Home లైఫ్ స్టైల్ అద్భుత సేవలు..అవార్డుకు సోపానాలు

అద్భుత సేవలు..అవార్డుకు సోపానాలు

lf

గ్రామీణ ప్రాంతాల్లోని రోగులకు వైద్యంపై సరైన అవగాహన ఉండదు. వారిని ఎప్పటికప్పుడు చైతన్యపరుస్తూ, మెరుగైన ఆరోగ్య పరిరక్షణ విషయంలో సలహాలు, సూచనలు ఇస్తూ ఆరోగ్య భారతావని కోసం యత్నించినందుకు కేంద్ర ప్రభుత్వం ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డుతో బ్యాగరి విజలయలక్ష్మిని సత్కరించింది. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 12వ తేదీన ఆమె రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. సంగారెడ్డి జిల్లాలోని కంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎఎన్‌ఎంగా పనిచేస్తున్న విజయలక్ష్మితో విజేత మాటాముచ్చట.

సాధారణ కుటుంబ నేపథ్యం కలిగిన విజయలక్ష్మి పదో తరగతి పూర్తి చేసింది. 1993వ సంవత్సరంలో ఎఎన్‌ఎంగా విధి నిర్వహణలో చేరింది. అప్పటి ఉమ్మడి మెదక్ జిల్లాలోని కొండాపూర్‌లో మొదటి పోస్టింగ్ వచ్చింది. సాధారణ కుటుంబ నేపథ్యం కలిగిన విజయలక్ష్మి పదవ తరగతి పూర్తి చేసింది. భర్త శ్యామ్ ప్రోత్సాహంతో ఎఎన్‌ఎం మిడ్‌వైఫనరీ కోర్సులో చేరారు. ఈ కోర్సు చదువుతున్నప్పుడే నైటింగేల్ సేవలు తెలుసుకొని స్ఫూర్తి పొందారు. అలాంటి అసమాన సేవకురాలి పేరుతో ఏర్పాటు చేసిన అవార్డుకు తాను ఎంపిక కావడం, అందులోనూ అది రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోవడం ఎంతో గర్వంగా ఉందంటారు ఆమె. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకే ఆరోగ్య సమస్య లెక్కువగా ఉంటాయి. మల్టీ స్పెషాలటీ, సూపర్ స్పెషాలటీ లాంటి ఆసుపత్రులు అక్కడ ఉండవు. కొన్ని గ్రామాల్లో అయితే అర్‌ఎంపి, పిఎంపిలు చెప్పిందే వేదం. ఇంకా మారుమూల గ్రామీణుల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. తన వంతుగా ప్రభుత్వ విధుల్లో భాగంగానే గ్రామీణ మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంది.
నేడు అధునిక సాంకేతికత ఎంతో అభివృద్ధ్ది చెందింది. డాక్టర్లు వైద్యం మాత్రమే చేసి వెళ్లిపోతారు. ఆ తర్వాత చూసుకునేది నర్సులే. రోగులు పూర్తిగా కోలుకునేదాక నర్సుల పాత్ర అనిర్వచనీయం. దీనికి తోడు గ్రామాల్లో ఎప్పటికప్పుడు మహిళలని చైతన్యపరచే విధంగా కుడా ఎఎన్‌ఎంలు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఆసుపత్రుల్లో గర్భిణులు, బాలింతలకు సేవలందించడం, పుట్టిన నవజాత శిశువులకు సంరక్షణ బాధ్యతలు చూసుకోవడం లాంటి ప్రధాన పనులన్నీ ఎఎన్‌ఎంలకే చూసుకోవాల్సి ఉంటుంది. సామాజిక అంశాలపై కూడా దృష్టి సారించాల్సిన బాధ్యత ఉంటుంది. బాల్య వివాహాలను ఆరికట్టడం, అంగన్‌వాడీ టీచర్లతో ప్రతి నెలా న్యూష్రన్ డే నాడు సమావేశమై తల్లుల కమిటీలతో సమావేశం నిర్వహించి ఆరోగ్య సమస్యలపై చర్చించడం, కిశోర బాలికల గురించిన జాగ్రత్తలు తెలుపడం లాంటివి చేయాల్సి ఉంటుంది. ఆమె ఉద్యోగ పర్వంలో భాగంగా ఇవన్నీ చేయగలిగింది.
2005లో ఆమె భర్తకు ప్రమాదం జరిగినప్పుడు ఐఐఎంపిలో శిక్షకురాలిగా బాధ్యతలు అప్పగించాలని చూశారు. అయితే భర్తకు తన అవసరం ఉందన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యక్తిగత విజ్ఞప్తి మేరకు ఒత్తిడి చేయలేదు. భర్త సహకారాంతోనే విధి నిర్వహణలో విజయం సాధించినట్లు చెబుతోంది విజయలక్ష్మి. నర్సు అంటేనే ఓపిగ్గా రోగులకు సేవలందించాలి. చిరాకు, విసుగు ఉండకూడదు. ప్రధానంగా గ్రామీణ మహిళలకు సేవలందించాలి. మేము శిక్షణ తీసుకున్న సమయంలోనే ఇవన్నీ మాకు నేర్పుతారు.
