ముంబయి: గత నాల్గేళ్లుగా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు క్రికెట్, బాలీవుడ్ ప్రేమ పక్షులు విరాట్ కోహ్లి, అనుష్క శర్మ. తమ ఎంగేజ్మెంట్, పెళ్లి విషయంలో వీళ్లు పబ్లిగ్గా నోరు విప్పకపోయినా.. ప్రస్తుతం ఎక్కడికెళ్లినా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ తమ రిలేషన్షిప్ గురించి చెప్పకనే చెబుతున్నారు. ఎప్పుడెప్పుడు పెళ్లి కబురు చెబుతారా అని క్రికెట్, సినీ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా విరుష్క పెళ్లిపై ఓ వార్త హల్ చల్ చేస్తోంది. తన ప్రేయసి అనుష్క శర్మను కోహ్లీ వచ్చే వారం వివాహం చేసుకోబోతున్నారు అనేది ఈ వార్త సారాంశం. తాజాగా బిసిసిఐ శ్రీలంకతో వన్డే, టీ20 కోసం ప్రకటించిన జట్టులో విరాట్‌ను ఎంపిక చేయలేదు. త్వరలో దక్షిణాఫ్రికాలో జరిగే సిరీస్ కోసం అతనికి విశ్రాంతి ఇచ్చిన్నట్టు బోర్డు చెబుతోంది.
మరోవైపు వచ్చే వారం కోహ్లీ తన ప్రియురాలు బాలీవుడ్ భామ అనుష్క శర్మను వివాహమాడేందుకే లీవ్ తీసుకున్నాడని సమాచారం. డిసెంబరు 9, 10, 11, 12 తేదీల్లో ఇటలీలో విరుష్క వివాహం ఘనంగా జరుగనుందని తెలుస్తోంది. ఈ నెల 12న వీరి వివాహం జరగనుండగా, 9వ తేదీ నుంచే పెళ్లి వేడుకలు జరగనున్నట్లు సమాచారం. వీరిద్దరూ గురువారం ఇటలీకి బయలుదేరుతున్నారట. విరూష్క పెళ్లి వేడుకకు ఇరువురు కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇటలీ వెళ్లేందుకు ఇప్పటికే టికెట్లు కూడా బుక్ చేసుకున్నారట. ఇటలీలోని మిలాన్‌లో వీరిద్దరూ వివాహం చేసుకోనున్నారని, అయితే ఈ పెళ్లికి ఏ క్రికెటర్ హాజరుకావడంలేదని, క్రికెటర్ల కోసం ప్రత్యేకంగా డిసెంబరు 21న ముంబయిలో రిసెప్షన్ ఏర్పాటు చేసిన్నట్లు తెలిసింది. కానీ… దీనిపై ఇరు కుటుంబ సభ్యుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలాఉండగా వచ్చే వారంలో అనుష్క, విరాట్ పెళ్లి చేసుకుంటున్నట్లు వచ్చిన వార్తలను అనుష్క అధికార ప్రతినిధి కొట్టిపారేశారు. అనుష్క పెళ్లి వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని చెప్పారు.