని వసూలు చేయలేకపోతున్నప్పుడు కేవలం కొన్ని వేల కోట్ల బకాయీలు ఉన్న తననే ఒక మహా దోషివలె, ఎగవేతదారులకు ‘పోస్టర్‌బాయ్’ వలె చూపి ఎందుకింతగా అప్రతిష్ట పాలు చేస్తున్నారన్నది ఆయన ప్రశ్న. ఇందులో మాల్యాపట్ల సానుభూతి చూపవలసిం దేమీ లేదు. కాని ఆయన అడిగిన దానికి ఇతరత్రా విలువ ఉన్నందున అందుకు సమాధానం చెప్పవలసిన బాధ్యత బ్యాంకులపైన, ప్రభుత్వంపైన ఉంటుంది.

ఏడులక్షల కోట్ల రూపాయల మొండిబకాయీలు మామూలు విషయం కాదు. ఆ డబ్బంతా ఎవరిది? సాధా రణ ప్రజలు, వ్యాపారులు, ఉద్యోగులు శ్రమపడి సంపా దించి డిపాజిట్లు చేసుకోగా బ్యాంకులవారు ఆ సొమ్ముతో వడ్డీ వ్యాపారాలు నడపగా వచ్చిన సొమ్ము. డిపాజిట్లు ధనాన్ని, వడ్డీ ఆదాయాన్ని బ్యాంకులవారు పరిశ్రమల పేర, వ్యాపారాల పేర సంపన్నులకే గాక, పచ్చి మోసగాళ్ల కు కూడా కట్టబెడుతున్నారు. వారు మోసగాళ్ల ని, వారు చెప్పే పరిశ్రమలు వ్యాపార ప్రతిపాదనలలో అనేకం మోస పూరితమైనవని ముందుగా తెలిసి కూడా కోట్లకు కోట్లు ఇస్తున్నారు. అందులో రాజకీయ పలుకు బడులే కాదు, బహుశా అంతకన్న ఎక్కువగా బ్యాంకు బోర్డులు, అధి కారుల అవినీతి పనిచేస్తున్నది. డబ్బు మొదట ఇవ్వటం లోనే కాదు. తర్వాత ఖచ్చితంగా వసూలు చేయక పోవటంలో, చివరకు వాటిని ముందుగా మొండి బకా యీల పద్దులోకి చేర్చి కొంతకాలానికి చల్లగా మాఫీ చేయ టంలోనూ రాజకీయ నాయకులు, బ్యాంకు బోర్డు లు, అధికారులు కుమ్మక్కవుతున్నారు. ఆ విధంగా దేశానికి జరుగుతున్న సంపదల నష్టం పదులు, వందలు, వేల నుంచి లక్షల కోట్లకు చేరటమన్నది విని మనకు తల తిరిగి పోతుంది తప్ప నోటమాటరాదు. ఇటువంటి దుర్మార్గంలో మాల్యాతో పాటు ఆ 13బ్యాంకుల పాత్ర కూడా ఉండటం తెలిసిందే. తిరిగి అదే మాల్యా ఎదురు ప్రశ్నలు వేస్తూ నీతులు మాట్లాడటం, సదరు బ్యాంకుల వారు ఇటువంటి ఎగవేతదారులను ఇంత కాలం బుద్ధి పూర్వ కంగానే ఏమీ చేయక తమ సాకులు తాము చెప్తుం డటాన్ని చూడగా దేశంలో ప్రభుత్వం, ఆర్థికశాఖ, రిజర్వ్ బ్యాంక్ వంటివి ఎందు కున్నాయో అనే సందేహం కలుగుతుంది.

ఈ నిర్వాకంలో ప్రభుత్వరంగ బ్యాంకులు తక్కువ తినకపోవటం గమనించదగ్గది. పార్లమెంటరీ స్థాయీ సంఘం వారు ఈనెల 16న సమర్పించిన నివేదికను బట్టి, ‘నిరర్థక ఆస్తులు’ అనే ముద్దుపేరుగల మొండి బకాయీలు గత మూడు సంవత్సరాలకాలంలో మనకు మరింత కళ్లు తిరిగేట్లు పెరిగాయి. 2013 మార్చి నుండి 2016 మార్చి వరకు గల మూడేళ్లలో ప్రభుత్వ బ్యాంకుల బకాయీలు రూ.1,55,890కోట్లనుంచి రూ.4,76,816కోట్లకు (305.86 శాతం), షెడ్యూల్డు వాణిజ్యబ్యాంకుల బకా యీలు రూ.1,83,854 కోట్లనుంచి రూ.5,41,763 కోట్లకు (294.7శాతం), ప్రైవేటు బ్యాంకుల బకాయీలు రూ.19,992 కోట్లనుంచి రూ.49,155కోట్లకు (245.87 శాతం) పెరిగిపోయాయి. అనగా, మూడు విధాలైన బ్యాంకులలో కలిపి ఈ మూడేళ్లలో పెరిగిన మొండి బకాయీల సొమ్ము రూ.7,07,998లక్షల కోట్లు. మొత్తం బకాయీలు కలిపితే రూ. 10,67,734కోట్లు! అక్షరాలా పదిలక్షల అరవై ఏడు వేల ఏడువందల ముప్పయినాలుగు కోట్లన్నమాట.