గ్రామీణ మహిళలు రెగ్యులర్ చెకప్‌లు చేసుకోరు. దీనికి పెద్ద పెద్ద కారణాలు అంటూ ఏమీ ఉండవు. సిగ్గు, బిడియం ఎక్కువగా ఉంటాయి. దీనిని నివారించేందుకు పేరెంటల్ ఎడ్యుకేషన్ ప్రెగ్నెంట్ అనే కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం కింద గర్భిణీ అయిన తొలి మూడు నెలల్ల్లో క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవల్సి ఉంటుంది. ఈ మూడు నెలల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్య పరీక్షల గురించి వివరించే ఈ కార్యక్రమంపై ఇంకా గ్రామీణుల్లో చైతన్యం తీసుకురావాల్సి ఉంది. ఈ విషయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వర్క్‌షాప్‌లకు హాజరయ్యాను అని తన అనుభవాన్ని చెబుతోంది. కేరళ, పశ్చిమ బంగ్లా, కోల్‌కతా వంటి ప్రాంతాలకు వెళ్లి వర్క్‌షాపులకు హాజరయింది.
నాకు నా జీవితంలో వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ 2001లో హైదరాబాద్‌లోని హోటల్ మారియంట్‌లో స్వీడన్ నుంచి వైద్య బృందం ఒక వర్క్ షాపు నిర్వహించింది. ఈ వర్క్‌షాపుల్లో పాల్గొన్న నేను సమర్పించిన ఫీడ్ బ్యాక్‌ను అందరూ అభినందించడం ఇప్పటికీ మర్చిపోలేను. గ్రామీణ మహిళల్లో ప్రసవాలపై ఇంకాపూర్తి స్థాయిలో అవగాహన కలుగలేదు. వారికి అవగాహన కల్పించడంతో పాటు చిన్నతనంలో వివాహం చేయడం వల్ల జన్యుపరంగా వచ్చే సమస్యలు, ఆరోగ్య సమస్యల గురించి వారిని చైతన్యపరిచానని అంటోంది.
కొండాపూర్ పిహెచ్‌సిలో పని చేస్తున్నప్పుడు ఒక పాప ప్రసవం తర్వాత ఏడ్వలేదు. చాలా సేపు అచేతనంగా అలానే పడి ఉండడం చూసి అనుమానం వేసి నోటితో పాప నోట్లో నోరు పెట్టి గాలి ఊదడం ప్రారంభించారు. ఇంటి వద్ద ప్రసవం జరిగింది. అక్కడి నుంచే నోటిలో గాలి ఊదుతూ ఆసుపత్రికి పరుగు తీశాను. ఆసుపత్రి వెళ్లేవరకు ఊదుతూనే ఉన్నాను. ఆసుపత్రిలోకి వెళ్లగానే పాపలో కదలిక వచ్చి పాప ఏడ్వడం ఆరంభించింది. నాకు చాలా ఆనందం కలిగింది. నేను తొలిసారిగా నవజాత శిశువును ఎలా రక్షించుకోవాలో శిక్షణలో నేర్చుకున్న అంశం ఆ రోజు అలా ఉపయోగపడింది. వారి తల్లిదండ్రుల కళ్లలో ఆనందం ఇప్పటికీ నా కళ్లకు కనిపిస్తుంటుంది. ఇప్పుడు ఆ పాప పెరిగి పెద్దదైంది. ఆ పాప పేరు అఖిల. ఇదే తరహా కేసు ఒకటి కొండాపూర్‌లో నమోదైంది. పురుడు ఉంది అని పాపకు తల్లిదండ్రులు బట్టలు వేయలేదు. పాప క్రమంగా ఉష్ణ్రోగ్రత కోల్పోయి మృత్యు ముఖంలోకి తొంగి చూసే సమయంలో గమనించి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాను. ఈ విషయంలో పాప పేరెంట్స్‌కు నాకు గొడవ కూడా జరిగింది. అయినా అవేవీ పట్టించుకోలేదు. పాప మాత్రం సురక్షితంగా బయటపడింది. అదే నాకు పదివేలు. ఈ విషయాలలో పరిశీలనకు ఢిల్లీ నుంచి వచ్చిన ఒక బృందం నా పనితీరు గమనించి నాకు ఉత్తమ ఎఎన్‌ఎంగా అవార్డుకు సిఫార్సు చేసింది. ఆ అవార్డు కూడా అందుకున్నానంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇలా మొత్తం 7 జిల్లా స్థాయి అవార్డులు, 3 పిహెచ్‌సి స్థాయి అవార్డులు అందుకుంది.
అవార్డుల కోసం పని చేయలేదు. పని చేస్తేనే అవార్డులొచ్చాయి.. అనే సంతృప్తి నాకు చాలు. నా కెరీర్‌లో ప్రధానంగా డిపిఎస్‌ఎస్‌ఒ మేడమ్ ఒలీనియా బెంజిమన్ మేడమ్ నన్ను ప్రోత్సహించారు. ఆమె ప్రోత్సాహంతోనే నేను నేడు ఈ స్థాయికి చేరుకున్నానంటూ ఆమెకు కృతజ్ఞతలు తెలిపింది. ఆమెతో కలిసి పనిచేస్తున్నప్పుడే దేశవ్యాప్తంగా పేరెంటల్ ఎడ్యుకేషన్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అది కూడా దేశంలోనే మొట్టమొదటి సారిగా మా కేంద్రం నుంచే ఆరంభించడం గర్వించదగిన విషయంగా చెప్పుకోవచ్చంటోంది విజయలక్ష్మి. బండారు యాదగిరి,
మన తెలంగాణ, సంగారెడ్డి ప్రతినిధి