Home రాజన్న సిరిసిల్ల మిడ్‌మానేరు పనులను అడ్డుకున్న మానువాడ గ్రామస్థులు

మిడ్‌మానేరు పనులను అడ్డుకున్న మానువాడ గ్రామస్థులు

Midmaniar-Project1

బోయినపల్లి: తమకు పరిహారం అందించెవరకు మధ్యమానేరు ప్రాజెక్టు పనులను సాగనివ్వమని మానువాడ గ్రామస్తులు బుధవారం మిడ్‌మానేరు ప్రాజెక్టు, కట్ట, స్పిల్ వే పనులను అడ్డుకున్నారు. బోయిన్‌పల్లి మండలం మానువాడ వద్ద మిడ్‌మానేరు ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న విషయం తెల్సిందే. అయితే ముంపు గ్రామంగా మానువాడను గుర్తించకుండా పరిహారం ఇవ్వకుండా పనులు జరుగుతూనే ఉన్నాయి. ప్రాజెక్టు తమ భూములన్ని ముంపుకు గురైనప్పటికి తాము ఇక్కడ ఉండి చేసేది ఏమిలేదని తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతునే ఉన్నారు.

ఇప్పుడు టిఆర్‌ఎస్ ప్రభుత్వం పెడచెవిన పెడ్తుండడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నామని ఆందోళన కారులు ఆవేదన చెందుతున్నారు. తమకు పరిహారం అందించకుండా పనులు చేస్తామంటే సాగనిచ్చేది లేదంటూ సర్పంచ్ రామిడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాదాపు నాలుగు వందల మంది గ్రామస్థులు కట్టవద్దకు వెళ్లి పనులను అడ్డుకున్నారు.  దీంతో మిడ్ పనులు నిలిచిపోయాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు గ్రామస్థులు ప్రాజెక్టు వద్దనే ఉన్నారు. తమను విస్మరించి పనులు చేస్తే బాగుండదని కాంట్రాక్టర్లను హెచ్చరించారు. కాగా ఉదయం నుండి పనులు ఉన్నప్పటికి ఆ ప్రాంతానికి అధికారులు, నాయకులు రాకపోవడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.