విజయ్ మాల్యా న్యాయవాదులు సుప్రీం కోర్టు ఎదుట పేర్కొన్నది ఏడు లక్షల కోట్లు మాత్రమే. అంతకన్నా ఇపుడు పార్లమెంటు స్థాయీసంఘం చూపిన సంఖ్య మరొక మూడు లక్షల అరవై ఏడువేల ఏడు వందల కోట్లకు పైగా ఉంది. అయితే, మొండి బకాయీ లను ఈ విధంగా తగ్గించి చూపాడంటూ మాల్యాను నిందించలేము. కోర్టు ఎదుట ఆయన లాయర్లు వాదించింది మార్చి 9న కాగా, పార్లమెంటు సంఘం తాజా లెక్కలను మరొక వారం తర్వాత 16వ తేదీన ముందుకు తెచ్చింది. అది ఆయన పొరపాటు కాదు. కనుక ఈసారి కేసు విచారణలో తన లాయర్లు, పదిలక్షల కోట్లకుపైగా మొండిబకాయీలు ఉన్నప్పుడు మా క్లయింటును మాత్రమే ఎందుకు పోస్టర్ బాయ్ చేస్తున్నా రంటూ మరింత బలంగా వాదించవచ్చు నన్నమాట.

దీనంతటి మధ్య కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి మాత్రం ఒక గొప్ప ఆశాకిరణం కన్పించటం చెప్పుకోదగ్గ విశేషం. పార్లమెంటరీసంఘం నివేదిక వెల్లడి కావటానికి ముందే ఆయన దృష్టికి వచ్చినట్లుంది. తను 15వ తేదీన మాట్లాడుతూ, మొండిబకాయీల సమస్య తీవ్రమైనదేనని, అయితే అది ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు చివరి నాలుగు మాసాలలో తగ్గుముఖం పట్టిం’దని ఎంతో సంతృప్తిని వ్యక్తపరచారు. జైట్లీ ఆర్థికమంత్రిగా గల ప్రభుత్వం అధి కారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు పూర్తవుతున్నా యి. అంతకుముందుండిన బకాయీలు ఈ మూడేళ్లలో గణనీయంగా పెరిగాయి. ఈ కాలమంతా ఆయనగాని, బ్యాంకులు గాని సమస్య పరిష్కారానికి చేసిందేమీ లేదు.

సమస్య మరింత పెరుగుతున్నా బ్యాంకు లు దొంగ అప్పు లు ఇస్తూనే పోయాయి. ప్రభుత్వం అన్నీ తెలిసి మాటలతో కాలక్షేపం చేసింది. ఎగవేతదారులకు ఇబ్బందికలగ కుండా పక్షి ఈకల అదలింపులు కొన్ని మొక్కుబడికోసం చేసింది. మరిన్ని బకాయీలు మాఫీలు చేయించింది. లేదా ఆ పని చేసిన బ్యాంకులను నియం త్రించలేదు. ఆ క్రమంలో వెసులు బాట్లు పొందిన వారిలో సాక్షాత్తు విజయ్ మాల్యా ఒకరు. లండన్‌కు తప్పించుకు పోయిన తర్వాత సైతం ఆయన ఈ వెసులుబాటు పొందాడు. అరుణ్‌జైట్లీ ఇటువంటివన్నీ విస్మరించి ఈ సమస్య “ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు చివరి నాలుగు మాసాలలో తగ్గుముఖంపట్టిం”దంటూ ఘనంగా ప్రకటించారు. తగ్గుముఖం అంటే ఏమిటి, ఎంతమేరఅనే లెక్కలు ఆయన చెప్పారో లేదోగాని పత్రికలలో మాత్రం వెలువడ లేదు.

