Home రాష్ట్ర వార్తలు చంచల్‌గూడకు విక్రమ్

చంచల్‌గూడకు విక్రమ్

14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధింపు

Vikram

హైదరాబాద్ సిటీబ్యూరో: కాల్పుల కేసులో మాజీమంత్రి ముఖేష్‌గౌడ్ తనయుడు విక్రమ్‌గౌడ్ జైలు పాలయ్యాడు. గత నెల 28న తెల్లవారుజామున ఫిల్మింనగర్‌లోని తన ఇంట్లో కిరాయి ముఠాతో కాల్పులు జరిపించుకున్న విక్రమ్‌గౌడ్ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చిక్సిపొందుతూ గురువారం డిశ్చార్జి అయ్యాడు. ఆ మరుక్షణమే బంజారాహిల్స్ పోలీసులు అతన్ని అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. మెజిస్ట్రేట్ విక్రమ్‌గౌడ్‌కు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో అతన్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయి తే తనకు బెయిల్ ఇవ్వాలంటూ అతని తరపున న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను మెజిస్ట్రేట్ తోసిపుచ్చారు. కేసు తీవ్రత దృష్టా విక్రమ్‌గౌడ్‌కు బెయిల్ ఇవ్వరాదని పోలీసులు వాదన వినిపించడం తో మెజిస్ట్రేట్ ఏకీభవించారు. దీంతో విక్రమ్ బెయిల్ పిటిషన్ రద్దయ్యిం ది. ఇదే కేసులో కిరాయి ముఠా సభ్యులు నందకుమార్, షేక్ అహ్మద్, రయీస్ ఖాన్, కె.బాబుజాన్, ఎ.గోవింద్‌రెడ్డిలను అరెస్టు చేసి జైలుకు పంపించిన విషయం తెలిసిందే. ఈ కేసులో పరారీలో ఉన్న వెంకటరమణ, గౌస్‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.  జైలులో రిమాండ్‌లో ఉన్న విక్రమ్‌గౌడ్‌కు అండర్ ట్రయల్ నెంబర్ 8407ను జైలు అధికారులు కేటాయించారు. అతని ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో జైలు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడు.