Home సినిమా వివాదాల్లో ‘సర్కార్’

వివాదాల్లో ‘సర్కార్’

sarkar

– అభ్యంతకర సన్నివేశాల తొలగింపునకు దర్శకుడి నిర్ణయం
– స్పందించిన రజనీ, కమల్
విజయ్-మురుగదాస్ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సర్కార్’ సినిమా తమిళనాట ప్రకంపనలు రేపుతోంది. భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ చిత్రం వివాదాల్లో చిక్కుకుంది. ఈ చిత్రంలో విలన్ పాత్ర పేరును మాజీ ముఖ్యమంత్రి జయలలిత అసలు పేరైన కోమలవల్లి అని పెట్టడం తీవ్ర వివాదాస్పదమవుతోంది. దీంతో పాటు సినిమాలో అధికార అన్నాడిఎంకె పార్టీ మీద పెద్ద ఎత్తున సెటైర్లు పడ్డాయి. అలాగని ఇతర పార్టీలను కూడా వదల్లేదు. తమిళనాట రాజకీయాల్లో మార్పు రావాలన్న ఉద్దేశాన్ని గట్టిగా చాటి చెప్పేలా ఇందులో చాలా డైలాగులున్నాయి. ఇవి ప్రధాన రాజకీయ పక్షాలకు ఆగ్రహం తెప్పించాయి. దీంతో ‘సర్కార్’ చిత్రంలో వివాదస్పదంగా ఉన్న కొన్ని డైలాగులను తొలగించాలని ఆందోళనలు మొదలయ్యాయి. పోస్టర్లు చించేస్తూ థియేటర్ల మీద దాడులు చేస్తున్నారు. మరోవైపు చిత్ర దర్శకుడు మురుగదాస్‌ను పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నారన్న వార్తలు కలకలం రేపాయి. గురువారం అర్ధరాత్రి మురుగదాస్ ఇంట్లో లేని సమయంలో పోలీపులు అక్కడికి వెళ్లి విచారణ చేపట్టడంపై హైడ్రామా నడిచింది. ఈ నేపథ్యంలో మురుగదాస్ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించడం ఆసక్తి రేకెత్తిస్తోంది. సినిమాలో వివాదాస్పద డైలాగులుంటే ఏకంగా దర్శకుడిని అరెస్టు చేయడానికి ప్రయత్నించడమేంటని సినీ పరిశ్రమ నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో వరలక్ష్మికి సంబంధించిన కొన్ని సన్నివేశాలతో పాటు మరికొన్ని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని దర్శకుడు మురుగదాస్ నిర్ణయించుకున్నట్లుగా తెలిసింది. దీంతో పాటు కొన్ని డైలాగ్స్‌ను మ్యూట్ చేయాలని కూడా ఆయన తన టీమ్‌కు చెప్పినట్లు సమాచారం. మరోవైపు ఆ అభ్యంతరకర సన్నివేశాలను తొలగించేందుకు డిస్ట్రిబ్యూటర్లు-థీయేటర్ల యజమానుల సంఘం అంగీకరించినట్లు తెలిసింది.
సినీ స్టార్ల స్పందన…
‘సర్కార్’ చిత్రం ఎదుర్కొంటున్న వివాదంపై సినీ స్టార్లు రజనీకాంత్, కమల్‌హాసన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. “సెన్సార్ బోర్డు సినిమా ప్రదర్శనకు అనుమతి ఇచ్చాక పలు సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేయడం, పోస్టర్లను చించి ఆందోళన చేయడం సబబు కాదు. అవి అనైతిక చర్యలు. ఈ చర్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను”అని రజనీకాంత్ ట్వీట్ చేశారు. కమల్‌హాసన్ స్పందిస్తూ… “సెన్సార్ ప్రక్రియ పూర్తిచేసుకున్న ‘సర్కార్’ సినిమా పట్ల ఈవిధంగా ప్రవర్తించడం ప్రస్తుత ప్రభుత్వానికి కొత్తేమీ కాదు. విమర్శలను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుంది. కమర్షియల్ రాజకీయ నాయకులు ఎప్పటికైనా కనుమరుగైపోవాల్సిందే. మంచి వాళ్లే గెలిచేది”అని పేర్కొన్నారు.

Vijay’s Sarkar Movie  in disputes

Telangana News