పార్లమెంటరీ సంఘం నివేదికలో గమనార్హమైనవి మరికొన్ని ఉన్నాయి. అప్పులు తీసుకున్నవారు ఆ సొమ్మును ఏ పనులకోసమని చెప్పారో వాటికోసం గాక ఇతర అవసరాల కోసం మళ్లించటం వాటిలో ఒకటి. రుణాల మంజూరు దశలో బ్యాంకుల అధికారులు తగు పరిశీలనలు జరిపి జాగ్రత్తలు తీసుకోవటం లేదన్నది రెండు. అప్పులు దారి మళ్లకుండా చూసే ఆడిటింగ్ వ్యవస్థలు బ్యాంకులలో లేవనేది మూడు. బ్యాంకులకు తాము చేసే మార్గదర్శకాలు అమలవుతున్నదీ లేనిదీ తనిఖీ చేయటంలో స్వయంగా రిజర్వ్ బ్యాంకు విఫల మవుతున్నదనేది నాలుగు. ఈ విధంగా చివరకు తేలు తున్న విషయాలు ఏమిటి? 1)సంన్నులకు, మోసగాళ్లకు ప్రభుత్వ బ్యాంకులతో సహా అన్ని బ్యాంకులూ ఒక పద్ధతీ పాడూ లేకుండా యథేచ్ఛగా ప్రజల సొమ్మును అప్ప చెప్తున్నాయి, 2) ఆ పని ఎప్పుడో మొదలై ఆగకుండా జరుగుతున్నా, విషయం తెలిసి కూడా రిజర్వ్‌బ్యాంకు వారు నియంత్రించటం లేదు, 3) ఆర్థికమంత్రిత్వశాఖకు, ప్రభుత్వానికి తెలిసినా ఇదే వైఖరి చూపుతున్నాయి, 4) ఈ విషయంలో ప్రభుత్వం ఏ పార్టీది అనే దానితో నిమిత్తం లేకుండా పోయింది, 5) మొండి బకాయీలు లక్షల కోట్ల కు పెరిగినా ఎవరికీ చలనం లేదు, 6) బకాయీ దార్లపై చర్యలు, బకాయీ మొత్తాల వసూళ్లకు బదులు వారిని గట్టె క్కించేందుకు ఒకటి తర్వాత ఒకటిగా పథకాలు ప్రకటిస్తు న్నారు. గుట్టుచప్పుడు కాకుండా అపుడపుడు మాఫీలు చేస్తున్నారు, 7) వివిధ సంఘాలు వివరాలను వెల్లడించి చర్యలను సిఫారసు చేసినా పెడచెవిన పెడుతున్నారు.

దీనంతటికి కారణం ఏమిటో ఊహించటం పెద్దకష్టం కాదు. ఆ ఊహ ఎవరైనా చేయగలరు కూడా. పైన పేర్కొన్న అంకెలన్నీ కేవలం మొండిబకాయీలు అనబడే ఎగువేత బకాయీలకు సంబంధించినటువంటిది. ఇంటా, బయటా గల నల్లధనం విషయం వేరే. అది ఎన్ని లక్షల కోట్లో, కోట్లాది కోట్లో ఎవరి వద్దా లేక్కలేదు. ఆ లెక్క చెప్పలేమని స్వయంగా జైట్లీయే మరొక సందర్భంలో సెలవిచ్చారు. విదేశాలలోని నల్లధనాన్నంతా రప్పిస్తామని ఆయన పార్టీ గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినా ఈ సరికి అందరూ దానిని మరిచిపోయారన్నది వేరే విషయం. ఇటీవలి పెద్దనోట్ల రద్దుతో దేశీయంగా గల నల్లధనం వెలికి రాగలదనే మాటను కూడా అందరూ మరిచి పోతున్నట్లే కనిపిస్తున్నది. ఇటువంటి ఆర్భాటాలకే దిక్కులేకుండా పోతున్నపుడు, ఇంటా-బయటా నల్లధన మంతా భద్రంగా ఉన్నప్పుడు, ఈ పదిలక్షల కోట్ల పాటి మొండిబకాయీలు చెప్పుకోదగ్గ విషయమే కాదు. తాజా వార్తల ప్రకారం వీరికోసం కూడా కేంద్రం ఒక ఉపా యాన్ని ఆలోచిస్తున్నది. రుణాలు తీసుకున్న వారు ఏ రంగాలలో పెట్టుబడి కోసమని చెప్పితీసుకున్నారో ఆ రంగాల పరిస్థితి బాగాలేనందువల్ల వారికి వ్యాపారం సరిగా నడవక బాకీలు తీర్చలేక పోయినట్లయితే వారిని దయతో చూస్తారట. ఉద్దేశ పూర్వకంగా(అది తేల్చే దెవరో!) దారిమళ్లిస్తే మాత్రమే చర్యలుంటాయట. విజయ మాల్యాగారూ, మీ పైన మాకిపుడు నిజంగానే సానుభూతి కలుగుతున్నది!

టంకశాల అశోక్

984819176