Home దునియా పట్వారి గొలుసురాతల మర్మం తెలుసా!..

పట్వారి గొలుసురాతల మర్మం తెలుసా!..

Writting

ఊర్లల్ల రాత పూతలు వచ్చినోల్లకు పెద్దవిలువ. ఎన్కట అందరికి సదవరాదు రాయరాదు ఊరన్నకాడ పట్వారి, పోలీసు పటౌండ్లకు రాతవచ్చేది. ఇంక కొందరికి సుతా వస్తుండేది. అయితే అక్షరాలు కుదురుడు అందరికి ఒక్క తీరుగ ఉండదు. ఇప్పటికి కొందరు మంచిగ కుదిరిచ్చి రాస్తరు. కొందరు కొంగలు తొక్కిన మడికట్టోలె కన్పిచ్చెటట్టు రాస్తరు. ఇగ పట్వార్ల రాత ఎవని అయ్యకు అంతుపట్టది. పట్వారీలు అంటే భూముల లెక్కలన్ని రాసేటాయన. పాణికాయిదాలు పట్టకాయిదాలల్ల భూమిని ఎకరాలల్ల గుంటలల్ల ఎక్కిచ్చేటాయన. ఆయన రాసిన గొలుసుకట్టు రాత భలే గమ్మత్తి ఉంటది. కలం రాత మొదలు పెట్టిండంటే పదం అయ్యేదాక ఆగది. వాక్యం పూర్తి అయ్యేదాక ఆగది. పూర్వకాలంల భూమిల కాయిదాలు రాస్తే ఈ కాలంల ఇంకొకరికి తెల్వది. అక్షరాలు తెలుగు అయినా అందరికి అర్థం కాదు.

పరిణామ క్రమంలో అక్షరాలు మార్పు చేసికున్నయి. అయితే పట్వార్లు అంటే శిక్కులోల్లు వీల్ల భూమి వాల్ల దాండ్ల వాల్ల భూమి వీల్ల దాంట్ల రాస్తరు తక్కువ ఎక్కిస్తరు. పట్టాదారు పాణి పుస్తకాలల్ల ఉర్దూ పదాలు తెలుగులో ఉంటయి. అవి ఈ కాలంల అర్థం కావు. అందుకు భలే శిక్కులతో ఆట ఆడిచ్చే కథ జరిగే అవకాశాలు ఉంటయి. అట్లనే నోట్లె నాలికె లేనోల్లను దింపే అవకాశం పంటది. అయితే ఇవన్ని పాతకాలంల ఇప్పుడు ప్రక్షాలన తర్వాత ఆధునికత వచ్చింది. రాతకోతలు పోయి కంప్యూటర్ ప్రింట్‌లు వచ్చినై.తెలుగు గొలుసు రాతలు ఉన్నట్టే ఇంగ్లీషుల సుత గొలుసు అంటుకున్నట్టు రాస్తరు. దీన్నే కలిపిరాత అంటరు. రాతలల్ల రకరకాలు ఉంటాయి. మనస్తత్వాలు ఉన్న తీరు రాసినట్లు కన్పిస్తది. అయితే చేతిరాతలు కూడా వయస్సును బట్టి మారిపోతుంటాయి. చిన్నప్పుడు వయస్సుమీద ఉన్నప్పుడు అందంగా రాసేవాల్లు రానురాను ఓపిక లేనట్టు సగం సగం రాస్తరు. రాతలు అలవాటు లేనివాల్లకు రాతరాచుడు కూడా కష్టమే. ఇదివరకు ఊర్లల్ల ఉత్తరాలు రాసేవాల్లు ఉండేది. ఉత్తరం రాయించుకొని పెనిమిటి బొంబయి, భీవండిల ఉంటే అక్కడికి ఇక్కడి విషయాలు తెలిపేది. ఇప్పుడైతే సెల్‌ఫోన్స్, వాట్సప్‌లు , వీడియోకాల్స్ ఊరిదాక వచ్చినంక చేతి రాత దాదాపు మాయం అయ్యింది.

చేతి రాత మంచిగ ఉండాలని బడిలో చూచిరాత రాయించే వాల్లు చూచిరాతలో అక్షరం కుదరడం వస్తుంది. ఆ తర్వాత నోట్స్ రాయడం అలవాటైనాక పరీక్షల్లో అందంగా రాస్తేనే మార్కులు వస్తుండేది. తర్వాత తర్వాత కాలంలో రాత పూర్తిగా మాయం అయ్యే స్థితి వచ్చింది. ఎవరిని చూసిన సెల్‌లో మెసేజ్‌లు మెయిల్‌లో టైపింగ్ కన్పిస్తున్న కాలం. ఒక్క బడి పిలగాండ్ల మాత్రమే రాస్తున్నరు.

ఈ కాలంల చేతిరాతల అందుకొరకు శిక్షణలు కూడా ఉన్నాయట. కాలక్రమంలో అక్షరాల రాత మారుతున్నది. సిరాబుడ్డిల సిరాను కలంతోని అద్దుకుంట రాసేవాల్లు. సిరా తయారు చేయాలంటే బియ్యపు గింజలను నల్లగా అయ్యేదాక ఏంచి వాటిని తీసి నీళ్ళల నానబెట్టి గిన్నెల చిక్కటి ద్రవం చేస్తే సిరా(ఇంకా) తయారు అయితది. ఆ సిరాతోని కాయిదాలు రాసేవాల్లు. ఆ రాతలు పదికాలాలపాటు ఉండేది. తర్వాత తర్వాత ఇంకుపెన్నులు ఇంకా కొన్నేండ్లకు రీఫిల్ పెన్నులు వచ్చినయి. పత్తి పెన్నులు పోయినయి. ఒకప్పుడు పెనుకు పత్తిగడ్డ ఉండేది. అందిలా శాయి పోసేది. సిరా శాయి అని కూడా అంటరు. ఇప్పుడు వాడి పారేసే పెన్నులు వచ్చినయి.  ఒకప్పుడు ఊరికి ఒకరిద్దర సదువు వచ్చేవాల్లుంటే ఇప్పుడు ఊర్లల్ల అందరికీ సదువు వస్తున్నది. చదువు రాని కుటుంబాలు లేనేలేవు. అయితే ఆ కొందరిలో ఇంగ్లీష్ వస్తే మిగతా వాల్లకు తెలుగు మీడియంల అయినయి.
అక్షరం ఒక జ్ఞానం అందరికీ వర్తిస్తుంది. గ్రామాల్లో సర్కారు బడులకు ఇప్పుడు పిల్లలే కరువు అయ్యిండ్రు. బడిఈడు పిల్లలు బడి బయట ఎవరూ లేని కాలం రావడం సంతోషం. రాతలు మారినట్టె, ఆలోచనల్లోనూ, ఆధునికత రావాల్సిన అవసరం ఉన్నది.Annavaram-Devendar

                                                                                  అన్నవరం దేవేందర్ 94407 63479