Search
Friday 16 November 2018
  • :
  • :

విరాట్ కోహ్లి, అనుష్కల పెళ్లికి సర్వం సిద్ధం!

kohli

న్యూఢిల్లీ: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మల వివాహంపై ఉత్కంఠ వీడడం లేదు. ఇద్దరి వివాహం ఇటలీలోని మిలాన్ నగరంలో జరుగనుందని జాతీయ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ అంశంపై ఇటు కోహ్లి కుటుంబ సభ్యులు కాని, అటు అనుష్క తల్లిదండ్రులు కాని అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయడం లేదు. కాగా, ఇరు కుటుంబాలకు చెందిన సమీప బంధువులు ఇప్పటికే ఇటలీకి చేరుకోవడం, కోహ్లి, అనుష్కలు కూడా భారత్ నుంచి బయలుదేరి వెళ్లడం పెళ్లి జరగడం ఖాయమనే వార్తలకు ఊతం ఇస్తోంది. కాగా, కోహ్లి, అనుష్కల వివాహానికి సంబంధించి తమకు ఇప్పటికే ఆహ్వానం అందిందని అనుష్క తల్లిదండ్రులు నివాసం ఉండే అపార్ట్‌మెంట్ వాసులు ఇప్పటికే ప్రకటించారు. అంతేగాక కొంతకాలం క్రితం డెహ్రాడూన్‌లోఅనుష్క, కోహిలను ఆశీర్వదించిన ఓ పురోహితుడు కూడా ఇటలీకి ప్రయాణం కావడంతో పెళ్లి వార్త నిజం కావొచ్చని అందరూ ఓ అంచనాకు వచ్చారు. కాగా, ఇటలీలో కొంత మంది సమీప బంధువులు, స్నేహితుల మధ్యనే ఈ వివాహం జరుగనుందని తెలిసింది. ఇందులో భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ దంపతులకు ఆహ్వానం అందినట్టు సమాచారం. అంతేగాక అనుష్క తన తరపున బాలీవుడ్ స్టార్లు అమేర్ ఖాన్, షారూఖ్ ఖాన్, నిర్మాత దర్శకుడు మనీష్‌శర్మలను ఆహ్వానించినట్టు తెలిసింది. కాగా, కోహ్లి తన చిన్ననాటి కోచ్‌తో పాటు మరికొంత మంది బాల్య మిత్రులను ఈ పెళ్లికి పిలిచినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు వివాహం ఈ నెల 12న జరుగుతుందని తెలుస్తోంది. అయితే ఇంకా అధికారికంగా దీనిపై ఎటువంటి సమాచారం రాలేదు. దీంతోపాటు 15న పెళ్లి జరుగుతుందనే మరో ప్రచారం కూడా జరుగుతుంది. ఇదిలావుండగా, వివాహం ముగిసే వరకు ఈ వార్తను రహాస్యంగా ఉంచాలని ఇరు కుటుంబాల వారు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని బయట ఎవరికి చెప్పొద్దని బంధుమిత్రులను వేడుకుంటున్నారు. కాగా, వివాహ రిసెప్షన్‌ను ముంబయిలో ఘనంగా నిర్వహించేందుకు ఇరు కుటుంబాల వారు నిర్ణయించినట్టు సమాచారం. ఈ నెల 21 లేదా 22 తేదీల్లో ఈ విందు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా సాగుతున్నట్టు తెలిసింది. వివాహం డిసెంబర్‌లోనే నిర్వహించేందుకు నాలుగు నెలల క్రితమే ఇరు కుటుంబాల వారు నిర్ణయించారని, అందువల్లే కోహ్లి వన్డే, టి20 సిరీస్ నుంచి వైదొలిగాడనే వార్తలు కూడా ఉన్నాయి. ఇదిలావుండగా మిలాన్ నగరంలోని ఓ విలాసవంతమైన హోటల్‌లో ఈ పెళ్లి జరుగనుందని, దీని కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. చాలా రోజుల నుంచే ఈ వేడుకకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయని, అయితే ఈ విషయం బయట పడకుండా ఇరు కుటుంబాల వారు చాలా జాగ్రత్తలు తీసుకున్నారని తెలిసింది.

Comments

comments