Home స్కోర్ కోహ్లికి పరీక్ష!

కోహ్లికి పరీక్ష!

  • అందరి కళ్లు టీమిండియాపైనే
  • నేడు విండీస్‌తో తొలి వన్డే

KOHLI1

పోర్ట్ ఆఫ్ స్పెయిన్ : ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఘోర పరాజయం చవిచూసి ఇంటాబయట విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియాకు శుక్రవారం వెస్టిండీస్‌తో జరిగే మొదటి వన్డే చావోరేవోగా మారింది. ప్రధాన్ కోచ్ అనిల్ కుంబ్లే వివాదం నేపథ్యంలో ఈ మ్యాచ్ కెప్టెన్ విరాట్ కోహికి చాలా కీలకంగా మారింది. ఇందులో గెలిచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు శుభారంభం చేయాలనే లక్షంతో కోహ్లి ఉన్నాడు. అంతేగాక, జట్టును గెలిపించి తనపై వస్తున్న విమర్శలకు గట్టి సమాధానం చెప్పాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. ప్రధాన ఓపెనర్ రోహిత్ శర్మ, ఏస్ బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రా లేకుండానే భారత్ ఈ సిరీస్‌లో ఆడనుంది. దీని ప్రభావం ఎలా ఉంటుందో తొలి మ్యాచ్ ప్రారంభమైతే కానీ తెలియదు.
సులువుకాదు…
పాక్ చేతిలో ఘోర పరాజయం చవిచూసిన ఆత్మవిశ్వాసం కోల్పోయిన టీమిండియాకు విండీస్‌తో పోరు అంత సులువుకాదు. సొంతగడ్డపై ఆ జట్టును ఓడించడం అనుకున్నంత తేలికకాదనే చెప్పాలి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లు విండీస్‌కి అందుబాటులో ఉన్నారు. అంతేగాక, సొంత పిచ్‌లు వారికి అనుకూలంగా ఉండే అవకాశాలున్నాయి. కాగా, కోచ్ కుంబ్లే తన పదవికి రాజీనామా చేయడం, దీనికి కోహ్లిని బాధ్యుడిగా చేయడంతో అభిమానులు అతనిపై గుర్రుగా ఉన్నారు. మాజీ క్రికెటర్లు కూడా కోహ్లి తీరును ఎండగడుతున్నారు. ఇలా వరుస విమర్శలతో సతమతమవుతున్న విరాట్‌కు జట్టును ముందుండి నడిపించడం అంత సులువుకాదు. కోచ్‌తో తీవ్ర వివాదం నేపథ్యంలో కోహ్లి కూడా కాస్త ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. కుంబ్లేను తొలగించేందుకు కావాలనే ఫైనల్లో చెత్త ప్రదర్శన చేశాడనే తీవ్ర ఆరోపణలు కోహ్లిని వెంటాడుతున్నాయి. దీన్ని తొలగించుకోవాలంటే విండీస్‌తో జరిగే మ్యాచ్‌లో అసాధారణ ప్రతిభను కనబరచక తప్పదు. కానీ, విండీస్‌ను అంత తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు.
పంత్‌కు ఛాన్స్!
కాగా, రోహిత్ శర్మకు విశ్రాంతి కల్పించిన నేపథ్యంలో అతని స్థానంలో యువ సంచలనం రిషబ్ పంత్‌ను తుది జట్టులో ఆడించే అవకాశాలున్నాయి. విధ్వంసక బ్యాటింగ్‌కు పెట్టింది పేరుగా మారిన పంత్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. శిఖర్ ధావన్‌తో కలిసి అతను ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశాలున్నాయి. అయితే అజింక్య రహానెతో అతనికి పోటీ తప్పెలా లేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడని రహానెను ఈసారి అవకాశం కల్పించే పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. ఇదే జరిగితే పంత్ పెవిలియన్‌కే పరిమితం కాక తప్పదు.
ఇద్దరికీ కీలకం…
మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఘోరంగా విఫలమైన సీనియర్ ఆటగాళ్లు యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీలకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. జట్టులో స్థానం నిలబెట్టుకోవాలంటే వీరిద్దరు సిరీస్‌లో మెరుపులు మెరిపించక తప్పదు. కొంతకాలంగా ఇద్దరు పేలవమైన ఫాంతో సతమతమవుతున్నారు. వీరిని తప్పించి యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వాలనే డిమాండ్ ఊపందుకుంది. జూనియర్ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో సహా చాలా మంది వీరిద్దరికి ఉద్వాసన పలికే సమయం అసన్నమైందని పేర్కొంటున్నారు. దీంతో సెలెక్టర్లు కూడా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విండీస్ సిరీస్ ఇటు ధోనీకి, అటు యువీకి చాలా ప్రతిష్ఠాత్మకంగా మారింది. భారీ ఇన్నింగ్స్‌లతో చెలరేగాల్సిన పరిస్థితి వీరికి నెలకొంది. ఈసారి విఫలమైతే మాత్రం యువీకి జాతీయ జట్టులో స్థానం కాపాడుకోవడం అనుకున్నంత తేలిక కాదు. దీంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. ధోనీ కూడా ఇదే ఉద్దేశంతో ఉన్నాడు. ఇద్దరు కూడా మెరుగైన ఆటతో జట్టును ఆదుకునేందుకు తహతహలాడుతున్నారు.
ఈసారైనా…
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆశించిన విధంగా రాణించని స్టార్ బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు విండీస్ సిరీస్ సవాలుగా మారింది. ఫైనల్లో వైఫల్యం వీరిని వెంటాడుతోంది. ఇద్దరు కూడా తుది సమరంలో ధారళంగా పరుగులిచ్చుకున్నారు. బ్యాటింగ్ లో కూడా ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు. దీంతో విండీస్ సిరీస్ వీరికి కీలకంగా తయారైంది. యువ ఆటగాళ్లు ఒక్కొక్కరే వెలుగులోకి వస్తున్న తరుణంలో ఏమాత్రం నిర్లక్షంగా వ్యవహరించిన తుది జట్టులో చోటు కోల్పోవడం ఖాయం. టెస్టుల్లో అసాధారణ రీతిలో చెలరేగి పోతున్న వీరు వన్డేల్లో మాత్రం చెత్త బౌలింగ్‌తో నిరాశ పరుస్తున్నారు. కానీ, విండీస్ సిరీస్‌లో మెరుగైన ఆటతో మళ్లీ గాడిలో పడాలనే ఉద్దేశంతో వీరున్నారు. ఇదే జరిగితే ప్రత్యర్థి జట్టుకు కష్టాలు ఖాయం. ఇక, కేదార్ జాదవ్, హార్ధిక్ పాండ్యాలు కూడా సత్తా చాటేందుకు తహతహలాడుతున్నారు. ఫైనల్లో విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించిన హార్ధిక్ విండీస్‌పై కూడా మెరుపులు మెరిపించేందుకు సిద్ధమయ్యాడు. సిరీస్‌లో అతను జట్టుకు కీలకంగా మారాడు. సిరీస్‌లో మెరుగైన ప్రదర్శనతో జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనే పట్టుదలతో పాండ్యా ఉన్నాడు. ఇక, కొత్త బౌలర్ కుల్దీప్ యాదవ్ కూడా సిరీస్‌పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. భువనేశ్వర్, మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్ తదితరులతో భారత బౌలింగ్ చాలా బలంగా ఉంది. బ్యాటింగ్ కూడా మెరుగ్గా ఉండడంతో సిరీస్‌లో కోహ్లిసేన ఫెవరెట్‌గా బరిలోది దిగుతోంది.
భారీ ఆశలతో..
కాగా, ఆతిథ్య విండీస్ కూడా సిరీస్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. సొంతగడ్డపై జరుగుతున్న సిరీస్‌లో పైచేయి సాధించాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్‌తో పోల్చితే విండీస్ కాస్త బలహీనంగానే ఉంది. అయితే సొంత గడ్డపై ఆడుతుండడం వారికి కలిసి వచ్చే అంశం. సిరీస్‌లో విండీస్ చాలా వరకు కొత్త ఆటగాళ్లతోనే బరిలోకి దిగుతోంది. హోల్డర్ సారథ్యంలో వరుస పరాజయాలు చవిచూస్తున్న విండీస్ బలోపేతమైన భారత్‌ను ఓడించి సత్తా చాటాలని తహతహలాడుతోంది. జొనాథన్ కార్టర్, కమిన్స్, జాసన్ మహ్మద్, చెస్ట్, కిరన్ పొవెల్ తదితరులతో విండీస్ సంచలనాలు సాధించాలని భావిస్తోంది. అయితే కొంతకాలంగా పేలవమైన ఆటతో నిరాశ పరుస్తున్న విండీస్ అసాధారణ ఆటను కనబరిస్తే తప్ప భారత్‌ను ఓడించడం చాలా కష్టం. కానీ, సమష్టి పోరాటంతో సంచలనాలు సృష్టించే సత్తా తమకుందని గతంలో విండీస్ చాలా సార్లు చాటింది. ఈసారి కూడా ఇటువంటి ప్రదర్శనే కనబరచాలని హోల్డర్ సేన భావిస్తోంది.